
క్రాంతి, అరుణ, వీరయ్య ముగ్గురు మిత్రులు. వీరి వృత్తులు వేరైనప్పటికీ మనసులు కలిశాయి. వీరు భిన్న నేపథ్యాలు నుండి వచ్చినప్పటికీ వీరు అనుసరించే మార్గమొకటే. క్రాంతి ఉపాధ్యాయుడు. పట్టణానికి ఆనుకుని ఉన్న గ్రామంలో పని చేస్తున్నాడు. ఉపాధ్యాయ ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటాడు. అరుణ స్త్రీవాద ఉద్యమాలలో పాల్గొంటుంది. మహిళా హక్కుల కార్యకర్త. తండ్రి నుండి వచ్చిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వనిత. వీరయ్య ముందు ఒక రైతు. బతుకు తెరువు నిమిత్తం పట్టణానికి వలస వచ్చి అసంఘటిత కార్మికునిగా స్థిరపడ్డాడు. ఒకపక్క కార్మిక ఉద్యమాలు చేపడుతూ, మరోపక్క రైతు ఉద్యమాలలో పాలు పంచుకుంటుంటాడు. మానవతావాదాన్ని, ప్రగతిశీల భావజాలాన్ని అందిపుచ్చుకొన్న వారు కాబట్టి నేస్తాలయ్యారు. వీరు తరచూ సాయంత్రం వేళ విజయనగరం పట్టణంలోగల బొంకులదిబ్బ దగ్గర కలుసుకుంటుంటారు. వీరి మాటల్లో పలు సామాజిక, రాజకీయ అంశాలు వస్తుంటాయి. అప్పుడప్పుడు కొన్నింటిపై గొప్ప చర్చ జరుగుతోంది కూడా.
అరుణను వీళ్ళిద్దరూ 'అరుణక్కా' అంటారు. వీళ్ళకన్నా అరుణ ఓ పదేళ్ళు పెద్దది. అందుకే అలా పిలుస్తుంటారు. అరుణక్క పెద్దగా చదువుకోలేదు. కానీ లోక జ్ఞానం కలది. ఉద్యమ నిర్మాణంలో భాగంగా అందర్నీ కలుపుకోగలది.
క్రాంతి ఆరోజు ఉదయం మిగతా ఇద్దరి మిత్రులకీ ఫోన్ చేసి, సాయంత్రం మనం అర్జంటుగా కలవాలి. మనం నిత్యమూ కలిసే చోటుకు రండని ఆహ్వానించాడు. దానితో ముగ్గురూ బొంకులదిబ్బకు వచ్చారు. 'కాంతీ యమర్జంటుగా రమ్మనావు, యేటి సంగతని' అరుణ అడిగీసరికి, అక్కా! ఒక ముఖ్య విషయం మాట్లాడదామని పిలిచాను. ఈరోజు నువ్వు పేపర్ చూసావక్కా? ఒక ప్రవచనకర్తకు 'గురజాడ సాహిత్య పురస్కారం' ఇస్తారట. అది ఎంతవరకు న్యాయమో! చెప్పు. అని క్రాంతి అన్నాడు. దానికి అరుణక్క తనదైన శైలిలో జవాబిచ్చింది. 'అవును కాంతీ! నాను రాతిరేల వొచ్చిన వారతల్లోనే సూసాను. సూసి గాబరా పడ్డాను. ఈలకి యేటి పట్టుకొందనీ? అసలు ఈలు మనుషులేనా! ఈ ఆలోసన తగల్లెయ్య. గురజాడేటి? గురజాడ బవుమతేటి? ఈ (అ)యోగుల కియ్యడమేటి? ఈల సంగతి నాకు అంతుబట్టకుంతంది' అని తెగ బాదపడి పోయింది. ఇంకా 'దేసమంతె మన్ను కాదోరు, దేసమంతె మనుసులోరు' అనె ఎపుడో! మహాకవె అన్నారు కదేటి? వాలు కూడా మనుసులే కదా! ఆలకీ సీమూనెత్తురూ ఉంది కదా! ఆలకిచ్చిత్తే తప్పేటి? అని బుర్రూపుతూ మరింత వెటకారంగా అన్నాది అరుణక్క.
అంతలో వీరయ్య గబుక్కున అందుకొని, 'అవునవును ఈళ్ళని సూత్తుంటే, అసెయ్యం ఏత్తన్నాది. ఈళే కాదు. మొన్నీమద్దిన పెబుత్తం కూడా ఈలలాగే గురజాడ పురసకారం ఒకాయనికిచ్చీసింది. అతగాడు కూడా ఇతగాని లాగే టివీల్లో మాయమాటలు సెబుతాడు' అని గుర్తు చేసాడు. అసలీల పెంకితనమేటో! అరదం కావట్లేదు. అసలు గురజాడకు ఈ మాటల మాయగాళ్ళకి సంబందమేటి? అసలు గురజాడ ఇదానమేటి? ఈ పుచ్చుకున్నోళ్ళ ఇదానమేటి! కనీసం దాన్ని నెక్కలోకి తీసుకోనక్కర్లేదా! జాషువా అవారుడు ఒక బోగికి, శ్రీశ్రీ బవుమతి మరో యోగికి, వంగపండు పురసకారం ఇంకొక రాయబారం సేసిన సోమికి ఇచ్చెత్తారా? ఈలని ఎవుడూ అడిగినోడు లేడనీసా? తీసుకున్నోడికి బుర్రసెడితే, ఇస్సినోడి బుద్ది ఏటైంది? అని చెడామడా తిట్టీసాడు వీరయ్య.
నిజమే! వీరయ్య. వారంతా ఇలా చేస్తున్నారు కాబట్టి మనమంతా ఒకటి కావాలి. ఎక్కడికక్కడ నిరసన తెలియజేయాలి. అని సెలవిచ్చాడు క్రాంతి. 'నిబ్బగే కాంతీ! మనెం నిరసననో! ఉద్దెమమనో తీత్తాం. ఈ దయిద్రగొట్టు రాజ్యింలో నిరసనలకి సోటెక్కడీ ఉద్దెమాలకి తానమేది? అడిగినోడ్ని అనగ్గొడుతున్నారు. పెస్నించినోడ్ని పర్రాకులెడతన్నారు. ఇప్పుడేటిసేయాలి మనెం?' అని వీరయ్య అన్నాడు.
ఇలాంటప్పుడే మనం చేసినది ప్రజలకు తెలియాలి. ప్రజా ఉద్యమంగా చేపట్టాలి. విషయాన్ని జనానికి సూటిగా చెప్పాలి. దాని కోసం బహుజనులను ఏకంచేయాలి. బడుగు బలహీన వర్గాలను కలుపుకుపోవాలి. కవులు, రచయితలు, కళాకారులను వెంటబెట్టుకొని కదలాలి. రేపే మనందరమూ గురజాడ విగ్రహం వద్దకు పోయి వినతి పత్రాలిద్దాం. గురజాడా! ఏది నీ జాడీ అని ఆ మహాకవినే అడుగుదాం.
అందరూ తలలూపుతూ ఎరుపెక్కిన కళ్లతో జిందాబాద్.. జిందాబాద్ ...గురజాడా జిందాబాద్... అంటూ అక్కడ నుంచి నిష్క్రమించారు.
- పిల్లా తిరుపతిరావు,
రాజాం రచయితల వేదిక, సెల్ : 7095184846