బీజింగ్ : వర్ణ వివక్ష, అసమానతలు అమెరికాలో రోజురోజుకూ విజృంభిస్తున్నాయని చైనా స్టేట్ కౌన్సిల్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ మంగళవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఇటీవలి సంవత్సరాల్లో అమెరికాలో విద్వేష నేరాలు, విద్వేష ప్రసంగాల ఘటనలు గణనీయంగా పెరిగాయని ఆ నివేదిక తెలిపింది. తుపాకీ కాల్పులు, మరణాలు కూడా బాగా పెరిగాయని పేర్కొంది. నల్లజాతీయులు, మైనారిటీ జాతులకు చెందిన వారు వైద్య సంరక్షణ, విద్య, గృహ నిర్మాణం, ఇతర రంగాల్లో వ్యవస్థాగతమైన వివక్షను ఎదుర్కొంటూనే వున్నారని పేర్కొంది. వర్ణ వివక్ష విస్తృతంగా వ్యాపించిందని, శ్వేత జాతీయులు ఎక్కువ, నల్లజాతీయులు తక్కువ అనే భావన అమెరికా వ్యవస్థల్లో లోతుగా పాతుకుపోయి విడదీయరానిదిగా మారిపోయిందని ఆ నివేదిక హెచ్చరించింది. అమెరికాలోని 15 ప్రధాన నగరాల్లో 2020, 2021లో విద్వేష నేరాల సంఖ్య రెండంకెలకు చేరుకుంది. పక్షపాతంతో ప్రేరేపించబడిన సంఘటనలు 2022 ఆగస్టులో ఐదు శాతం పెరిగాయని నివేదిక తెలిపింది. కాలిఫోర్నియా రాష్ట్ర యూనివర్శిటీలో విద్వేషం, తీవ్రవాదంపై అధ్యయన కేంద్రం నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంశాలను ఆ నివేదిక ఉటంకించింది. ఆరోగ్య సేవల రంగంలో అసమానతలు చాలా తీవ్రంగా వున్నాయని పేర్కొంది. వర్ణ, జాతి మైనారిటీ ప్రజలు దేశంలోకెల్లా అత్యధిక సంఖ్యలో ప్రసూతి మరణాలను ఎదుర్కొంటున్నారని వర్ణవివక్ష నిర్మూలనపై ఐక్యరాజ్య సమితి కమిటీ వ్యాఖ్యానించింది.
ఇక అమెరికన్ ఇండియన్స్ తమ కష్టాలు తీరతాయని భావించడం లేదు. ఫెడరల్ ఇండియన్ బోర్డింగ్ స్కూల్ ఇనీషియేటివ్ మొదటి భాగాన్ని గతేడాది మే 11న అమెరికా హోం శాఖ విడుదల చేసింది. ఆదివాసీ అమెరికన్ల పిల్లలను వారి కుటుంబాల నుంచి వేరు చేసి, వారి భాష, సంస్కృతులకు దూరం చేసి, శ్వేత జాతీయులైన అమెరికా సమాజంలో సమ్మిళితం చేయడానికి గతంలో ఫెడరల్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని హోం శాఖ అంగీకరించిందని ఆ నివేదిక పేర్కొంది.










