Apr 23,2023 06:39

చరిత్రను వక్రీకరించడం జనసంహారం చేసే మారణాయుధం కంటే ప్రమాదకరం. ఈ వక్రీకరణ నేడు దేశం ఎదుర్కొంటున్న ఓ ప్రమాదం. గతం మీదనే పటిష్టమైన భవిష్యత్‌ నిర్మితమౌతుంది. మనల్ని మనం తెలుసుకోవడం కోసం చరిత్రను అధ్యయనం చేయాలి. గతాన్ని అధ్యయనం చేసిన వారు మాత్రమే వర్తమానంలో చరిత్రను సృష్టించగలుగుతారు. భవిష్యత్‌ను అంచనా వేయగలుగుతారు. అలాంటి చరిత్ర సైన్స్‌ ఆధారితంగా... శాస్త్రీయ దృక్పధంతో ముడిపడి వుండాలి. చరిత్ర అంటే రాజులు, వారి జీవనశైలి, విజయాల గురించి మాత్రమే మాట్లాడే రాజపత్రం కాదు. చరిత్రంటే అన్ని వర్గాల ప్రజలను, వారి జీవన విధానాన్ని ప్రతిబింబించాలి. భావితరాలకు మార్గదర్శి కావాలి. 'ఈ రాణి ప్రేమ పురాణం/ ఆ ముట్టడికైన ఖర్చులు/ మతలబులూ, కైఫీయతులూ/ ఇవి కావోరు చరిత్ర సారం' అంటాడు మహాకవి శ్రీశ్రీ. జీవ పరిణామ క్రమంపై 1859లో డార్విన్‌ రాసిన 'జాతుల ఆవిర్భావం' సిద్ధాంతం ఒక చారిత్రక సంచలనం. ఇదేదో ఊహాజనిత వాదం కాదు. విస్తృత పరిశీలన, అధ్యయనమే డార్విన్‌ సిద్ధాంత చారిత్రిక ప్రయాణం.
సృష్టివాదాన్ని వ్యతిరేకించడం దైవద్రోహం అని మతవాదుల వాదన. సకల చరాచర జగత్తు భగవదానుగ్రహం అని విశ్వసిస్తున్న కాలంలో ఒక వినూత్న ఆలోచనకు బీజం వేసిన వాడు-ప్రకృతి, జీవ, భూగర్భ శాస్త్రవేత్త చార్లెస్‌ డార్విన్‌. ఈయన రూపొందించిన జీవ పరిణామ మూలం, పరిణామ సంబంధాలు, శిలాజాలు, మానవ పరిణామక్రమం చాప్టర్లను సిబిఎస్‌ఇ పదో తరగతి సిలబస్‌ నుంచి తొలగించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం తాజా నిర్ణయం. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు జీవ పరిణామ క్రమ సిద్ధాంతమే తప్పని వాదిస్తారు. సైన్స్‌ విద్యకు ఈ నిర్ణయం 'ప్రమాదకరమైన మార్పు' అని 1800 మంది శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, పలువురు విద్యావేత్తలు లేఖ రాశారు. సైన్స్‌ ప్రాథమిక ఆవిష్కరణ గురించి విద్యార్థులకు తెలియకపోతే... వారి ఆలోచనా ధోరణి కుంటుపడుతుంది. దీనికి కొద్దిరోజుల ముందు మొఘలుల చరిత్ర, ఢిల్లీ సుల్తానుల చరిత్ర భాగాల్నీ తొలగించారు. వీటిని చరిత్రలో లేకుండా చెరిపివేయడం భారతీయ చరిత్ర అవగాహనకు హానికరం. ఈ తొలగింపులు, వక్రీకరణలు భావితరాలను తప్పుదోవ పట్టిస్తాయి. 'చరిత్ర అంటే రాజులు, రాజ్యాలే కాదు...మానవ జీవితాలను మలుపు తిప్పిన పరిణామాలనూ చూడాలి' అంటారు ప్రముఖ చరిత్రకారుడు డి.డి. కోశాంబి. 'చివరి మొఘల్‌ చక్రవర్తి కొన్ని ఆలయాలను కూల్చిన మాట వాస్తవమే. కానీ, అది మాత్రమే వేయేళ్ల ముస్లిం పాలనకు ప్రతీక కాదు' అంటారు దాశరథి రంగాచార్య 'ఋగ్వేద సంహిత' గ్రంథంలో. ఎన్నో మూఢనమ్మకాలను శాస్త్ర వాదనల ద్వారా, ప్రయోగాల ద్వారా పూర్వపక్షం చేసి, సౌర కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన గెలీలియో సైతం మతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ ప్రపంచమంతా వెలుగులు నింపాలని ప్రయత్నించిన ఒక మహా మనిషిని మూర్ఖత్వం బలిగొంది. 164 ఏళ్ల తర్వాత ఇప్పుడు డార్విన్‌ సిద్ధాంతాన్ని తప్పుడు సిద్ధాంతంగా వక్రీకరించేందుకు మళ్లీ మతోన్మాదులే పూనుకున్నారు.
జీవం ఎలా మొదలైంది? జీవరాసులు ఎలా వచ్చాయి? మానవ పరిణామ క్రమం ఎలా జరిగింది? వంటి విషయాలు ప్రతి ఒక్కరికీ అవగాహన కావాలి. ప్రకృతిలో లక్షల ఏళ్లుగా జరుగుతున్న మార్పుల ఫలితంగానే జీవ పరిణామ క్రమం ఏర్పడిందని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఈ శాస్త్రీయతను వక్రీకరించి...అశాస్త్రీయ విషయాలకు కృత్రిమ ప్రచారం కల్పించి, భావితరాలను అంధకారంలోకి నెట్టే ఎలాంటి ప్రయత్నాన్నైనా విజ్ఞులు తిరస్కరించాలి. డి.డి. కోశాంబి 'ప్రజలు తమకు తెలియకుండానే చరిత్రను నిర్మించుకుంటూపోతారని, ఆ క్రమంలో వారి సామూహిక జీవన స్వచ్ఛత, ఔదార్యం, సంస్కృతి, శ్రమ- అన్నీ కలగలిపి నిబిడీకృతమై వుంటాయని' విశదీకరిస్తారు. కానీ, ఇప్పుడు బిజెపి ప్రభుత్వం పాఠ్యాంశాల్లో విద్వేష విష బీజాలు నాటేందుకు పూనుకుంది. గాంధీజీ హత్యలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్రను కూడా చెరిపేసి, చరిత్రకు మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నిస్తోంది. అనేక మంది విద్యావేత్తలు, చరిత్రకారులు ఏళ్ల తరబడి శ్రమించి రూపొందించిన చరిత్ర పాఠాలను తొలగించడం, వక్రీకరించడం అంటే...దేశ చారిత్రక మూలాలను విధ్వంసం చేయడమే. ఇలాంటి ప్రయత్నాలను ఈ దేశ ప్రజలే తిప్పికొట్టాలి.