ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు తక్షణమే ప్రభుత్వ ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని టిడిపి ఎంఎల్‌సిలు కోరారు. ఆ పార్టీకి చెందిన పట్టభద్ర ఎంఎల్‌సిలు భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాటి చిరంజీవి రావు కోరారు. ఈ మేరకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్‌ను గురువారం రాజ్‌భవన్‌లో కలిసి వినతిపత్రం అందించారు. ఈ మేరకు వివిధ ప్రభుత్వం శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వాగ్ధానం చేసిన జాబ్‌క్యాలెండర్ అమలు కావడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో నిరుద్యోగ సమస్య పెరుగుతోందన్నారు. నాలుగేళ్లుగా డిఎస్‌సి, గ్రూప్, జూనియర్ కళాశాల లెక్చరర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు(ఏఈ), ఏఇఇ ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని తెలిపారు. యూనివర్సిటీల్లో 70శాతం వరకు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. చాలా విశ్వవిద్యాలయాల్లో ఆర్ట్స్, కామర్స్, సైన్స్, ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లలోని అనేక విభాగాలకు రెగ్యులర్ అధ్యాపకులు లేకుండా నడుస్తున్నాయని వివరించారు. దీంతో విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యాప్రమాణాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. ఈ ఖాళీలను వీలైనంత త్వరగా పారదర్శకంగా భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని వివరించారు.










