Apr 16,2023 06:30

ఇరాన్‌, సిరియా ప్రతినిధులు సౌదీ అరేబియా గడ్డ మీద అడుగు పెట్టటం, అదీ ఒకే రోజున. కొద్ది నెలల క్రితం వరకు ఇది ఊహకే అందని అంశం. ఇది కలా నిజమా అని అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. నిజమే చైనా మధ్యవర్తిత్వంలో నెల రోజుల క్రితం ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య కుదిరిన ఒప్పందం ఊరికే ప్రకటనలకే. ఒక్క అడుగైనా ముందుకు సాగదని, ప్రచారానికే పరిమితం అంటూ పశ్చిమ దేశాల మీడియా శాపనార్థాలు పెట్టింది. దీనికి భిన్నంగా నెల రోజుల్లోగానే ఫలితాలను ఇస్తున్నట్లు కనిపించటం అరబ్బు, పశ్చిమాసియాలో శాంతిని కోరుకొనే వారికి సంతోషం...పుల్లలు పెట్టేవారికి విషాదంగా మారటంలో ఆశ్చర్యం లేదు. అందునా ముస్లింలు ముఖ్యమైనదిగా భావించే రంజాన్‌ మాసంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు సహజంగానే అమెరికా, దాని తొత్తు ఇజ్రాయెల్‌ వంటి కొన్ని దేశాలకు రుచించటం లేదు.
తమ ప్రతినిధి వర్గం రియాద్‌ (సౌదీ అరేబియా రాజధాని) గడ్డ మీద అడుగుపెట్టినట్లు బుధవారంనాడు ఇరాన్‌ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఎర్ర సముద్ర తీర సౌదీ నగరమైన జెడ్డాకు పన్నెండు సంవత్సరాల తరువాత తొలిసారిగా సిరియా విదేశాంగ మంత్రి వచ్చినట్లు సౌదీ ప్రకటించింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న సిరియా, ఎమెన్‌ సంక్షోభ పరిష్కారానికి దోహదం చేసే పరిణామాలకు ఇది సంకేతంగా భావిస్తున్నారు. సౌదీ-సిరియా మంత్రులు సిరియా సమస్యకు ఒక రాజకీయ పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు జరిపారు. ఈ పరిణామం తిరిగి సిరియా అరబ్బు ప్రపంచంలోకి అడుగుపెట్టటంతో పాటు తటస్థ పాత్రను పోషిస్తుందని సౌదీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఐక్యత, భద్రత, సిరియా భద్రత గురించి చర్చించటంతో పాటు ఇరుదేశాలు దౌత్య సంబంధాలతో పాటు విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించాలని నిర్ణయి ంచాయి. వచ్చే నెలలో జరిగే అరబ్‌ లీగ్‌ సమావేశానికి సిరియా అధినేత బషర్‌ అల్‌ అసాద్‌ రాకకు వీలు కల్పించేందుకు శుక్రవారం నాడు జెడ్డాలో లీగ్‌ ప్రతినిధుల సమావేశం జరగనుంది. దాని కంటే ముందే సిరియా మంత్రి సౌదీ వచ్చాడు. రియాద్‌లో ఇరాన్‌ రాయబార కార్యాలయంతో పాటు జెడ్డాలో కాన్సులేట్‌ జనరల్‌ ఏర్పాటు గురించి ఇరాన్‌ ప్రతినిధి వర్గం చర్చిస్తున్నది. ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీమ్‌ రైసీ తమ దేశ పర్యటనకు రావాలని సౌదీ ఆహ్వానం పంపింది. ఆలోగా ఇవన్నీ పూర్తవుతాయి.
ఎమెన్‌ అంతర్యుద్ధంలో ఇరాన్‌ మద్దతు ఉన్న హైతీ తిరుగుబాటుదార్లను అణచేందుకు గత ఎనిమిది సంవత్సరాలుగా ఇతర దేశాలను కలుపుకొని సౌదీ అరేబియా మిలిటరీ జోక్యం చేసుకుంటున్నది. ఇప్పుడు దానికి కూడా తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. రాజధాని సనాతో సహా అత్యధిక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తిరుగుబాటుదార్లు తెచ్చుకున్నారు. సౌదీ రాయబారి సనా వెళ్లి తిరుగుబాటుదార్లతో చర్చలు జరిపి పదవీచ్యుతులైన పాలకులతో ఒక రాజకీయ పరిష్కారం కుదిర్చే పనిలో వున్నారు. ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగిస్తున్న మిలిటరీ చర్యలను నిలిపేసి తన ఆర్థిక వ్యవస్థను చక్కబరుచుకోవాలని సౌదీ నిర్ణయించుకుంది.
ఈ పరిణామాల పూర్వరంగంలో అమెరికా ఎత్తుగడలో భాగంగా ఇజ్రాయెల్‌ గత కొద్ది రోజులుగా సిరియా ఇతర ప్రాంతాల మీద దాడులకు తెగబడుతోంది. సిరియాలో ఫిబ్రవరి ఆరున సంభవించిన భూకంప బాధితులకు ఇరాన్‌ పంపుతున్న సాయాన్ని మిలిటరీ పరికరాలు, ఆయుధాలు అందచేయటంగా పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేసింది. దీన్ని సాకుగా చూపి ఇజ్రాయెల్‌ సిరియా లోని అలెప్పో విమానాశ్రయం, అల్‌దాబ్‌ వైమానిక కేంద్రంపైనా దాడులు చేసింది. పశ్చిమాసియా, అరబ్బు ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు అమెరికాకు మింగుడు పడటం లేదు. వివిధ దేశాల్లో ఉన్న ఇజ్రాయెల్‌ బాధిత పాలస్తీనా హమాస్‌ వంటి తిరుగుబాటు బృందాలు, శక్తులకు ఇటీవలి కాలంలో ఇరాన్‌ పెద్ద ఎత్తున అండదండగా ఉంది. సౌదీతో సర్దుబాటు కుదిరినందున రానున్న రోజుల్లో మరింతగా కేంద్రీకరించవచ్చు. దీనికి తోడు చైనా, రష్యా ప్రభావం పెరగటాన్ని అమెరికా సహించటం లేదు. సౌదీ-ఇరాన్‌ ఒప్పందాన్ని మొక్కుబడిగా మంచిదేగా అని వర్ణించింది. రానున్న రోజుల్లో ఏదో ఒక సాకు చూపి ఇజ్రాయెల్‌ ద్వారా మరిన్ని దాడులకు తెగబడినా ఆశ్చర్యం లేదు.

- ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌