ప్రజాశక్తి - చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. వరద బాధితుల సహాయార్థం యుటిఎఫ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నాయకులు సేకరించిన బియ్యం, దుస్తులను శుక్రవారం చింతూరుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. గోదావరి వరదల కారణంగా విలీన మండలాల్లో వేల కుటుంబాలు సర్వం కోల్పోయి తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. రోడ్లపై గుడారాలు వేసుకొని దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. వరదల అనంతరం ముంపు ప్రాంతాల్లో ప్రబలుతున్న వ్యాధుల పట్ల స్పందించకపోవడం బాధాకరమన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు యుటిఎఫ్ నాయకులు ముందుకొచ్చి బట్టలు, వంట సామగ్రి, విద్యార్థులకు నోటు పుస్తకాలు సమకూర్చారని తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.జ్యోతిబసు, నాయకులు సురేష్, విల్సన్‌బాబు, కృష్ణయ్య, మురళి, సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి.కిరణ్, గిరిజన సంఘం నాయకులు కుంజా సీతారామయ్య పాల్గన్నారు. చట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు.










