Apr 09,2023 06:46

శబ్దాన్ని కాలంతో మేళవించి, వినసొంపుగా మార్చే విలక్షణ ప్రక్రియ సంగీతం. ఇది విశ్వమంతా వ్యాపించి వుంది. ప్రకృతిలో మిళితమై... జీవన గమనంలో భాగమై-మనిషినీ, మనసును రంజింపచేయగల సుప్రసిద్ధ చతుష్షష్టి కళలలో సంగీతం ఒకటి. ఆదిమ కాలంలో భాష కంటే సంగీతమే ముందు పుట్టి వుంటుంది. మౌఖిక సంకేతాల ద్వారానే ఒకరి నుంచి మరొకరికి చేరి వుంటుంది. ఎలా చేరినా... పసితనం నుంచి ముదిమి వరకూ అందరినీ పరవశులను చేస్తూనే వుంది. 'శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి:' అన్నారు. శిశువులు, పశువులు, పాములు వశులగుదురు గానమునకు వసుధను నిజమే- అని అనేక శాస్త్ర పరిశోధనలు ధ్రువీకరిస్తున్నాయి. సంగీతానికి ప్రాథమిక లక్షణాలు శృతి, రాగం, తాళం, పల్లవి. 'పల్లవించవా నా గొంతులో/ పల్లవి కావా నా పాటలో' అంటాడో సినీ కవి. ఈ సంగీత సాహిత్యాల మేళవింపు ప్రజలను చేరడానికి ఇప్పుడైతే.. ఎన్నో పరికరాలు, వాయిద్యాలు, మాధ్యమాలు, సాంకేతికత అందుబాటులో వున్నాయి. రకరకాల పద్ధతుల్లో సంగీతాన్ని రికార్డు చేయడానికి ఆధునిక పరికరాలతో కూడిన ప్రత్యేకమైన థియేటర్లు ఇప్పుడు అందుబాటులో వున్నాయి. గాత్రాన్ని, సంగీతాన్ని అనుసంధానించడానికీ వెసులుబాటు వుంది. అంతే కాదు... ఎన్నో కేసులలో ఆడియో టేపులు కీలకమైన సాక్ష్యాధారాలుగా నిలిచిన సందర్భాలూ వున్నాయి. వీటన్నింటికీ మూలం శబ్దాన్ని రికార్డు చేసే ప్రక్రియ.
నేడు చాలా సులభంగా మనకు నచ్చిన ధ్వనిని రికార్డు చేయగలుగుతున్నాం. దీనికి అనేక పరికరాలు అందుబాటులో వున్నాయి. గతంలో టేప్‌రికార్డర్‌, వాయిస్‌ రికార్డర్లతో మాటలను, పాటలను రికార్డు చేసేవాళ్లం. ఇప్పుడైతే మొబైల్‌ ఫోన్‌ అన్ని కొరతలనూ తీర్చేస్తోంది. అయితే, ధ్వనిని మొదట్లో ఎలా రికార్డు చేసేవారో తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. 163 ఏళ్ల క్రితం- 1860 ఏప్రిల్‌ 9న ధ్వని యంత్రంతో మొట్టమొదటిగా ఫ్రెంచ్‌ జానపద పాట అయిన 'ఔ క్లెయిర్‌ డి లా లూన్‌' నుంచి ఒక స్నిప్పెట్‌ని రికార్డు చేశారు. ఎడ్వర్డ్‌ లియోన్‌ స్కాట్‌ డి మార్టిన్‌విల్లే 'ఫోనాటోగ్రాఫ్‌' అనే ధ్వనిని రికార్డు చేసే పరికరంతో ఈ ఘనత సాధించాడు. ఇది పొగతో నల్లబడిన కాగితంపై ధ్వని తరంగాలను గుర్తించడం ద్వారా పనిచేసింది. అయితే, ఈ పరికరాన్ని మార్టిన్‌విల్లే 1857లో రూపొందించడంతో పాటు, దీనిపై పేటెంట్‌ కూడా పొందాడు. ఈయన రికార్డు చేసిన ఫోనాటోగ్రామ్‌లను 20 ఏళ్ల తర్వాత తిరిగి ప్లే చేస్తారని కూడా అప్పుడు ఆయన ఊహించలేదు. ఆ పనిని 1877లో థామస్‌ ఎడిసన్‌ ఫోనోగ్రామ్‌ ద్వారా సాధించాడు. అలా ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించుకుంటూ నేటి ఆధునికతను అందిపుచ్చుకుంది. రికార్డింగ్‌ మాధ్యమం నిరంతరం మారుతూ వుండవచ్చు. పాటలు, మాటలను రికార్డు చేయడమే కాకుండా, రహస్యంగా రికార్డు చేయగలుగుతున్న అనేక పరికరాలకు, యాప్‌లకు మాతృక ఫోనాటోగ్రాఫ్‌ అనే చెప్పాలి.
చరిత్ర గమనాన్ని పరిశీలించినప్పుడు-ఏ విజ్ఞానమైనా చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తుందని నిరూపితమైంది. అదొక సాంకేతిక పరికరం కావొచ్చు... పుస్తకం కావొచ్చు. లేదా రకరకాల ఆడియో, వీడియో ఫార్మాట్లలో వున్న రికార్డులు కావొచ్చు. ఇవేమీ మార్చేస్తే మారిపోయేవి కావు. రావణుడు పుష్పక విమానంలో తిరిగినట్లు రామాయణంలో వుందని కొందరు చెపుతారు. కానీ, ఈ విమానాన్ని కనిపెట్టింది 1905లో రైట్‌ బ్రదర్స్‌ అనే విషయం ప్రపంచ చరిత్ర చెప్పే సాక్ష్యం. చింపేస్తే చిరిగిపోవడానికి అది ఒట్టి కాగితం కాదు. చరిత్రలో నమోదు చేయబడిన చారిత్రక ఆవిష్కరణ అది. నేడు మనం అనుభవిస్తున్న సాంకేతికత అంతా ప్రాథమిక స్థాయి నుంచి ఆవిష్కరించినవే. రేడియో, టీవీ, ఇంటర్నెట్‌, కంప్యూటర్‌ నుంచి నేటి ఆర్టిఫీషియల్‌ ఇంటెలింట్‌ వరకు అన్నీ మొదట ప్రాథమికంగా రూపొందినవే. ఫోనాటోగ్రాఫ్‌ కూడా అనేక ప్రయత్నాల తర్వాత ఒక ధ్వనిని రికార్డు చేయగలిగింది. ఇప్పుడు అదే ధ్వనిని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నామో, రికార్డు చేస్తున్నామో తెలిసిందే. 'విజేతలు మనకన్నా వేరే విభిన్నమైన పనులు చేయరు. మనం చేసే పనులనే విభిన్నంగా చేస్తారు' అంటారు 'యు కెన్‌ విన్‌' గ్రంథ రచయిత శివ్‌ ఖెరా. చరిత్రలో లిఖించబడిన ఈ ఆవిష్కరణలు యువతకు స్ఫూర్తినిస్తాయి. ఆవిష్కర్తలుగా విజేతలను తయారు చేస్తాయి. చరిత్రను తుడిచేయాలనుకుంటే...అది ఎక్కడోక చోట, ఏదోక రూపంలో మళ్లీ మళ్లీ ఆవిష్కృతం అవుతూనే వుంటుంది.