
డెబ్బై అయిదు సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో ఇల్లు లేనివారికి ఇల్లు కట్టించి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ గొప్పగా ప్రకటించారు. 'నవ రత్నాలు-అందరికీ ఇళ్లు', 'జగనన్న కాలనీలు' పేరుతో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్ళ నిర్మాణాలు చేబడతామని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. పాలకుల మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదు.
గాలి మేడలు
రాష్ట్రంలో 30 లక్షల 76 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని, మొదటి దశలో 15 లక్షల 60 వేల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించామని ప్రభుత్వం ప్రకటించింది. 17,005 లేఅవుట్లలో 50 వేల కోట్ల రూపాయల ఖర్చుతో గృహ నిర్మాణాలు, మరో 32 వేల కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేస్తున్నది. మూడేళ్ల కాలంలో ఇప్పటికి పూర్తయిన ఇళ్లు కేవలం 60 వేలు (5 శాతం) మాత్రమే. 4 లక్షల 35 వేల ఇళ్ల నిర్మాణాలు (35 శాతం) పునాది, ఆ పై దశకే పరిమితం అయ్యాయి. 15 లక్షల ఇళ్లల్లో 3 లక్షల ఇళ్లకు శంకుస్థాపన కూడా చేయలేదు. పలు ప్రాంతాలలో పేదలకు స్థలాలు కేటాయిస్తూ అందమైన అట్టలతో పట్టాలు ఇచ్చినా ఇంతవరకు స్థలం కూడా చూపించిన పాపాన పోలేదు. ఇక రెండో దశ 15 లక్షల ఇళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారో అతి గతి లేదు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ పేదల కోసం నిర్మించిన టిడ్కో (టౌన్‌షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనే ప్రభుత్వ సంస్థ) ద్వారా నిర్మించిన బహుళ అంతస్తుల లోని 2 లక్షల 62 వేల ప్లాట్లను లబ్ధిదారులకు కేటాయిస్తామని ఈ ప్రభుత్వం పదేపదే చెప్పినా ఆచరణ రూపం ధరించలేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించామన్నా, అది అరకొరగానే సాగుతోంది. పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వటానికి ప్రభుత్వానికి మనసొప్పటం లేదు. పునాది దశలో ఉన్నవి, ప్రారంభంకాని నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారు. మధ్యతరగతి ప్రజల కోసం ప్రతి నియోజకవర్గం లోనూ స్మార్ట్ టౌన్‌షిప్‌లు పేరుతో ఆర్భాటంగా మరో పథకాన్ని పెట్టారు. ఆచరణలో జరిగిందేమీ లేదు. పలు ప్రాంతాల్లో గత ప్రభుత్వాల కాలంలో ప్రారంభించిన ఇందిరమ్మ, జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎమ్. కాలనీల్లో కూడా సౌకర్యాలు లేక ప్రజలు తల్లడిల్లుతున్నారు.
ఈ పాపం పాలకులదే
గృహ నిర్మాణం నత్తనడకన సాగటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. జగనన్న కాలనీలలో ఒక్కో ఇంటి నిర్మాణానికి లక్షా 80 వేల రూపాయలు మాత్రమే కేటాయిస్తున్నారు. పెరిగిన ఇనుము, సిమెంటు, ఇసుక, ఇతర మెటీరియల్ ధరలలో ఐదారు లక్షల రూపాయలు లేకుండా ఇళ్లు పూర్తయ్యే మార్గమే లేదు. ప్రజలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చే సహాయాన్ని నయా పైసా పెంచలేదు. పైపెచ్చు పొదుపు సంఘాల ద్వారా రూ. 35 వేలు అప్పు ఇప్పిస్తామని చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. అప్పు తెచ్చినా మళ్లీ ఎలా తీర్చుకుంటామని ప్రజలు ప్రశ్నిస్తున్నా, సమాధానం లేదు. మోడీ పేరు, బొమ్మ ఉండాలంటూ బిజెపి నాయకులు హడావిడి చేయడం తప్ప కేంద్ర ప్రభుత్వం నుండి ఇళ్ల నిర్మాణాలకు సహాయం పెంచే అంశం వైసిపి, బిజెపి లు పట్టించుకోవటం లేదు. పైపెచ్చు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించకపోతే, ఇచ్చిన స్థలాలు వెనక్కి తీసుకుంటామని, పట్టాలు రద్దు చేస్తామని వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా పేదలను బెదిరిస్తున్నారు. కొన్ని చోట్ల నిర్మాణాలను అనధికారికంగా కాంట్రాక్టర్లకు అప్పగించారు. వారు 35 వేల నుండి 95 వేల రూపాయలు కడితేనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తామని ప్రజలపై ఒత్తిడి చేస్తున్నారు. డబ్బు చెల్లించినా సరే జగనన్న కాలనీలలో కట్టే ఇళ్లకు తలుపులు ఉండవు. ప్లాస్టింగు ఉండదు. సున్నం వెయ్యరు. విద్యుత్తు, మంచినీటి కనెక్షన్లు ఉండవు. ఇంకా ఇతర సౌకర్యాలు లేకుండా స్లాబులు వేసి అప్పగిస్తాం, మిగిలిన పనులు మీరే పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు.
ఇళ్ల నిర్మాణాలన్నీ గందరగోళంగా ఉన్నాయి. ఇళ్ల నిర్మాణాలలో వస్తున్న ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం, అధికారులు పూనుకోవడం లేదు. ప్రభుత్వం గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు (48 గజాలు) మాత్రమే ఇళ్ల స్థలాలకు కేటాయించారు. కనీసం మూడు సెంట్లు లేకుండా ఇళ్ల నిర్మాణాలు ప్రయోజనకరంగా ఉండవు. పైపెచ్చు పట్టణాలకు 5 కిలోమీటర్ల నుండి 35 కిలోమీటర్ల దూరంలో లేఅవుట్లు వేశారు. దూరంలో ఇళ్లు ఉంటే పనులకు ఎలా వెళ్ళాలి? రవాణా ఖర్చులు ఎంత అవుతాయి? అనే సందేహాలతో పలు చోట్ల ప్రజలు ఇళ్ల నిర్మాణాలకు విముఖంగా ఉన్నారు. మీరు ఇళ్లు నిర్మించుకుంటారా? లేదా? ప్రభుత్వాన్ని నిర్మించమంటారా? అని ప్రభుత్వం ముందుగా ప్రజలను ఆప్షన్ అడిగింది. సుమారు 7 లక్షల 80 వేల మంది ప్రభుత్వాన్ని నిర్మించి ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రజలపై ఒత్తిడి చేసి ఆ సంఖ్యను కుదించారు.
అయినా 3 లక్షల 15 వేల మంది మేం కట్టుకోలేం, మీరే నిర్మించండని గట్టిగా ప్రభుత్వానికి చెప్పారు. అయినా ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేసి, మీరే కట్టుకోండి అంటూ గాలికి వదిలేసింది. ఇళ్లు నిర్మించుకునే వారికి కూడా ముందుగా అడ్వాన్స్ ఇవ్వకుండా పునాది దశ, గోడల దశ, స్లాబు దశ ఇలా మూడు దశల్లో బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. అప్పులు తీసుకొచ్చి జనం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాల్సి వస్తున్నది. కట్టుకున్న తర్వాత సకాలంలో బిల్లులు రాక పేదలు నానా అవస్థలు పడుతున్నారు. విద్యుత్, రోడ్లు ఇతర సౌకర్యాలు ముందుగానే కల్పిస్తామని చెప్పినా అవి పూర్తి స్థాయిలో జరగలేదు. కరెంట్ కనెక్షన్లు ఇచ్చినా, మోటార్లు లేక, ఉన్నా పని చేయక, పట్టణానికి దూరంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలకు కనీసం నీరు కూడా అందుబాటులో లేక ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించుకుని నిర్మాణాలు సాగించుకుంటున్నారు. ఒక్కొక్క ఇంటికి 10 నుండి 15 వేల రూపాయలు వరకు నీళ్లకే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కూలీలు రావటానికి, మెటీరియల్ తెచ్చుకోవడానికి రవాణా ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. సెంటు స్థలం అని చెప్పినా కొన్ని పట్టణాలలో 40 గజాల స్థలం కూడా చూపించలేదు.
ఇళ్ల పేరుతో రాజకీయం
తమకు రాజకీయ లబ్ధి చేకూరదనే ఆలోచనతో మూడేళ్ల క్రితమే కట్టి ఖాళీగా ఉన్న టిడ్కో ఇళ్లను పేదలకు ఇవ్వకుండా ప్రభుత్వం మొండికేసింది. అప్పులు తెచ్చి లబ్ధిదారులు 25 వేల నుండి లక్ష రూపాయలు వరకు నాలుగేళ్ల క్రితమే డిపాజిట్లు కట్టారు. బ్యాంకు రుణాలతో ప్రభుత్వం ఈ ఇళ్లు కట్టినందున, మీకు ఇళ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా వాయిదాలు కట్టాల్సిందేనని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులుగా ఉన్నందున ప్రభుత్వం వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాలను మార్చేస్తోంది. లబ్ధిదారులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. ఇళ్ల స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం చేసే పథకం ద్వారా... ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకున్న వారికి మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించడానికి వైయస్సార్‌సిపి ప్రభుత్వం నిరాకరిస్తున్నది. సగంలో ఆగిపోయిన ఇళ్లు పూర్తి చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి ఖజానా నింపుకోవడం మీద ఉన్న దృష్టి ఇళ్ల నిర్మాణాలపై లేదు. శాశ్వత గృహ హక్కు పేరుతో వన్ టైం సెటిల్‌మెంట్ పథకం పెట్టి 2011 నుండి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు పట్టాల పేరుతో 40 లక్షల మంది దగ్గర 10 వేల నుండి 40 వేల రూపాయలు వరకు వసూలు చేయటానికి పూనుకున్నది. వాలంటీర్ల ద్వారా పేదలను వేధించింది. కట్టకపోతే ఇళ్లు ఖాళీ చేస్తామని బెదిరించింది. అయినా ప్రజలు అత్యధిక చోట్ల కట్టలేదు. డబ్బు కట్టిన వారికి ఇప్పటికీ రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వలేదు. కనీసం సమాధానం చెప్పే నాథుడు కరువయ్యాడు.
గృహ నిర్మాణం కార్పొరేట్లకే
ప్రజలను భ్రమల్లో పెట్టి ఓట్లు గుంజుకోవటానికి, రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే పాలక పార్టీలు గృహ నిర్మాణ పథకాలను వాడుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో గృహ నిర్మాణానికి తగిన నిధులు కేటాయించడం లేదు. ఏమాత్రం చిత్తశుద్ధి కనబరచడంలేదు. ఇళ్ల స్థలాలకు భూములను అధిక రేట్లకు కొని వైయస్సార్‌సిపి ప్రజాప్రతినిధులు భారీ అవినీతికి పాల్పడ్డారు. వందల కోట్లు గడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రయివేట్ కంపెనీల ద్వారా ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అద్దెకు ఇచ్చే కొత్త పథకాన్ని రూపొందిస్తోంది. పేదల గృహ నిర్మాణాన్ని బడా కార్పొరేట్లకు అప్పగించడానికి పథకాలు సిద్ధం చేసింది. ఇళ్ల నిర్మాణాలలోనూ ప్రణాళికా బద్ధంగా వ్యవహరించడం లేదు. పేదలను నగరాలకు, పట్టణాలకు, గ్రామాలకు దూరంగా తరిమి వేస్తూ ప్రత్యేక దళిత పేటల తరహాలో కొత్త కాలనీలు ఏర్పరుస్తున్నారు. పని ప్రదేశాలకు దూరంగా ఇళ్ల నిర్మాణాలు సాగించడంతో పేదలు ఉపాధి కోల్పోతున్నారు. కట్టిన ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి. మళ్లీ పేదలకు అద్దెల భారం తప్పడం లేదు. గతంలో పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో పేదల గృహ నిర్మాణాలు జరిగేవి. సబ్సిడీ అధిక భాగం ఉండేది. కానీ దశలవారీగా సబ్సిడీలో కోత పెట్టేశారు. రుణాలు తెచ్చి ప్రభుత్వాలు ఇళ్లు నిర్మించడంతో పేదలను అప్పుల ఊబి లోకి దించేస్తున్నారు. దశాబ్దాల నుండి నివసిస్తున్న వారికి ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వకుండా, ఆ ఇళ్లపై హక్కు లేకుండా చేస్తున్నాయి. ఇళ్ల నిర్మాణాలకు తగినంత నిధులు కేటాయించకుండా ఎన్నికలకు ముందు అరకొరగా స్థలాలు, అస్తుబిస్తుగా నిర్మాణాలు, సౌకర్యాలతో సరిపెడుతున్నారు. అందరికీ ఇళ్లు ఇచ్చినట్లు నటిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారు. మళ్లీ ఓటు వేసి, తమను అధికారంలోకి తెస్తే అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేస్తామని నమ్మబలుకుతూ ప్రజలను మోసగిస్తున్నారు. గృహ కల్పనలో విఫలం కావడానికి నాడు, నేడు కేంద్ర, రాష్ట్ర పాలకుల విధానాలే కారణం.
ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలంటే ఒక్కో ఇంటికి ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలి. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించాలి. పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలి. మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలి. లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు ఉన్న బకాయిలను ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలి. పలు చోట్ల లిటిగేషన్లో ఉన్న స్థలాలను కేటాయించడంతో ఆ స్థలాలు కూడా పేదలకు దక్కలేదు. వాటికి ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇచ్చి నిర్మాణాలు చేపట్టాలి. మధ్యతరగతి ప్రజల కోసం అందుబాటు ధరల్లో లే అవుట్లు వేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. వడ్డీ లేని రుణాలతో నిర్మాణాలకు ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రభుత్వాలకు ఈ అంశాలన్నింటిని ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటున్నా చలనం లేదు. అందుకే ఆందోళన తప్పదు. ఈ నెల 11వ తేదీన సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద జరిగే ఆందోళనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి.
వ్యాసకర్త : సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబూరావు