May 03,2023 20:43
  •  కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలి
  •  పంట విస్తీర్ణంతో సంబంధంలేకుండా బీమా వర్తింపచేయాలి
  •  రాష్ట్ర రైతు సదస్సులో తీర్మానం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పసుపు పంటకు మద్దతు ధర రూ.10 వేలు ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని, జాతీయ స్థాయిలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పసుపు రైతుల రాష్ట్ర సదస్సు తీర్మానించింది. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పసుపు రైతుల రాష్ట్ర సదస్సు బుధవారం జరిగింది. ఎపి రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకర్‌ అధ్యక్షత వహించారు. పంట విస్తీర్ణంతో సంబంధంలేకుండా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని తీర్మానించారు. యార్డులలో ఈనామ్‌ సిస్టమ్‌ను శాస్త్ర, సాంకేతిక పరికరాలతో ఆధునీకరించేంత వరకు పాతపద్ధతిలోనే కొనుగోలు చేయాలని, పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. సదస్సులో ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ మాట్లాడుతూ పసుపు రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పసుపు రైతులు ఎకరాకు రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టగా 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, క్వింటాలు రూ.5 వేలకు మించి కొనుగోలుచేయకపోవడంతో ఈ ఏడాది ప్రతి రైతు ఎకరా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.6850కి ఎక్కడా కొనుగోలు చేయడంలేదని తెలిపారు. క్వింటాలు పసుపు రూ.10 వేలుకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో జరిగిన రైతు పోరాటం స్ఫూర్తిగా పసుపు రైతులు మరో పోరాటానికి సంఘటితం కావాలన్నారు. సదస్సులో కౌలు రైతు రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, రైతు నాయకులు డి.వెంకటేశ్వర్లు, వేములపల్లి వెంకటరామయ్య, వల్లభనేని సాంబశివరావు, జెట్టి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

  • 15 మందితో పసుపు రైతుల రాష్ట్ర కమిటీ
  • కన్వీనర్‌గా జొన్నా శివశంకర్‌, కో కన్వీనర్‌గా కొండా రామిరెడ్డి

పసుపు రైతుల సమస్యలపై పోరాడేందుకు రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీకి కన్వీనర్‌గా జొన్న శివశంకర్‌ (గుంటూరు), కో కన్వీనర్‌గా కొండా రామిరెడ్డి (కృష్ణా), సభ్యులుగా దేెవులపల్లి వెంకట్రామయ్య, కె రామస్వామి (బాపట్ల), వల్లభనేని సాంబశివరావు, కాజ వెంకటేశ్వరరావు, ములకా శివసాంబిరెడ్డి (గుంటూరు), అన్నం రాజు గోపాల కృష్ణ (కడప), కె అమరలింగేశ్వరరావు (పల్నాడు), టి రామచంద్రుడు (నంద్యాల), సురేష్‌, కృష్ణ (కృష్ణా), అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, ఎన్‌టిఆర్‌ జిల్లాల నుండి కోఆప్షన్‌ సభ్యులను తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.