Jul 28,2022 06:26

దాదాపు మూడు నాలుగేళ్ల కిందట జనాన్ని భయభ్రాంతులకు గురి చేసిన కోవిడ్‌. అప్పుడు ప్రతి ఒక్కరూ భయానికి గురైన వారే. ధైర్యం ఉన్న వాళ్ళే బయట పడ్డారు. అదే ఆలోచించుకుని భయంతో ఉన్న కొంతమంది కాలం చేశారు. అప్పట్లో ఎన్నో జాగ్రత్తలు ప్రతి వారు తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కూడా విధించారు. క్రమేపీ అది తగ్గుముఖం పట్టింది. ఈ దిశలో వ్యాక్సిన్‌ రావడం శుభ పరిణామం. వ్యాక్సిన్‌ వేసుకున్న వాళ్ళు ధైర్యంగా ఉండటం చూస్తున్నాం. అయితే ఇంకా చాలా వరకు అపోహలతో వ్యాక్సిన్‌ వేసుకోని వాళ్ళున్నారు. అటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించారు మంచిదే. కోవిడ్‌ ఎక్కువగా ఉన్న సమయంలో మాస్క్‌ వాడకం ఎక్కువ చేశారు. పైగా తప్పని సరి కూడా అయింది. క్రమంగా పరిస్థితులు చక్కబడ్డాక ప్రజలు స్వేచ్ఛగా తిరగడం ప్రారంభించారు. వ్యాపారాలు కూడా పుంజుకున్నాయి. లాక్‌డౌన్‌లో ధరలు కొండెక్కి కూర్చున్నాయి. హోటళ్ళలో కూడా ధరలు పెరిగాయి. జనాల ఆదాయం మాత్రం పెరగడం లేదు. ఇదిలా ఉండగా కరోనా నాల్గవ వేవ్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. అయినా జనం ఏ మాత్రం భయపడటం లేదు. అదొక మాములు జబ్బు అనే అనుకుంటున్నారు.
మాస్క్‌ ఎవరూ వేసుకోవడం లేదు. ఎక్కడో కొద్దిమంది తప్పితే. ఇక్కడ ప్రజలను చైతన్యం చేయాల్సింది ప్రభుత్వమే. వివిధ ప్రకటనల ద్వారా మాస్క్‌ ధరించేలా చూడాలి. ధరించని వారిపై జరిమానా కాకుండా వాళ్ళకు ఓపికతో చెప్పాలి. లేదా మాస్క్‌ ఇచ్చి వేసుకోమని చెప్పాలి. మంచి మాటల ద్వారా మాస్కు వాడకం జరిగేలా చూడాలి. ఇది ప్రతి ఒక్కరూ పాటించవలసిన విధి. కాకపోతే పోలీస్‌ వ్యవస్థ ఈ బాధ్యత తీసుకుంటే సత్వర ప్రయోజనాలు ఉంటాయి. మాస్క్‌ ద్వారా ఉపయోగం చెబితే జనాలు చాలా వరకు ధరిస్తారు. ఇప్పటికే చాలా చోట్ల 'మాస్క్‌ లేనిదే ప్రవేశం లేదు' అనే బోర్డులు వెక్కిరిస్తూ ఉంటాయి. అయితే అందులో ఎవరికీ మాస్క్‌ ఉండదు. కేవలం బోర్డ్‌ వేశాం అంటే వేశాం అనేటట్లుగా ఉంది. డోసు ఇన్ని కోట్లమందికి ఇచ్చాం అనే ప్రయత్నం కొద్దిగానైనా ఫలించింది కదా! అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలి అనే మాట కూడా ప్రజలలో బాగా పోవాలి. మాస్క్‌ ధరించిన వారిని అభినందించాలి. ప్రయాణాలలో కూడా ఎవరూ మాస్క్‌ వేసుకోవడం లేదు. ఏ.పి.యస్‌.ఆర్‌.టి. సి వారు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. మాస్క్‌ ఉంటేనే అనుమతి అనే నిబంధన కఠినం చేయాలి. అయితే జరిమానా ఏ కోశానా ఉండకూడదు. జరిమానా విధించడం వలన వ్యతిరేకత వస్తుంది. ఘర్షణలు కూడా చోటు చేసుకుంటాయి. ప్రతి జిల్లా, మండల, పంచాయతీలలో మాస్క్‌ గురించి ప్రకటనలు చేస్తే తప్పకుండా జనాలలో చైతన్యం కలుగుతుంది. విద్యా సంస్థలలో కూడా విధిగా ఉపాధ్యాయులు, పిల్లలు మాస్క్‌ ధరించేలా చూడాలి. పకడ్బందీగా మాస్క్‌ గురించి ప్రకటనలు చేస్తే కరోనాను నిలువరించగలుగుతాం. వ్యక్తి ఆరోగ్యంగా ఉండటమే కదా కావాల్సింది. కనుక ఈ దిశలో అటు ప్రభుత్వం ఇటు స్వచ్ఛంద సంస్థలు, సేవకులు, బాధ్యత కలిగిన పౌరులు...ముందుకు వచ్చి కలసికట్టుగా అడుగు వేయాలి.

- కనుమ ఎల్లారెడ్డి,
పౌరశాస్త్ర అధ్యాపకులు, సెల్‌ : 93915 23027.