'తమిళనాడులో రెడ్ జెయింట్ వాళ్ళు నా సినిమా చూసి ఇలాంటి గొప్ప సినిమా చూడలేదని కొన్నారు. కేరళలో నిర్మాత గోకులం గోపాలం, కర్ణాటకలో కేజీఎఫ్ సినిమా నిర్మాతలు చూసి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. కానీ తెలుగు విషయానికి వస్తే సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారు అని అడిగారు. నేను ఒక మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు చూస్తారని నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, ఇది 28న రిలీజ్ కావాల్సిన సినిమా' అని 'చిత్తా' తెలుగు వర్షెన్ లాంచింగ్ ప్రెస్‌మీట్‌లో హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. 'నా సినిమాను తెలుగు ప్రేక్షుకులు ఎవరూ చూడరని నాకు థియేటర్లు దొరకలేదు. ఈ సినిమా కంటే మంచి సినిమా నేను తీయలేను. దయచేసి సినిమా థియేటర్లకు వచ్చి సినిమా చూడండ'ని ఆయన అభిమానులను కోరారు. సిద్ధార్థ్ నటించిన తమిళ చిత్రం 'చిత్త' తమిళనాడు, కర్నాటక, మలయాళ రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రతి తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సినిమా ఇదని కొనియాడారు. ఈ సినిమాను అప్పుడే తెలుగులో కూడా రిలీజ్ చేయాలనుకున్నా ఎవరూ కొనకపోవడంతో ఈ వారం రిలీజ్ చేస్తున్నారు.










