Jun 15,2023 06:28

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చి నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని ప్రకటించారు. ఇదే అదనుగా కొంతమంది వందిమాగధులు ముఖ్యమంత్రిని అదే పనిగా స్తుతించడం మొదలెట్టారు. అయితే రాష్ట్ర జనాభాలో మూడింట రెండు వంతులు నేటికీ గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అలాంటి గ్రామీణ జనాభాకు నిత్యం సేవలందిస్తున్న గ్రామ పంచాయితీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేశారా? వారి సమస్యల పరిష్కారం గురించి ప్రభుత్వం ఏనాడైనా శ్రద్ధ తీసుకున్నదా? పర్మినెంట్‌ హామీ గ్రామ పంచాయితీల్లో కార్యనిర్వహణాధికారి మినహా మిగిలిన పనుల్లో ఉన్న పర్మినెంట్‌ సిబ్బంది నామమాత్రం. ఉదాహరణకు, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం లోని 29 గ్రామాల్లో మొత్తం 164 మంది కార్మికులు పనిచేస్తుండగా వారిలో ముగ్గురే పర్మినెంట్‌ వారు. దుగ్గిరాల మండలంలోని 18 గ్రామాల్లో పనిచేసే 154 మంది కార్మికుల్లో ఇద్దరు పర్మినెంట్‌. పెదనందిపాడు మండలం 17 గ్రామాల్లోని 114 మంది కార్మికుల్లో ఒక్కరే పర్మినెంట్‌. తెనాలి రూరల్‌ మండలం 18 గ్రామాల్లో పనిచేసే 188 మందిలో ఇద్దరు పర్మినెంట్‌. గుంటూరు రూరల్‌, మేడికొండూరు మండలాల్లో పర్మినెంట్‌ కార్మికులు లేరు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అంటే సుమారు 43 ఏళ్ళ క్రితం గ్రామ పంచాయితీల్లో పర్మినెంట్‌ కార్మికుల సంఖ్య నిర్ధారించబడింది. తరువాత కాలంలో గ్రామాల్లో జనాభా, ఇళ్ళ సంఖ్య అనేక రెట్లు పెరిగాయి. ఆనాడు లేని కరెంట్‌, మంచినీటి సౌకర్యాలు, గ్రామీణ రోడ్లు, మురుగు కాల్వలు తదితరాలు పంచాయితీల్లో ఏర్పాటు చేయబడ్డాయి. వాటి నిర్వహణ పనుల్లో సేవలు అందించేందుకు అవసరమైన కార్మికుల పోస్టులను ప్రభుత్వాలు శాశ్వత ప్రాతిపదికన మంజూరు చేయలేదు. అందువల్ల శాశ్వత ఉద్యోగుల స్థానంలో పార్ట్‌టైమ్‌, టెండర్‌ కార్మికుల పేరుతో సిబ్బందిని జిల్లా పాలనా యంత్రాంగం అనుమతితో నియమించడం జరిగింది. వీరికి పర్మినెంట్‌ ఉద్యోగులకు వర్తించే జీతభత్యాలు, ఇతర ఏ సౌకర్యాలు అమలు జరగడంలేదు. పార్ట్‌టైమ్‌ ఉద్యోగుల్లో కొద్దిమందిని సుమారు మూడేళ్ళ క్రితం రెగ్యులర్‌ పేరుతో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చి ఇతర గ్రామాలకు పంపారు. వీరికి గత పిఆర్‌సి లోని బేసిక్‌ వేతనం కేవలం రూ.13 వేలుగా నిర్ణయించారు. ఆ జీతం కూడా ప్రభుత్వం ఇవ్వక పోవడంతో నేటికీ గ్రామ పంచాయితీల నుండే తీసుకుంటున్నారు. వారు ఇతర గ్రామాల్లో విధులు నిర్వర్తించాల్సి రావడంతో ప్రయాణ ఖర్చులు లేదా పని చేసే గ్రామంలో నివాసం కోసం ఇంటి అద్దెలు అదనంగా భరించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితి వారిని మరింతగా ఆర్థిక ఇబ్బందుల్లో పడేసినట్లయింది. ఇతర హామీల అమలు మాటేమిటి? వైసిపి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 'సమాన పనికి సమాన వేతనం, చిన్న ఉద్యోగులందరికీ 10 వేలకు తక్కువ లేకుండా జీతం' ఇస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్ళు దాటినా ఈ హామీలు గ్రామ పంచాయితీ కార్మికులకు అమలు కాలేదు. దుగ్గిరాల మండలంలోని రేవేంద్రపాడు గ్రామంలో పని చేస్తున్న పర్మినెంట్‌ స్వీపర్‌ జీతం నెలకు రూ.49,115. దీన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. టెండరు కార్మికులుగా గత పాతికేళ్ళ పైబడి అదే పని చేస్తున్న వారికి దానిలో నాల్గవ వంతు జీతం కూడా చెల్లించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2022 జనవరి నుండి అమలు చేస్తున్న నూతన పే రివిజన్‌ ప్రకారం రాష్ట్రంలో దిగువ స్థాయి పర్మినెంట్‌ ఉద్యోగులైన అటెండర్‌, వాచ్‌మెన్‌, స్వీపర్‌ లాంటి వారి బేసిక్‌ వేతనం రూ.20 వేలు. రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు చెల్లించే కనీస వేతనం నెలకు రూ.15 వేలుగా నిర్ణయించారు. గ్రామ పంచాయితీల్లో పని చేస్తున్న అటెండరు, పార్ట్‌టైమ్‌ కార్మికులకు ఈ రెండిటిలో ఏ ఒక్కదానితో సమానమైన వేతనాలూ ఇవ్వడంలేదు. చివరికి వైసిపి మ్యానిఫెస్టోలో పేర్కొన్న చిరుద్యోగులకు కనీస వేతనం రూ.10 వేలు ఇస్తామన్న హామీ ప్రకారం కూడా గ్రామ పంచాయితీ కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం అన్యాయం. పొన్నూరు మండలం లోని 161 మంది కార్మికుల్లో కేవలం ఇద్దరికి మాత్రమే రూ.10 వేలు, రూ.10,500 జీతం ఇస్తున్నారు. మిగతా వారందరికీ రూ.10 వేల లోపు జీతమే. ఇతర మండలాల్లో పని చేస్తున్న పంచాయితీ కార్మికుల్లో 60 నుండి 90 శాతం మంది పంచాయితీ కార్మికులకు రూ.10 వేల లోపు జీతం చెల్లించబడుతున్నది. కొంతమంది పంచాయితీ కార్మికులకు రూ.3 వేల జీతం కూడా చెల్లిస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు ఐదేళ్ళ క్రితం గ్రామ పంచాయితీల్లో పారిశుధ్య పనులు నిర్వర్తించే నిమిత్తం గ్రీన్‌ అంబాసిడర్ల పేరుతో అన్ని గ్రామ పంచాయితీల్లో కార్మికులను నియమించారు. చిన్న పంచాయితీల్లో వీరు తప్ప పారిశుధ్య పనులు నిర్వర్తించే కార్మికులే లేరు. కరోనా సమయంలో వీరు గ్రామీణ ప్రజానీకానికి చేసిన సేవలు నిరుపమానం. కరోనా రోగులకు బంధుమిత్రులు కూడా చేయని సహాయం వీరు చేశారు. ఆ సందర్భంగా వీరిని ప్రభుత్వమూ, ప్రజానీకం పొగడ్తలతో ముంచెత్తారు. ఇంత సేవ చేసిన గ్రీన్‌ అంబాసిడర్లకు గత ఐదేళ్ళుగా చెల్లించినది నెలకు 6 వేలు మాత్రమే. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక గ్రాంట్‌ ద్వారా చెల్లించబడింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి వీరి జీతాల చెల్లింపు బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంది. వీరిని పనిలో కొనసాగించాలా? వద్దా? జీతాలు ఎవరు చెల్లించాలి? ఎంత చెల్లించాలి? అనే విషయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి గత ఏడాది కాలంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. దీనివల్ల గ్రీన్‌ అంబాసిడర్ల జీతాల చెల్లింపు బాధ్యత గ్రామ పంచాయితీలపై పడింది. అసలే అంతంత మాత్రం ఆదాయాలతో కునారిల్లుతున్న గ్రామ పంచాయితీలు పారిశుధ్య కార్మికుల (గ్రీన్‌ అంబాసిడర్ల) జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నాయి. వేరే దారిలేక చాలా పంచాయితీల్లో వీరిని పని నుండి తొలగిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ పారిశుధ్యం తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉంది. మరోపక్క గ్రీన్‌ అంబాసిడర్ల కుటుంబాలు ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడబోతున్నాయి. తమది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వమేకానీ, తీసివేసే ప్రభుత్వం కాదని పదే పదే ప్రకటించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తన బాధ్యత ఏమీ లేనట్లు చోద్యం చూస్తున్నది. జీతాలు చెల్లింపు బాధ్యత ఎవరిది? ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న గ్రామ సచివాలయాల ఉద్యోగుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే వారధులుగా ఉన్న వాలంటీర్లు, రేషన్‌ వాహనదారుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నది. గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో పని చేస్తున్న కార్యనిర్వహణాధికారి, ఇతర పర్మినెంట్‌ సిబ్బంది జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నది. గత 43 ఏళ్ళుగా పెరిగిన గ్రామీణ కుటుంబాలు, జనాభా వారికి కల్పించే అదనపు సౌకర్యాలకు అనుగుణంగా పర్మినెంట్‌ ఉద్యోగుల సంఖ్యను పెంచి, నియమించి ఉంటే వారి జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి ఉండేది కదా. ప్రభుత్వాలు పర్మినెంట్‌ ఉద్యోగుల నియామకాలు చేయకపోవడం వల్ల వారి స్థానంలో పార్ట్‌టైమ్‌, టెండర్‌ కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లను నియమించాల్సి వచ్చింది. కాబట్టి గ్రీన్‌ అంబాసిడర్ల జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. వారి ఉద్యోగాలు నిలబెట్టాలి. గ్రామీణ పారిశుధ్యానికి గ్యారెంటీ ఇవ్వాలి. టెండర్‌ విధానాన్ని రద్దు చేసి, టెండరు కార్మికులందరినీ ప్రతి ఏటా రెన్యువల్‌ విధానం లేకుండా రెగ్యులర్‌గా కొనసాగించాలి. టెండరు, పార్ట్‌టైమ్‌ కార్మికులకు, గ్రీన్‌ అంబాసిడర్లకు ఎన్నికల హామీ మేరకు ''సమాన పనికి సమాన వేతనం'', ''కనీసం 10 వేల రూపాయల జీతం'' లాంటి హామీలు అమలు చేయాలి. లేనిపక్షంలో పోరుబాట వుండనే వుంది.

netaji

 

 

 

 

వ్యాసకర్త సి.ఐ.టి.యు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వై. నేతాజి