
ఆంధ్రా యూనివర్శిటీకి అనుబంధంగా 356 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 12 డిగ్రీ కళాశాలలకు ఈ విద్యా సంవత్సరం యూనివర్శిటీ అనుమతులు రద్దు చేసింది. మిగిలిన కళాశాలల్లో మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలు పూర్తయిన తరువాత మళ్లీ జూన్ 1 నుండి తరగతులు ప్రారంభం అయ్యాయి. సాధారణంగా ఒక సెమిస్టర్ సిలబస్ పూర్తి కావడానికి ఐదు నెలలు పడుతుంది. కానీ కాలేజీలు ప్రారంభమై మూడు నెలలు మాత్రమే కావడంతో ఏ కాలేజీలో కూడా 60 శాతానికి మించి సిలబస్ పూర్తి కాలేదు. కొన్ని కాలేజీల్లో 40 శాతం మాత్రమే సిలబస్ అయింది. కొత్తగా మంజూరైన డిగ్రీ కళాశాల విద్యార్థులకు కనీసం పాఠాల పేర్లు కూడా తెలియదు. గతంలో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం అయ్యేసరికి సిలబస్, ప్రాక్టికల్స్ పూర్తి అయిపోయి ప్రిపరేషన్‌కు కొంత సమయం ఉండేది. ఇప్పుడు సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం అయ్యే ముందు రోజు వరకు కూడా ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి.
గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణతా శాతం దారుణంగా పడిపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో 100 కోర్సుల్లో ఒక్క విద్యార్థి కూడా జాయిన్ కాలేదు. మరో 153 కోర్సుల్లో 15 శాతం లోపు జాయిన్ అయ్యారు. దీనిని ఆసరాగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ కోర్సులన్నీ మూసివేసేసే పనిలో ఉంది. ఈ కోర్సులన్నీ మూసేస్తే మొత్తం 9,748 సీట్లు రద్దు చెయ్యబడతాయి. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణతా శాతం తగ్గడం వలనే డిగ్రీలో అడ్మిషన్లు తగ్గాయని చెప్తున్నవాళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు? డిగ్రీలో కూడా ఉత్తీర్ణతా శాతం తగ్గిపోయే విధంగా నిర్ణయాలు చేస్తున్నారు. సిలబస్ పూర్తి కాకుండా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు ఏం రాసి పాసవుతారు. ఈ రోజు డిగ్రీ విద్యార్థులకు సిలబస్ పూర్తి కాకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ అడ్మిషన్ల వలన విద్యా సంవత్సరాన్ని ఆలస్యంగా ప్రారంభించడం. ఇంటర్న్‌షిప్, నాలుగు సంవత్సరాల డిగ్రీ వంటి విధానాలు తీసుకురావడం.
ఆన్‌లైన్ అడ్మిషన్లు-సమయం వృధా
రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే 2020 విద్యా సంవత్సరం నుండి డిగ్రీలో ఆన్‌లైన్ అడ్మిషన్ విధానాన్ని తీసుకు వచ్చింది. దీనివలన అడ్మిషన్లు పూర్తి కావడానికి నెలల తరబడి సమయం పడుతున్నది. మొదటి విడతలో అడ్మిషన్ దొరకనప్పుడు రెండు, మూడు కౌన్సిలింగ్స్ పూర్తి అయ్యేంత వరకు వేచి ఉండాల్సి వస్తుంది. మూడు విడతలు పూర్తి అయ్యేసరికి కొంత సిలబస్ అయిపోతుంది. దీంతో మూడో విడతలో జాయిన్ అయిన వారు, స్పాట్ అడ్మిషన్ ద్వారా జాయిన్ అయిన వారు నష్టపోతున్నారు. ఈ ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్లు అవడం వలన సమయం సరిపోక సిలబస్ పూర్తి కావడం లేదు. డిగ్రీ అడ్మిషన్లు కూడా బాగా ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయి. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని నెలల తరబడి కాలేజీల్లో చేరకుండా ఉండటంతో విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేర్చుతున్నారు. దీనితో డిగ్రీలో అడ్మిషన్లు ప్రతి ఏడాది తగ్గుతూ వస్తున్నాయి.
కొత్త కొత్త విధానాలు-విద్యార్థులలో గందరగోళం
విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవడంతో పాటు కొత్తగా వస్తున్న ఇంటర్న్‌షిప్, నాలుగు సంవత్సరాల డిగ్రీ వంటి విధానాలు విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అధ్యాపకులు వీటి కోసం ఎక్కువ సమయం కేటాయించవలసి వచ్చినప్పటికీ సిలబస్ పూర్తి చెయ్యలేక పోతున్నారు. గతేడాది డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆరవ సెమిస్టర్‌కు బదులుగా ఇంటర్న్‌షిప్ నిర్వహించారు. తరువాత డిగ్రీలో ప్రతి సంవత్సరంలో 2 నెలల పాటు ఈ ఇంటర్న్‌షిప్ వుంటుంది. చివరి సంవత్సరంలో 6 నెలలు ఉంటుందన్నారు. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్‌ల మాదిరిగానే ఇంటర్న్‌షిప్ కూడా ఒక సబ్జెక్ట్‌గా ప్రతిరోజూ బోధించబడుతుంది అంటున్నారు. అసలు ఈ ఇంటర్న్‌షిప్ ఎలా నిర్వహించాలి అన్న దానిపై ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదు. గత సంవత్సరం ప్రారంభించిన ఈ ఇంటర్న్‌షిప్ విధానంపై పూర్తి అవగాహన లేకుండానే ఈ విద్యా సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల డిగ్రీ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనికోసం రెండు సబ్జెక్టులను (ఒకటి మేజర్ ఇంకొకటి మైనర్ సబ్జెక్ట్‌గా) ఎంచుకోవాలన్నారు. కానీ ఆన్‌లైన్‌లో ఒక సబ్జెక్ట్ మాత్రమే చూపించి దాన్నే ఎంచుకోమంటున్నారు. మైనర్ సబ్జెక్ట్‌ను ఎలా ఎంచుకోవాలనే ఆప్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు మేజర్, మైనర్ సబ్జెక్ట్‌లతో పాటు మిగిలిన సబ్జెక్ట్‌లు కూడా ప్రాథమికంగా నేర్చుకోవాలి అంటున్నారు. ఇది ఎలా నిర్వహిస్తాము అనేదాన్ని కాసేపు పక్కన పెడితే దీని మూలంగా డ్రాపౌట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ప్రపంచంలో చాలా దేశాలు సాధారణ డిగ్రీలతో పాటు ఆనర్స్ డిగ్రీలను అందిస్తున్నాయి. మన దేశంలో కూడా 1980 నుండి ఢిల్లీ యూనివర్సిటీలో ఆనర్స్ డిగ్రీని మూడు సంవత్సరాలు సాధారణ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇస్తున్నది. కాని ఇప్పుడు నూతన విద్యా విధానంలో నాలుగు సంవత్సరాల కోర్స్ పూర్తి చేసి, 160 క్రెడిట్లను సంపాదించిన వారికి మాత్రమే ఆనర్స్ డిగ్రీ పొందే అర్హత ఉంటుందని చెబుతున్నది. దీనివలన విద్యార్థులు మరో సంవత్సరం పాటు ఉండడానికి అదనంగా డబ్బు ఎక్కువ చెల్లించవలసి వస్తుంది. విద్యార్థులు అధిక ఫీజులు చెల్లించలేక డ్రాపౌట్లు పెరుగుతాయి. డ్రాపౌట్లు తగ్గించాల్సిన ప్రభుత్వం ఎక్కువ ఎగ్జిట్ పాయింట్లు వుండేలా చేసి దాన్నే చట్టం చేస్తున్నది.
దీంతో పేద, అణగారిన విద్యార్థులు 15 సంవత్సరాల సుదీర్ఘ పాఠశాల విద్య తర్వాత నాలుగు సంవత్సరాల డిగ్రీని చదవాల్సి రావడం అనివార్యమైంది. ఒక సంపన్న విద్యార్థి 14 లేదా 15 సంవత్సరాల వయసులో వృత్తిపరమైన డిప్లమాతో డ్రాప్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే పేద విద్యార్థులకు మాత్రమే ఎగ్జిట్ పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే జీవో నెం-77 తీసుకువచ్చి ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న పి.జి విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వకుండా చాలా మంది పేద విద్యార్థులకు పి.జి విద్యను దూరం చేశారు. జీవో నెం-107, జీవో-108 తీసుకు వచ్చి వైద్య విద్యలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తీసుకు వచ్చి వైద్య విద్యను దూరం చేస్తున్నారు. ఇప్పుడు డిగ్రీలో కొత్త కొత్త విధానాలు తీసుకు వచ్చి డిగ్రీ విద్యను దూరం చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రాథమిక విద్యను కూడా దూరం చేస్తారు. ప్రతి వేదికపైనా గిరిజనులను ఉద్ధరించడం కోసం నేను పుట్టాను, సామాజికంగా వెనుకబడిన తరగతుల వారికి నేను అండగా ఉంటాను...అని చెప్పుకొస్తున్న సి.ఎం జగన్మోహన్ రెడ్డి అదే తరగతుల నుండి వస్తున్న పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తును కాపాడుకోవాలంటే ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే.
వ్యాసకర్త : డి.రాము ఎస్.ఎఫ్.ఐ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి, సెల్: 9705545164