
ప్రఖ్యాత మీడియా సంస్థ బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు జరుపుతున్న దాడులు మీడియా గొంతు నొక్కే యత్నమే! ఢిల్లీ, ముంబాయిల్లోని ఆ సంస్థ కార్యాలయాలపై మంగళవారం ప్రారంభమైన దాడులు, బుధవారం కూడా కొనసాగుతున్నాయి. తాము చేస్తున్నది దాడులు కాదని, సర్వేలు మాత్రమే అని ఐటి అధికారులు చెబుతున్నప్పటికీ అసలు సత్యమేమిటో దేశ ప్రజలందరికి తెలుసు! పేరేదైనా భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా తమ దారికి తెచ్చుకోవడమన్నది కేంద్ర ప్రభుత్వ వ్యూహం. నరేంద్ర మోడీ నేతృత్వం లోని కేంద్ర బిజెపి సర్కారు తీరు తెన్నుల గురించి తెలిసిన వారికి ఈ దాడులు ఆశ్చర్యమేమి కలిగించవు. గతంలోనూ తన దారికి రాని మీడియా సంస్థలపై ఇటువంటి దాడులు జరిపిన చరిత్ర మోడీ ప్రభుత్వానికి ఉంది. కాకపోతే, అవి దేశీయ సంస్థలు! ఇప్పుడు విదేశీ, అంతర్జాతీయ మీడియా సంస్థలను కూడా బెదిరించి, భయపెట్టడానికి బిజెపి ప్రభుత్వం బరితెగించింది. అయినా, తమ జర్నలిజం కొనసాగుతుందని, వీక్షకులకు నిబద్దతతో సమాచారాన్ని అందించడానికి తాము దృఢనిశ్చయంతో ఉన్నామని బిబిసి ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం.
2002లో దేశవ్యాప్తంగా సంచలనం రేపి, ప్రపంచ దృష్టిని ఆకర్షించిన గుజరాత్ అల్లర్లలో నాటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ పాత్ర, ముస్లింలతో ఆయన సంబంధాలపై రూపొందించిన డాక్యుమెంటరీని బిబిసి ప్రచారం చేసిన కొన్ని వారాల్లోనే ఈ దాడులు జరుగుతుండటం గమనార్హం. నిజానికి ఈ డాక్యుమెంటరీ 2002 దాడుల గురించి మాత్రమే కాదు, అప్పటి నుండి 2023 వరకు సాగిన దేశ గమనం గురించి! 2014 నుండి దేశంలో చోటుచేసుకున్న వివిధ పరిణామాలు, ఆ సంఘటనలకు దారి తీసిన కారణాలు, కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరు తదితర అంశాలకు కూడా ఈ డాక్యుమెంటరీలో ప్రాధాన్యత లభించింది. గతం నుండి వర్తమానం వరకు సాగుతున్న ప్రయాణాన్ని నరేంద్రమోడీ ప్రభావితం చేసిన తీరు, దానివెనుక ఉన్న సైద్ధాంతిక భావజాలాన్ని చర్చించిన ఈ డాక్యుమెంటరీ బ్రిటన్‌లో మాత్రమే ప్రసారమైంది. మన దేశంలో సోషల్ మీడియాలో మాత్రమే అందుబాటులోకి రాగా దానిని కూడా నిషేధించిన ఘనత మోడీ సర్కారుది! ఈ నేపథ్యంలోనే లాభాల లెక్కలు సరిగా చూపకుండానే, నిధులను బదిలీ చేస్తున్నారంటూ ఆదాయ పన్ను విభాగం రంగంలోకి దిగింది. ఇది కక్ష సాధింపు కాక మరేమిటి? ఐటి అధికారులు చెబుతున్న విషయాలు నిజమని భావించినా, అవి ఇప్పుడే కనిపించాయా? మరి, అదానీపై వస్తున్న ఆరోపణలు, ఆయన అక్రమాల కారణంగా నష్టపోయిన దేశ సంపద సంగతేంటి? ఐటి, ఇడిలు స్పందించవా? ప్రధాని సన్నిహితులకైతే చట్టం చుట్టంగా మారిపోతుందా?
మోడీ వ్యతిరేక కథనాలు ప్రచురణ, ప్రసారం చేసినందుకు ది హిందూ, ది వైర్, ఎన్‌డిటివి, న్యూస్‌క్లిక్, దైనిక్ జాగరణ్ వంటి మీడియా సంస్థలు గతంలో దర్యాప్తు సంస్థల దాడులకు గురయ్యాయి. సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మైనార్టీలకు అండగా నిలిచే గ్రీన్‌పీస్ ఇండియా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ (ఇండియా), ఆక్స్‌ఫామ్ (ఇండియా) వంటి అంతర్జాతీయ సంస్థలను కూడా మోడీ ప్రభుత్వం వదలలేదు. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి నిధులు వచ్చే మూలాలను తుంచి వేసింది. ఇప్పుడు విదేశీ మీడియా వంతు వచ్చింది. ఒకవైపు ఈ ఏడాది జి-20 గ్రూపునకు మన దేశం నాయకత్వం వహిస్తోంది. ఆ సమావేశాల సన్నాహ చర్యల్లో భాగంగా వివిధ దేశాల ప్రతినిధులు దేశం నలుమూలల పర్యటిస్తున్నారు. ఇటువంటి సమయంలోనూ ఒక మీడియా సంస్థ మీద, అందులోనూ బిబిసి వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మీడియా సంస్థపైన కక్ష సాధింపు చర్యలకు పూనుకుందంటే బిజెపి ప్రభుత్వ బరితెగింపును అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు పత్రికాస్వేచ్ఛలో భారత ర్యాంకింగ్‌ను గణనీయంగా తగ్గిస్తున్నాయి. తాజా పరిణామాలతో దేశ ప్రతిష్ట మరింత మరింతగా మసకబారే అవకాశం ఉంది. మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ తరహా లక్షిత దాడులను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య, అభ్యుదయ వాదులందరి మీదా ఉంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడి భావి తరాలకి పదిలంగా అందించడం కోసం విశాల ప్రజానీకం ఐక్యంగా కదలడమే మార్గం. పత్రికాస్వేచ్ఛను కాపాడుకోవడం ఎంతో అవసరం.