- ఐద్వా మహాసభలో ప్రతినిధుల డిమాండ్
- కేరళ తరహా ప్రభుత్వాలు కావాలన్న ఆశాభావం
ఎం.సి.జోసఫీన్ నగర్ (తిరువనంతపురం) నుండి ప్రజాశక్తి ప్రతినిధి : ఉత్పత్తిలో సగభాగంగా ఉన్న మహిళాలోకానికి అవకాశాల్లోనూ, నిర్ణయాధికాల్లోనూ సగభాగం ఇవ్వాలని ఐద్వా జాతీయ మహాసభలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు డిమాండ్ చేశారు. కార్యదర్శి నివేదికపై చర్చలు మూడవరోజైన ఆదివారమూ కొనసాగాయి. ఈ సందర్భంగా తమ తమ రాష్ట్రాల తరపున మాట్లాడిన పలువురు కేరళలో మహిళల అభివృద్ధి కోసం ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ఆ తరహా ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోనూ ఏర్పాటు కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
సౌహార్ధ సందేశమిచ్చిన కేరళ డివైఎఫ్‌ఐ కార్యదర్శి రహీం వామపక్ష పార్టీలు అధికారంలోకి వస్తేనే మహిళల అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
ఉద్యమాలు ఉదృతం చేస్తాం...
గుజరాత్ నుండి చర్చల్లో పాల్గొన్న హన్సా మాట్లాడుతూ తమ రాష్ట్రంలో ప్రజలు అత్యంత భయంకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. మోడీ ప్రభుత్వం గుజరాత్ గురించి చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. రానున్న రోజులో ఉద్యమాలను ఉధృతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు.
పశ్చిమ బెంగాల్ ప్రతినిధి మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ గూండాల దాడులను ఎదుర్కొంటూ తాము పోరాటాలను చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో అభ్యుదయ శక్తులను కలుపుకుని ఐక్య పోరాటాలు చేస్తామని తెలిపారు.
లింగ సమానత్వంపై దష్టి...
కేరళ ప్రతినిధి బిందు మాట్లాడుతూ తమ రాష్ట్రంలో పినరరు విజయన్ నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వం మహిళల అభివద్ధి కోసం ఎంతో కృషి చేస్తోందన్నారు. మూఢ విశ్వాసాల కారణంగా మహిళలు హింసకు, లైంగిక దాడులకు గురవుతున్నారని, అటువంటి సంఘటనలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నామని, ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని తెలిపారు. లింగ వివక్షకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో విద్యార్ధి, యువజన సంఘాలతో కలిసి పని చేస్తామని తెలిపారు.

హింసకు వ్యతిరేకంగా...
తెలంగాణలో మహిళలపై హింసకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నట్లు ఆ రాష్ట్రం తరపున చర్చల్లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గీత అన్నారు. అనేక జిల్లాల్లో లీగల్ సెల్స్ ఏర్పాటు చేసి మహిళలకు ఉచిత న్యాయసలహాలు ఇస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇళ్ళులేని పేదలకు గుడిసెలు వేయించడంలో, పట్టాలు ఇప్పించడంలో ఐద్వా కీలకపాత్ర పోషించిందని అన్నారు. ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సాంస్కతిక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆ రాష్ట్రం నుండే చర్చల్లో పాల్గొన్న సృజన మాట్లాడుతూ కార్యకర్తలను అభివద్ధి చేసుకునేందుకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

370 ఆర్టికల్ అమలు చేయాలి
మొదటిసారి ఐద్వా మహాసభకు హాజరైన కాశ్మీర్ ప్రతినిధుల తరపున లతీఫా మాట్లాడుతూ . జమ్ము, కాశ్మీర్ లో పరిస్థితి గతంలో మాదిరి పరిస్థితులు లేవన్నారు. తమ గురించి ఆలోచించకుండా మోడీ ప్రభుత్వం అంబానీ, అదానీల కోసం ఆర్టికల్ 370ని రద్దు చేశారని ఫలితంగా భూమిపై తమకు హక్కు లేకుండా పోయిందని తెలిపారు.ఆర్టికల్ 370ని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

దాడులకు భయపడం...
త్రిపుర నుండి చర్చల్లో పాల్గొన్న రూపా గంగూలి మాట్లాడుతూ అధికారంలో ఉన్న బిజెపి పెద్ద ఎత్తున దాడులకు దిగుతోందని చెప్పారు. సమావేశాలకు హాజరైతే చంపేస్తామని బెదిరిస్తున్నారని, ఇళ్లు, ఆఫీసులను తగలబెడుతున్నారని చెప్పారు. లైంగిక దాడులు భారీగా పెరిగాయని అన్నారు. ఆ దాడులకు భయపడకుండా ఐద్వా నేతృత్వంలో రాష్ట్రంలో పోరాటాలు చేస్తున్నామని చెప్పారు.

మనువాదాన్ని తిప్పికొట్టాలి
కర్ణాటకలో పేదల కోసం తాము ఎన్నో పోరాటాలు చేశామని ఆ రాష్ట్రం నుండి చర్చల్లో పాల్గోన్న మీనాక్షి చెప్పారు. పేదలకు పని దొరికేలా, వేతనాలు దొరికేలా చేసిన ఎన్నో పోరాటాలు ఫలించాయని అన్నారు. పేదల పొట్ట నింపడానికి తాము పనిచేస్తుంటే, మతోన్మాదులు హిందుత్వ ఆయుధంతో వారి బుర్రలను చెడగొడుతున్నారని అన్నారు. అందువల్ల మతోన్మాదాన్ని, మనువాదాన్ని తిప్పి కొట్టాలని చెప్పారు.

మతోన్మాదమే బిజెపి అజెండా
మణిపూర్‌లో అధికారంలో ఉన్న బిజెపి ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని ఆ రాష్ట్రం నుండి చర్చల్లో పాల్లొన్న ఆశాబాలా చెప్పారు. మరోవైపు పూట గడవక మైక్రోఫైనాన్స్‌ల వద్ద ప్రజలు అప్పులు చేస్తున్నారని, వడ్డీలు కట్టలేక, వారి ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు.

మధ్యతరగతికి చేరువుగా
మధ్యతరగతి మహిళలకు చేరువయ్యేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ నుండి చర్చల్లో పాల్గొన్న మస్తాన్‌బీ తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాలుగా సాగుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో మహిళాసంఘం మొదటినుండి చురుకుగా పాల్గొంటోందని చెప్పారు. ఫలితంగా ఆ కుటుంబాలకు చెందిన మహిళలు పెద్దఎత్తున పోరాటాల్లోకి వస్తున్నారన్నారు. అదే విధంగా లైంగిక వేధింపులు, హింస తదితర సంఘటనలపై కూడా ఎప్పటికప్పుడు ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. మతోన్మాదం, మనువాదాలకు వ్యతిరేకంగా మహిళలను చైతన్య పరుస్తున్నట్లు చెప్పారు. చర్చల్లో పాల్గొన్న మరో ప్రతినిధి సత్యవతి మాట్లాడుతూ యువతులను ఉద్యమంలోకి తీసుకు రావడానికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా గ్రూపుల ద్వారా సమస్యలపై ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేయడం, అవసరమైనప్పుడు ప్రత్యక్ష కార్యచరణకు సమీకరించడం వంటి చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు.










