ప్రాథమిక విద్య పట్ల, అందులో కీలక పాత్ర నిర్వహించే ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సబబు కాదు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఇపి-2020 ప్రకటించాక దేశంలో ఇంకే రాష్ట్రం కన్నా ముందుగా దాని అమలుకు పూనుకున్నది ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. తరగతుల విలీనంతో గ్రామ గ్రామాన ప్రాథమిక పాఠశాలలు అల్లకల్లోలమైనాయి. వద్దు మొర్రో అని ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయులు మొత్తుకున్నా సర్కారు మొండికేయడంతో ఆచరణలో ఇబ్బందులు పడ్డ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడంతో ఏలినవారు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. అదలా ఉండగానే ప్రతి రోజూ ఉదయం 9 గంటలకల్లా కచ్చితంగా యాప్‌లో సెల్ఫీ ఫోటోతో పాటు, హాజరు నమోదు చేయాలని, ఒక్క నిమిషం లేటైనా ఒక పూట గైరు హాజరుగా పరిగణిస్తామని ప్రభుత్వం తాజాగా టీచర్లపై కొరడా ఝళిపించింది. అది ఆచరణ సాధ్యం కాదని ఉపాధ్యాయ సంఘాలు ఎంత చెప్పినా ప్రభుత్వం ససేమిరా అంటూ మంగళవారం నుండి అమలుకు పూనుకోవడం కక్ష సాధింపుగానే వారు భావిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ తొలిరోజున విఫలమైంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అనేక చోట్ల సర్వర్ బిజీ అని వచ్చింది. నెట్ సదుపాయం లేకపోవడం, ఉన్నా స్పీడు తక్కువగా వుండం కూడా సమస్యగా మారింది. యాప్ డౌన్‌లోడ్ కూడా కాలేదు. దీంతో ఉపాధ్యాయులు యాప్ ద్వారా హాజరు నమోదు చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పిల్లలకు వేసే అటెండెన్స్ యాప్ కూడా మంగళవారం సరిగా పనిచేయలేదు. ఆండ్రాయిడ్ ఫోన్లు లేని వారి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. తమ హాజరు నమోదు చేయడంతోపాటు మరోవైపు విద్యార్థుల హాజరు అప్‌లోడ్, బాత్‌రూములు, స్కూలు పరిసరాలు, మధ్యాహ్న భోజనం ఫోటోలు కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉండటంతో ఉపాధ్యాయులు గాభరా పడిపోయారు. రెండవ రోజునా పెద్దగా మార్పు లేదు. టీచర్లలో ఇంత గందరగోళం సృష్టించడం అవసరమా? అంటే ముమ్మాటికీ లేదనే సమాధానం వస్తుంది. కాని, పిఆర్‌సి ఆందోళన అనంతరం తమపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఉపాధ్యాయులంటు న్నారు. పదో తరగతి పరీక్షలు, స్పాట్ వాల్యుయేషన్, ఇప్పుడు పాఠశాలల హాజరు తదితర అంశాల్లో ఒక పద్ధతి ప్రకారం వేధింపులకు దిగుతోందని, కేసులు బనాయిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌ఇపి పేరిట ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టులు కుదిస్తున్నారని, అది చాలదన్నట్లు పాఠశాలల సంఖ్యనూ క్రమంగా తగ్గిస్తున్నారని, ఇప్పుడు ఏకంగా సర్వీసునే ఇబ్బందుల్లో పడేసేలా మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
ప్రభుత్వం ఆచరణాత్మకంగా వ్యవహరించాలనీ, హాజరు నమోదుకు అవసరమైన డివైజెస్ (పరికరాలు)ను నెట్ సౌకర్యంతో పాటు ప్రభుత్వమే ఇవ్వాలన్న ఫ్యాఫ్టో డిమాండ్ న్యాయసమ్మతమైంది. అన్ని యాప్‌లు ప్రతి డివైజ్ లోనూ ఒకేలా పని చేస్తాయని చెప్పలేం. సర్కారు రూపొందించిన యాప్‌లు ఏ డివైజుల్లో బాగా పని చేస్తాయో వాటిని వారే సమకూర్చడం సరైనది. ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో ఇంటర్‌నెట్ సౌకర్యంలో లోపాల పట్ల ప్రభుత్వం సానుకూలంగా యోచించవలసి వుంటుంది. ఏది ఏమైనా ఉపాధ్యాయుని ప్రధాన పని బోధనగా ఉండాలి తప్ప యాప్‌ల అప్‌లోడ్లు, నివేదికల సమర్పణలూ కాకూడదు. ఈ విషయం ఏలినవారకి తెలియదనీ అనుకోలేం. ప్రపంచ బ్యాంకు నుండి తెచ్చిన రుణంతో చేపట్టిన 'సాల్ట్' పథకాన్ని అమలు చేయడంతో ఇబ్బందులెన్నో తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రుద్దిన ఎన్‌ఇపి-2020, ప్రపంచ బ్యాంకు పథకమూ రాష్ట్ర విద్యారంగాన్ని బలోపేతం చేయవు సరికదా మరిన్ని కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించడం అవసరం. న్యాయంగా తమకు రావలసిన వేతన సవరణ గురించి, అధికారానికి వచ్చాక సిపిఎస్ రద్దు చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హామీ అమలు కోసమే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమించారు తప్ప వారివి గొంతెమ్మ కోర్కెలు కాదు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించడం అవసరం.










