May 19,2023 10:32
  • దేశవ్యాప్తంగా రెజ్లర్ల నిరసనకు పెరుగుతున్న మద్దతు

భారత రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షులు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను తక్షణమే తొలగించాలంటూ రెజ్లర్లు చేస్తున్న ప్రధాన డిమాండ్‌పై కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ నాన్చివేత ధోరణిని ప్రదర్శిస్తోంది. మహిళా రెజ్లర్లపై బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ రెజ్లర్లు నాలుగు నెలలక్రితం తొలుత ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన మంత్రిత్వశాఖ మేరీకోమ్‌(బాక్సింగ్‌), యోగేశ్వర్‌ దత్‌(రెజ్లింగ్‌), డోలా బెనర్జీ(ఆర్చరీ), సహదేవ్‌ యాదవ్‌(ఐఓఏ ట్రెజరర్‌)లతో కూడిన ఓ కమిటీని నియమించింది. నెలరోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలూ జారీచేసింది. ఆ కమిటీ మంత్రిత్వశాఖకు ఏ రిపోర్టు ఇచ్చిందో గానీ, బ్రిజ్‌భూషణపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో రెజ్లర్లు మళ్లీ జంతర్‌మంతర్‌ వద్ద నిరవధిక నిరసనలకు దిగి.. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని వారు నిర్ణయించారు.

భారత రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షులు, ...... బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ను తొలగించాలంటూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరవధిక నిరసనలు చేస్తున్న రెజ్లర్లకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌తో పాటు, సిపిఎం కేంద్రకమిటీ సభ్యురాలు బృందాకరత్‌, భారతీయ కిసాన్‌ సంఫ్‌ు(బీకేయూ) నేత రాకేశ్‌ తికాయత్‌, ఖాప్‌ మహమ్‌ 24 నేత మెహర్‌ సింగ్‌, సంయుక్త కిసాన్‌ మోర్చాకు చెందిన దేవ్‌ సింగ్‌ సిర్సా తదితరులు వచ్చి సంఘీభావం తెలిపారు. అలాగే ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు రాకతో ప్రభుత్వం ఆఘమేఘాలమీద ఆ పరిసర ప్రాంతాన్ని తమ గుప్పిట్లోకి తీసుకొని భారీగా ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌ఏఎఫ్‌)ను మోహరించింది. ఆందోళన చేస్తున్న ప్రదేశంలో నీరు, కరెంటు, పారిశుధ్య, ఇతర సౌకర్యాలను తొలగిస్తూ రెజ్లర్లపై కక్షపూరిత ధోరణికి పాల్పడుతోంది. పోలీసులు అర్ధరాత్రి నిరసన శిబిరానికి చేరుకొని రెజ్లర్లను, వారికి మద్దతు తెలుపున్న వారందరినీ విచక్షణా రహితంగా కొడుతూ, టెంట్‌లను పీకేసి, అక్కడ ఉన్న వారందరినీ ఈడ్చి పడేశారు. దీంతో మహిళా రెజ్లర్లు కన్నీరు మున్నీరుగా విలపించడంతో దేశవ్యాప్తంగా వీరికి ప్రజా మద్దతు పెరిగింది. రెజ్లర్లు మే 11న బ్లాక్‌ డే నిర్వహించగా.. తాజాగా ఐఓఏ.. భారత రెజ్లింగ్‌ సంఘం(డబ్ల్యుఎఫ్‌) కార్యక్రమాలను అడ్‌హక్‌ కమిటీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. మరోవైపు రెజ్లర్లు బ్రిజ్‌ భూషణ్‌పై 21లోగా చర్యలు తీసుకోని పక్షంలో తమ నిరసనపై ఓ నిర్ణయం తీసుకుంటామని తాజాగా వెల్లడించారు.
 

                                                                       వెనక్కి తగ్గిన పిటి ఉష...

బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా నిరనసనకు దిగిన రెజ్లర్ల పట్ల తొలుత కఠినంగా మాట్లాడిన భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ) అధ్యక్షురాలు పిటి ఉష ఆ తర్వాత వెనక్కి తగ్గారు. జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లను కలుసుకొని పరామర్శించారు. అంతకుముందు ఐఓఏను సంప్రదించకుండా ఇలా ఏకపక్షంగా వీధుల్లోకి వచ్చి ఎలా నిరసనలకు దిగుతారు, ఇది దేశ ప్రతిష్టను దిగజార్చడమేనంటూ వ్యాఖ్యానిం చడంతో పిటి ఉషపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు పెద్దఎత్తున వెల్లువెత్తడంతో ఆమె వెనక్కి తగ్గి ప్రస్తుతం రెజ్లర్ల పక్షాన నిలిచారు.
 

                                                                        సుప్రీంకోర్టులో విచారణ..

ఈ సమస్యపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు కావడంతో వేగం పెరిగింది. బ్రిజ్‌భూషణపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతోపాటు ఫిర్యాదుదారులకు పోలీసులు భద్రత కల్పించాలని సుప్రీం ఆదేశాలు జారీచేసింది. అలాగే దర్యాప్తును విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షించాలని పేర్కొంది. ఏడుగురు మహిళా రెజ్లర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సుప్రీం జోక్యంతో ఫిబ్రవరి 28న బ్రిజ్‌ భూషణ్‌పై తొలిసారి ఎఫ్‌ఐఆర్‌ కేసు నమోదైంది. ఇది తమ తొలి విజయం అని రెజ్లర్లు ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 28న ఢిల్లీ పోలీసులు మరో రెండు కేసులను బ్రిజ్‌భూషణపై నమోదు చేశారు.
 

                                                                    యుడబ్ల్యుడబ్ల్యు ఆందోళన

భారత్‌లో పరిణామాల పట్ల యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌(యుడబ్ల్యుడబ్ల్యు) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో రెజ్లింగ్‌ను ఎవరు నడిపిస్తున్నారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు డబ్యుఎఫ్‌ఐకి యుడబ్ల్యుడబ్ల్యు అధ్యక్షుడు నెనాద్‌ లావోలిక్‌ లేఖ రాసారు. యుడబ్ల్యుడబ్ల్యు టోర్నీల్లో ఖచ్చితంగా ఎవరు పాల్గొంటారో.. డబ్ల్యుఎఫ్‌ఐ రోజువారీ కార్యకలాపాలు ఎవరు చూస్తారో... స్పష్టత లేదని, బ్రిజ్‌ భూషణ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు నివేదిక ఏప్రిల్‌లోనే క్రీడా మంత్రిత్వశాఖకు అందినట్లు తెలుస్తోందని వెల్లడించింది.
                                                                                                      - ప్రజాశక్తి స్పోర్ట్స్‌ కరస్పాండెంట్‌

రెజ్లిగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు, ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు మాఫియాతోనూ సంబంధాలున్నట్లు సమాచారం. రెజ్లర్లకు రైతు సంఘాల నాయకులు మద్దతు తెలపడంపై ఆయన ఇటీవల ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. మాట మాత్రం చెప్పకుండా వారు రెజ్లర్లకు ఎలా మద్దతు తెలుపుతారంటూ పేర్కొన్నాడు. అలాగే ఢిల్లీ పోలీసులు కూడా దర్యాప్తు పూర్తయ్యేదాకా వేచి చూడాలని కోరారు. తనపై ఒక్క ఆరోపణ రుజువైనా 'ఉరి వేసుకుంటానని, శిక్ష విధించి, కొట్టి చంపండి' అని వెల్లడించాడు.

నిరవధిక ఆందోళన చేస్తున్న వినేశ్‌, సంగీత పోగాట్‌, సాక్షి, బజ్‌రంగ్‌ మాట్లాడుతూ.. నాలుగు నెల క్రితం ఆందోళన చేపట్టడానికి ముందు తామంతా ఓ అధికారిని కలిసామని, మహిళా అథ్లెట్లను బ్రిజ్‌ భూషణ్‌ శారీరకంగా, మానసికంగా ఎలా వేధింపులకు గురిచేస్తున్నారో వివరించామన్నారు. ఆ సందర్భంగా వారు ఓ కమిటీ వేస్తామని, అతనిపై తప్పక చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతోనే అప్పట్లో నిరసనను విరమించామని పేర్కొన్నారు. ఇన్నాళ్లయినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మళ్లీ ఆందోళనకు దిగాల్సి వచ్చిందని వారు తెలిపారు. నిరవధిక ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లలో సాక్షి మాలిక్‌ 2016 రియో ఒలింపిక్స్‌, బజ్‌రంగ్‌ పునియా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలను సాధించగా.. వినేశ్‌, సంగీత పోగాట్‌ 2022, 2019 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన స్టార్‌ రెజ్లర్లు.