Sep 18,2022 06:35

కేరళ నమూనా దేశానికే ఆదర్శం
బిజెపి, ఆరెస్సెస్‌ హిందూత్వ కార్పొరేట్‌ విధానాలకు బలమైన ప్రత్యామ్నాయాన్ని ముందుకు తేవడం ద్వారా కేరళలో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం దేశానికి ఓ కొత్త మార్గాన్ని చూపుతున్నది. లౌకికవాదం పట్ల తిరుగులేని నిబద్ధత, రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు నికరంగా కట్టుబడి ఉంటూ నవ కేరళ నిర్మాణం దిశగా ముందుకు సాగుతున్నది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాంకేతిక రంగాల్లో ప్రగతిశీల శక్తులకు కేంద్రంగా ఉన్నది.
ఎన్డీయే పాలనలో ద్రవ్యోల్బణం కనివిని ఎరుగని స్థాయికి చేరుకోవడం, భారీగా రూపాయి పతనం, ప్రభుత్వ రంగ సంస్థల విధ్వంసం, తీవ్ర రూపం దాల్చుతున్న నిరుద్యోగంతో దేశం అథోగతి పాలవుతున్నది. దీనికి వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, ఉద్యోగులు, అన్ని సెక్షన్ల ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. దీనికి తోడు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్షత. ఒకదాని వెంట ఒకటి వరుసగా విరుచుకుపడిన విపత్తులు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య అటు ప్రజా సంక్షేమం, ఇటు రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది.
అధిక ధరలు
వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఎడాపెడా పెంచుకుంటూ పోతుండడంతో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. అసంఖ్యాక ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నది. గోరుచుట్టుపై రోకలిపోటులా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆహార వస్తువులపై జిఎస్టీని 5 శాతం పెంచింది. సామాన్యుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాష్ట్రంలో రిటైల్‌ షాపుల్లో ఆహార వస్తువులపై జిఎస్టీ అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. పెట్రోలు ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కేరళ ప్రభుత్వం అమ్మకపు పన్నును కొంతమేర తగ్గించుకుంది.
రాష్ట్రాల హక్కులు
కోవిడ్‌ సంక్షోభ సమయంలో రాష్ట్రాలకు దమ్మిడీ సాయం చేయకపోగా, సాంప్రదాయకంగా ఉన్న రాష్ట్రాల ఆదాయ వనరులను కొల్లగొడుతూ, వాటి హక్కులను హరించడాన్ని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. అప్పులపై కేంద్రానికి పరిమితి లేనప్పుడు రాష్ట్రాలకు పరిమితులు విధించడాన్ని ప్రశ్నించింది. రాష్ట్రాలకు జిఎస్టీ పరిహారం చెల్లించకుండా తాత్సారం చేస్తున్న కేంద్రాన్ని నిలదీస్తున్నది. రాష్ట్రాలకు జిఎస్టీ పరిహారం మరో అయిదేళ్ల పాటు పొడిగించాలని డిమాండ్‌ చేసింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలను, రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నది. గవర్నర్లను బిజెపి రాజకీయ ఏజెంట్లుగా చేస్తూ, బిజెపి యేతర రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరత్వ పాల్జేసే కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుతున్నది.
ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగించేందుకు యత్నిస్తుంటే, వాటిని ప్రభుత్వ రంగంలో కొనసాగించేలా చూసేందుకు ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నది. తిరువనంతపురం విమానాశ్రయాన్ని అదాని పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేలం పెట్టినప్పుడు కార్పొరేట్‌ దిగ్గజాలతో పోటీ పడి ఆ విమానాశ్రయాన్ని కేరళ ప్రభుత్వం దక్కించుకుంది. అలాగే ట్రాంకోవర్‌లోని ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్‌ ప్లాంట్‌ను మూసివేయాలని కేంద్రం నిర్ణయించినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకుని తిరిగి తెరిపించింది. మొత్తంగా 42 ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించి, వాటిని లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేస్తున్నది. సహకార బ్యాంకుల విషయంలో కేంద్రం ఇటువంటి విన్యాసమే చేసినప్పుడు వాటిని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టింది.
కోవిడ్‌ మహమ్మారిపై పోరు
దేశంలోనే మొట్టమొదటి కరోనా కేసు నమోదయిన కేరళలో దానిని నియంత్రించేందుకు ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అనుసరించిన బహుముఖ వ్యూహం సర్వత్రా ప్రశంసలందుకుంది. ఉహాన్‌ నుంచి వచ్చిన విద్యార్థికి కోవిడ్‌ వచ్చినట్లు నిర్ధారణ కాగానే ఆ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు, కోవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు, ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచేందుకు, ప్రజల సంక్షేమానికి నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించి పకడ్బందీగా అమలు చేయడం ద్వారా ప్రాణ నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగింది. నిఫా వైరస్‌, భారీ వరదలు ఒక దాని తరువాత ఒకటి చుట్టుముట్టినప్పుడు వాటిని దీటుగా ఎదుర్కొన్న అనుభవం కోవిడ్‌ మహమ్మారిపై పోరులో బాగా ఉపయోగపడింది. కోవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో దేశంలో చాలా రాష్ట్రాలు ఆక్సిజన్‌ కొరత, బెడ్ల కొరత, వంటి సమస్యలతో సతమతమైనా, కేరళలో మాత్రం ఎక్కడా అటువంటి సమస్యే రాలేదు. గెస్ట్‌ వర్కర్స్‌ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చూసుకుంది.
విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట
విద్య, వైద్య రంగాల్లో కేరళ దేంలోనే అగ్రగామిగా నిలిచిందని నీతి ఆయోగ్‌తో సహా పలు సంస్థల సర్వేలు వెల్లడించాయి. ప్రజారోగ్య రంగంలో 82.8 పాయింట్ల స్కోరుతో కేరళ ఉత్తమ రాష్ట్రంగా నిలవగా, బిజెపి పాలిత యుపి 30.57 పాయింట్లతో అట్టడుగున ఉన్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల దగ్గర నుంచి మెడికల్‌ కాలేజి ఆసుపత్రుల వరకు ఆధునీకరించడం, తాలూకా, జిల్లా ఆసుపత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నది. తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు కేరళ ప్రత్యేకత.
విద్యారంగంపైన కేరళ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. నాణ్యమైన ప్రాథమిక, మాధ్యమిక, వృత్తి విద్యను అందించేందుకు అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకుంది. డిజిటల్‌ విద్య, నాలెడ్జి పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రూ.900 కోట్లతో ఒక పథకం ప్రవేశపెట్టింది. క్లాస్‌ రూమ్‌లో అధునాతన మౌలిక సదుపాయాలను కల్పించడంతోబాటు టీచర్‌ పోస్టుల ఖాళీలను వెనువెంటనే భర్తీ చేస్తున్నది.
వ్యవసాయ రంగం
వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు అన్ని స్థాయిల్లోను ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టింది. తిండి గింజల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడేందుకు 'అవర్‌ పాడీ అవర్‌ ఫుడ్‌' (మన వరి, మన ఆహారం) అన్న నినాదాన్ని తీసుకుంది. సమర్థవంతమైన మార్కెట్‌, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఓనమ్‌, విషు, రంజాన్‌, క్రిస్మస్‌ పండగల సందర్భంగా సంతలు నిర్వహించడం వంటివి చేపడుతున్నది. 3 లక్షల హెక్టార్లలో వరి పండించేందుకు ప్రణాళికలు రచించింది. గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. దేశంలోనే మొదటిసారి పేద రైతులు, వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.1100 పింఛను స్కీమ్‌ ప్రారంభించింది. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, ఉత్పత్తుల నిల్వ, విలువ జోడింపు కోసం వాల్యూ యాడెడ్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ను ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించింది. పరిశ్రమల అభివృద్ధికి కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ఏర్పాటు చేసింది. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
ఆన్‌లైన్‌ టాక్సీ
దేశంలోనే మొదటి సారి ఆన్‌లైన్‌ టాక్సీ (కేరళ సవారి) సర్వీస్‌ను ప్రారంభించింది. ప్రయాణీకులకు, టాక్సీ డ్రైవర్లకు ఇరువురికీ మేలు చేకూర్చేలా దీనిని రూపొందించింది. లేబర్‌ డిపార్టుమెంట్‌ సౌజన్యంతో మోటార్‌ వర్కర్స్‌్‌ వెల్ఫేర్‌ బోర్డు ఈ ఆన్‌లైన్‌ టాక్సీలను నిర్వహిస్తున్నది. ప్రజాస్వామిక విలువల పరిరక్షణలో కేరళ మొదటి స్థానంలో ఉంది. 2021 సంవత్సరంలో అత్యధిక రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన ఉత్తమ రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, ఢిల్లీ 10 రోజుల కన్నా తక్కువగా సమావేశమయ్యాయని పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రిసెర్చి నివేదిక తెలియజేసింది.
ఆదివాసీలకు అండగా..
ఆదివాసీలకు అండగా నిలవడంలో కేరళ ముందున్నది. భూమిలేని గిరిజనులెవరూ లేని రాష్ట్రంగా కేరళను నిలపాలని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం సంకల్పించింది. గిరిజనుల పునరావాసం, అభివృద్ధి మిషన్‌ (టిఆర్‌డిఎం) కింద ఎస్టీలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల చట్టం-2006) కింద గిరిజనులకు భూ హక్కు పత్రాలు అందజేసింది. కేరళలో 1.7 లక్షల కుటుంబాలకు సంబంధించి 4.84 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 1.45 శాతంగా ఉన్న వీరికి భూమి ఏకైక ప్రధాన ఆదాయ వనరు. గతేడాది 691 కుటుంబాలకు 56,847 ఎకరాల భూమి పంపిణీ చేసింది. అటవీ ఉత్పత్తులకు ఎంఎస్‌పి లభించేలా చేసింది. 3 లక్షల మందికి 'లైఫ్‌ హౌసింగ్‌' కింద ఇళ్లు నిర్మించి ఇచ్చింది.
సిల్వర్‌ లైన్‌ ప్రాజెక్టు
నవ కేరళ నిర్మాణంలో భాగంగా సిల్వర్‌ లైన్‌ ప్రాజెక్టును ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడితే దానిని అడ్డుకునేందుకు బిజెపి, కాంగ్రెస్‌ ఏకమయ్యాయి. ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమానికి పూనుకున్నాయి. పార్లమెంటులో రైల్వేమంత్రి ఒక ప్రశ్నకు జవాబిస్తూ 'సిల్వర్‌ లైన్‌ ప్రాజెక్టు కేరళ ప్రభుత్వానిది మాత్రమే కాదు, ఇందులో రైల్వే శాఖకు 49 శాతం వాటా ఉంది.' అని చెప్పారు. మెట్రో మ్యాన్‌ ఇ. శ్రీధరన్‌ కూడా ఈ ప్రాజెక్టుకు పర్యావరణ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇది మంచి ప్రాజెక్టు అని చెప్పారు. కేరళ బిజెపి సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నది. కాంగ్రెస్‌ కూడా దానికి వంత పాడుతున్నది.
బిజెపి గుజరాత్‌ మోడల్‌ దేశాన్ని నాశనం చేసేదిగా ఉంటే, కేరళ మోడల్‌ దేశానికి దిక్సూచిగా ఉంది.

వ్యాసకర్త  కె. గడ్డెన్న సెల్‌ : 9490099012