
ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివద్ధి లక్ష్యాల్లో భాగంగా భారతదేశంలో అందరికీ ఆరోగ్య భద్రత అవసరం ఉంది. 2030 నాటికి ఈ లక్ష్యం చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే నేటికీ మనదేశంలో 41% శాతం లోపు మాత్రమే ఆరోగ్య భద్రత అందుకున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఇటీవల తెలిపింది. దీనిలో 30% శాతం మహిళలు, 37% శాతం మగవారు ఆరోగ్య భద్రత కలిగి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మనదేశంలో సిక్కు, ముస్లిం మైనారిటీల ప్రజలు , ఇతర బడుగు బలహీన వర్గాల ప్రజలు , గిరిజన ప్రజలు ఆరోగ్య భద్రతలో అట్టడుగున ఉన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (యు.హెచ్.సి) అందరికీ అందుబాటులోకి తేవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. .ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ బడ్జెట్లో నిధులు ఎక్కువగా కేటాయించాలి. 2018 సెప్టెంబర్‌లో ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకం ప్రవేశ పెట్టినా, 2020, 21లో కరోనా కాలంలో ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో ఇకనైనా సమీక్ష చేసుకోవాలి. పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా ఆరోగ్య భారత్ ని నిర్మించలేము. ఆరోగ్య భారత్, ఆయుష్మాన్ భారత్ అనే పేర్లుతో అందరికీ ఆరోగ్యం అని కేంద్ర ప్రభుత్వం పథకం పెట్టినా... ప్రజలకు వైద్య సేవలు ఎంత 'చౌకగా' అందుతున్నాయో అందరికీ తెలిసిందే. తగినన్ని సదుపాయాలు, వైద్యులు, ఆసుపత్రులు, ఆర్థిక పరిపుష్టత ద్వారానే ఇవి సాధ్యం అని గ్రహించాలి. పరిశోధన, అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలి. శాస్త్రీయ విజ్ఞానం కలిగించే విధంగా పాఠ్యాంశాలుండాలి. మూఢ నమ్మకాలు ప్రభోదించే వారిని దూరంగా ఉంచాలి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినన్ని సదుపాయాలు, వైద్యులు లేరు. కనీసం అన్ని రకాల రక్తపరీక్షలు, ఎక్స్ రే, స్కానింగ్, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు లేవు. స్పెషలిస్ట్ డాక్టర్లు లేరు. అందువల్లే ప్రతీ ఒక్కరూ ప్రతీ చిన్న అనారోగ్యానికి ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. అక్కర్లేని పరీక్షలు చేస్తూ డబ్బులు దోచుకుంటున్న వైనం సర్వసాధారణంగా కనిపిస్తుంది. కోవిడ్ కాలంలో డోలో 650 మాత్రలు, జింక్ సప్లిమెంటరీ వంటి టాబ్లెట్లు ద్వారా డాక్టర్లు, ఫార్మా కంపెనీలు ఎన్ని కోట్ల రూపాయలు ఆర్జించారో... ఇటీవల పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రజల్లో చాలా మందికి దాదాపు 87% మందికి ఆరోగ్య భద్రత చేకూర్చడంలో దేశంలోనే కేరళ, రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో ఉండగా, బీహార్ 17% శాతం ప్రజలకు, డబుల్ ఇంజన్ సర్కారు అని చెబుతున్న ఉత్తర ప్రదేశ్ 16% శాతం మంది ప్రజలకు మాత్రమే ఆరోగ్య భద్రత చేకూర్చటం జరిగిందని నివేదికలు చెబుతున్నాయి. నార్వే,స్వీడన్, ఫిన్లాండ్ వంటి దేశాలను ఆదర్శంగా తీసుకుని మన ప్రభుత్వాలు ప్రజలకు కావలసిన విద్య వైద్యం అందించేందుకు కషి చేయాలి. క్యూబా, వియత్నాం వంటి దేశాలు ఎలా అన్ని రంగాల్లో అభివద్ధి సాధిస్తూన్నాయో, మనం కూడా ఆ బాటలోనే పయనించాలి. అప్పుడు మాత్రమే మన స్వాతంత్య్ర సమర యోధులు, రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విద్య వైద్యం అందరికీ అందుతుంది.వాస్తవంగా ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో ఉంచి, అందరికీ అందుబాటులోకి తేవాలి. తద్వారానే దేశం అబివృద్ధి చెందుతుందని ప్రభుత్వాలు గ్రహించాలి.
-ఐ.ప్రసాదరావు 6305682733