
మానవ అక్రమ రవాణా ప్రపంచ దేశాలకు పెద్ద సవాలు విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న మానవ అక్రమ రవాణాలో ఎక్కువ మంది బాధితులు మహిళలే. అమ్మకపు సరుకుగా మారిన మహిళలను కేవలం లైంగిక దోపిడీ కోసం విదేశాలకు తరలించడం సాధారణంగా మారింది. భారత్‌లో అక్రమ రవాణా బాధితుల్లో 80 శాతం మహిళలే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డుల ప్రకారం గత ఐదేళ్లలో సంవత్సరానికి సగటున మొత్తం 5 వేలకు పైగా మానవ అక్రమ రవాణా కేసులు నమోదవుతున్నాయి. బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ, జార్ఖండ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, అస్సాం...తదితర రాష్ట్రాల్లో ఈ ప్రభావం అధికంగా ఉన్నట్టు ఆ రికార్డులు పేర్కొంటున్నాయి.
అక్రమ రవాణా జరగకుండా అడ్డుకునేందుకు బలమైన చట్టాన్ని కోరుతూ బచ్‌పన్ బచావో ఆందోళన్, ఇతర పౌర సంస్థలు 2017లో దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని చేపట్టాయి. చట్టం ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ నేపథ్యంలో 2018లో మనుషుల అక్రమ రవాణాను నిరోధించడం, బాధితులను కాపాడడం, పునరావాసం కల్పించడం అనే దృష్టితో ఒక బిల్లుకు రూపకల్పన జరిగింది. బలవంతంగా పనులు చేయించుకోవడం, భిక్షాటన కోసం, బాలికల్లో అసహజ పద్ధతుల్లో మెచ్యూరిటీ వచ్చేలా హార్మోన్లపై రసాయనాల ప్రయోగం, వివాహం పేరుతో మోసం చేసి తరలించడం వంటి వాటిని తీవ్ర స్థాయి నేరాలుగా ఈ బిల్లులో ప్రస్తావించారు. నిర్ణీత కాల వ్యవధిలో విచారణ, బాధితులను స్వస్థలానికి పంపే ఏర్పాటు, బాధితులు భౌతిక, మానసిక క్షోభ నుంచి బయటపడేందుకు 30 రోజులలో తాత్కాలిక పరిహారం, అక్రమ రవాణాకు సహకరించే వారిపై చట్టపరమైన చర్యలు, శిక్షలను ఈ బిల్లులో పొందుపరిచారు. తొలిసారిగా పునరావాస నిధిని ఏర్పాటు చేసి బాధితుల విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య రక్షణకు వినియోగించేలా రూపొందించారు. అంతర్జాతీయ స్వభావాన్ని కలిగిఉన్న నేపథ్యంలో నేషనల్ యాంటీ ట్రాఫికింగ్ బ్యూరో, విదేశాలతో, అంతర్జాతీయ సంస్థలతో పరస్పర సమన్వయం, దర్యాప్తులో విదేశీ సహాయం తదితర చర్యలకు అవకాశం ఉండేలా కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన బిల్లును నాటి శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. లోక్‌సభలో అమోదం పొందిన సదరు బిల్లు ఇప్పటి వరకూ రాజ్యసభకు చేరలేదు.
ఇదిలా ఉండగానే మానవ అక్రమ రవాణా నివారణ, సంరక్షణ, పునరావాసం బిల్లు-2021 పేరుతో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరో బిల్లును ప్రతిపాదించినప్పటికీ చట్టం రూపొందేలా సరైన దిశగా అడుగులు ముందుకు పడడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి కొరవడడమే ఇందుకు కారణం. బాధితుల సంరక్షణ, పునరావాస చర్యల గురించి ప్రభుత్వానికి జవాబుదారీతనం లేకుండా పోయిందనే విమర్శలూ ఉన్నాయి. అక్రమ రవాణాను ఎక్కడికక్కడ నిలువరించేలా యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ల ఏర్పాట్లపైన కూడా సరైన చర్యలు లేవు. దేశంలో పశువులు, ఇతర అంశాల్లో అక్రమ రవాణాను నిలువరించేలా వివిధ చట్టాలున్నా ఇంతకాలం మానవ అక్రమ రవాణాతో కలిపి ఒక సమగ్ర చట్టం రూపొందించకపోవడం దురదృష్టకరమే. మనుషులను పశువుల్లా కొని, విక్రయించినంత కాలం ఆ దేశంలో నాగరికత లేనట్టే లెక్క. కాబట్టి ఈ పార్లమెంటు సమావేశాల్లోనైనా మానవ అక్రమ రవాణాను నిరోధించేలా సమగ్రమైన చట్టాన్ని రూపొందించి భవిష్యత్తులో అక్రమ రవాణా లేని దేశంగా భారత్‌ను నిలపడంలో ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుందాం.
- డా|| సి.ఎన్. క్షేత్రపాల్ రెడ్డి,
సెల్ : 9059837847