
జీవో నెం 1 కేవలం విధానం మాత్రమేనని, సెక్షన్ 30 పోలీస్ చట్టం-1861 వినియోగంపై విధానపరమైన సూచనలు అధికారులకు ఇచ్చామని, రహదారులు-వీధుల్లో సభల కోసం అనుమతి కోరుతూ తమ దగ్గరకు దరఖాస్తులు వచ్చినప్పుడు అధికారులు వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో సూచిస్తూ మార్గదర్శకాలు ఇచ్చామని, సభలను నిషేధించలేదని ప్రభుత్వం చెబుతున్నది.
ప్రభుత్వ విధానం / మార్గదర్శకత్వం ఎలా ఉండాలి?
భావ ప్రకటనా స్వేచ్ఛ, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించటం, శాంతియుతంగా నిరసనలు తెలియజేయటం ప్రజాస్వామ్యం యొక్క మౌలిక లక్షణాలు. మన లాంటి దేశంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, శాంతియుతంగా ప్రదర్శనలు, నిరసనలు తెలియజేయటానికి హక్కు కలిగి ఉన్నారు. వాటిని ప్రభుత్వం గౌరవించాలి. ఇంకా చెప్పాలంటే ఆ హక్కులను వినియోగించుకోవటాన్ని ప్రోత్సహించాలి-అని రామ్‌లీలా మైదానం కేసులో సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం నిరుత్సాహపరుస్తూ అధికారులకు ఆదేశాలు ఇవ్వవచ్చా? పౌరహక్కుల విషయంలో రాజ్యాంగం కాని, కోర్టులు కాని వాటి వినియోగాన్ని నిరుత్సాహపరిచే వైఖరులు తీసుకోలేదు. ఎక్కువ శాతం కేసులు ప్రభుత్వాలు, పోలీసుల అధికారాలపై పరిమితులు, సహేతుక ఆంక్షల గురించి మాత్రమే చెప్పాయి. సహేతుక ఆంక్షలు ఖచ్చితంగా విధించేందుకు ప్రభుత్వానికి అధికారం వుందని చెబుతూనే అవి పౌర హక్కుల విషయంలో తక్కువ జోక్యం కలిగించేవిగా ఉండాలని సూచించాయి. సహేతుక షరతుల పేరుతో ప్రభుత్వం పౌరహక్కులను అడ్డుకునే విధంగా తమ కార్యనిర్వాహక అధికారాలను, శాసన అధికారాలు ఉపయోగించరాదని, భావ ప్రకటన స్వేచ్ఛ వినియోగించు కోవటానికి సహాయం అందించడం ప్రభుత్వం యొక్క విస్తృత ధర్మం అని అదే కేసులో సుప్రీంకోర్టు ఆదేశించింది. పౌరహక్కులపై సహేతుక షరతుల పేరుతో వాటిని అడ్డుకునే విధంగా చర్యలు కాని ఉత్తర్వులు కాని జారీ చేయరాదని ఆదేశించింది. రాజ్యాంగం స్పష్టంగా ప్రాథమిక హక్కులలో చేర్చి మరీ సమావేశాలు నిర్వహించుకోవచ్చని చెప్పిన నేపథ్యాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.
సెక్షన్ 30 చెబుతున్నది ఏమిటి? ఏ ప్రదేశాలకు వర్తిస్తుంది? దరఖాస్తును పోలీసులు తిరస్కరించవచ్చా? దరఖాస్తు పెట్టుకోమని పోలీసులు ఎప్పుడు కోరాలి? సెక్షన్ 30 ఎంత కాలం విధించాలి? సామూహిక నిషేధం ఈ సెక్షన్ ద్వారా విధించవచ్చా? ప్రజా అసౌకర్యం సహేతుక కారణమేనా? పోలీసులు ఈ చట్టాన్ని ఎలా అమలు చేశారు? సెక్షన్ 144 నిరంతరం విధించవచ్చా? నోటీసులు ఎలా ఇవ్వాలి? పబ్లిక్ ఆర్డర్ సోషల్ ఆర్డర్ ఒక్కటేనా? అనుమతి నిరాకరించాలంటే పోలీసులు ఏ ఆధారాలు చూపాలి? వంటి అనేకానేక ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమౌతాయి.
సెక్షన్ 30 ఏం చెబుతుందనే విషయంలో అనేక వాదనలు వస్తున్నాయి. పోలీసులకు ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని, సభలను సమావేశాలను పూర్తిగా నియంత్రించవచ్చని, అన్ని సమావేశాలకు పోలీసుల అనుమతి తీసుకోవలసిందేనని అంటున్నారు. కాని కోర్టు తీర్పులు భిన్నంగా ఉన్నాయి. ఈ విషయంలో సుమారు వంద సంవత్సరాల క్రితమే కోర్టులు స్పష్టంగా ప్రతి సమావేశానికి సెక్షన్ 30 వర్తించదని, ఏ సమావేశం అయితే అధికారుల దృష్టిలో నియంత్రణ వీలుకాదని అనుకుంటారో అలాంటి సమావేశాలకు మాత్రమే వర్తిస్తుందని, అలాంటి సమావేశాలకు మాత్రమే నోటీసులు ఇచ్చి అనుమతి కోసం దరఖాస్తులు పెట్టుకోమని పోలీసులు కోరాలని చెప్పాయి. వాస్తవానికి సెక్షన్ 30 చదివినా మనకు అదే అర్థం అవుతుంది. అసలు లైసెన్స్ లేకుండా ఏ సమావేశం నిర్వహించకూడదని సార్వత్రిక నోటిఫికేషన్ ఇచ్చే అధికారం పోలీస్ అధికారులకు లేదని 1930లో దేబేంద్రనాద్ మండల్ కేసులో కోర్టు చెప్పింది. చాలా కొద్ది తీర్పులలో దీనికి వ్యతిరేకంగా పోలీసులకు అధికారాలున్నాయని చెప్పారు.
ఈ పోలీస్ చట్టం 1861, సెక్షన్ 30 కేవలం రహదారులు, వీధులు, మార్గాలకు మాత్రమే వర్తిస్తుందని, మిగిలిన ప్రదేశాలకు ఎటువంటి అనుమతులు కోరవలసిన అవసరం ఈ సెక్షన్ ప్రకారం లేదని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు డివిజన్ బెంచ్ బేడి గురుచరణ్ కేసులో (1974లో) చెప్పింది.
అన్ని సమావేశాలను సామూహికంగా నిషేధిస్తూ అనగా అన్ని సమావేశాలకు ఈ సెక్షన్ ప్రకారం అనుమతి తీసుకోవాలని ఆదేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసే అధికారం పోలీసులకు లేదు. కేవలం ఏ సమావేశాలైతే శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందో అలాంటి సమావేశాలకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుంది-అని పంజాబ్, హర్యానా హైకోర్టు చెప్పింది.
సెక్షన్ 30 కాల పరిమితి
ఈ సెక్షన్‌లో కాలపరిమితి లేదు. కాని సాధారణంగా రెండు నెలలు విధిస్తుంటారు. అపరిమితంగా నిరంతరం ఈ సెక్షన్‌ని విధించటం రాజ్యాంగ విరుద్ధం.
దరఖాస్తును పోలీసులు తిరస్కరించవచ్చా?
అసలు సభలు, ప్రదర్శనలు అనుమతి కోరుతూ పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరించే అధికారం ఈ సెక్షన్ అధికారాలను ఇవ్వలేదని, అలాంటి అవకాశం సెక్షన్ 30(3) కల్పించలేదని కేవలం అనుమతించాలని మాత్రమే చెబుతుందని మద్రాస్ హైకోర్టు దురై శంకర్ కేసులో 2014లో అభిప్రాయపడింది.
నియంత్రణ అంటే ఏమిటి?
ప్రభుత్వాలు ప్రతి పౌరుడికి సమావేశాలు నిర్వహించుకోవటానికి ఉన్న ప్రాథమిక హక్కును గమనంలో ఉంచుకుని మాత్రమే నియంత్రణ చేయాలి. నియంత్రణ పేరుతో సమావేశాల హక్కును తొలగించరాదు. అదేవిధంగా అన్ని రహదారులలో, వీధుల్లో సమావేశాలను నిషేధించరాదు-అని 1973 లోనే సుప్రీంకోర్టు హిమత్ లాల్ కె షా కేసులో అభిప్రాయపడింది.
జీవో నెం 1 ప్రభావం
కేవలం సెక్షన్ 30 వున్నప్పుడే పోలీసులు...ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల సభలు సమావేశాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. నిరంతరం సెక్షన్ 30, సెక్షన్ 144 విధిస్తూ సమావేశాలను అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఈ జీవో పేరుతో మరిన్ని ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది. ప్రదర్శనలను మేము ఈ జీవోలో ప్రస్తావించలేదంటున్నారు. కానీ ఈ జీవో వచ్చిన మూడు రోజుల్లోనే ప్రకాశం జిల్లాలో కెవిపిఎస్ ప్రదర్శనను ఈ జీవో పేరు చెప్పి అడ్డుకున్నారు. గత అనేక అనుభవాలరీత్యా పోలీసులు ప్రజా సంఘాలను మరింతగా ఇబ్బంది పెట్టేందుకే ఈ జీవో ఉపయోగపడుతుంది. ప్రభుత్వం నిజంగా పౌరహక్కుల పక్షాన ఉంటే ఈ జీవో ఉపసంహరించాలి.
అసలే కోతి... ఆపై కల్లు తాగితే...
పోలీస్ డిపార్ట్‌మెంట్ పూర్తిగా రాజకీయ నాయకుల ప్రభావంతో ఉందని, దానిని విముక్తి చేయాలని అనేక నివేదికలు చెప్తున్నాయి. అలాంటి తరుణంలో పోలీసులకు ఇచ్చిన విచక్షణ ఎవరికి అనుకూలంగా ఉంటుందో ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో సుప్రీంకోర్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం లోని సెక్షన్ 66(ఎ)ని కొట్టివేసింది. అయినప్పటికీ చాలా సంవత్సరాల పాటు ఆ సెక్షన్‌ను ఉపయోగించి పోలీసులు కేసులు పెట్టారు. దాని గురించి మరలా కోర్టులో కేసు వేయాల్సి వచ్చింది. కనుక మామూలుగా ఉన్నప్పుడే సెక్షన్ 30 నిరంతరం దుర్వినియోగం అవుతున్న పరిస్థితుల్లో...ఇలాంటి జీవో ప్రభావం పోలీసులపై ఎలా ఉంటుంది? మేం కేవలం సూచనే చేశాం. నిర్ణయం అధికారులదే అంటుంది ప్రభుత్వం. అంటే తాను ఇచ్చిన మార్గదర్శకాలు అమలు కాకూడదని ప్రభుత్వం అనుకుంటుందా? మార్గదర్శకాలు ఇచ్చి అమలు చేయనక్కర్లేదంటే అధికారులకు అర్థం అవుతుందా?
పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పును ప్రామాణికంగా తీసుకుంటే అసలు జీవో నంబర్ వన్ అనే ప్రభుత్వ ఉత్తర్వు అసంబద్ధమైనది. ఎందుకంటే కేవలం రహదారులకు సంబంధించిన సభలు సమావేశాలకు మాత్రమే పోలీసుల అనుమతి అవసరమని సెక్షన్ 30 చెబుతుంది. కనుక ఇతర ప్రాంతాలకు పోలీసుల అనుమతి అవసరం లేదు. అలాంటి తరుణంలో ఇతర ప్రాంతాలలో సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలని ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వడం అర్ధరహితం.
వ్యాసకర్త : ఎ.పి.సి.ఎల్.ఎ ప్రధాన కార్యదర్శి, సుప్రీంకోర్టు న్యాయవాది పొత్తూరి సురేష్ కుమార్