
లక్షలాదిమంది గీత కార్మికులు తమ వృత్తిలో స్వయం ఉపాధి పొందుతున్నారు. అయితే...ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలన బహుళజాతి లిక్కర్ కంపెనీల శీతల పానీయాల ధాటికి కల్లు అమ్మకాలు దెబ్బ తింటున్నాయి. వృత్తిలో ఉపాధి సరిగా లేక బతుకుదెరువు కోసం ఇతర పనులు వెతుక్కుంటున్నారు. విదేశాలకు, నగరాలకు, పట్టణాలకు వలసబాట పడుతున్నారు.
నేటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాడు పాదయాత్రలో గీత కార్మికులను ఆలింగనం చేసుకొని, గీత వృత్తి రక్షణ కోసం, సంక్షేమ పథకాల గురించి హామీలు ఇచ్చారు. వైసిపి ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల కాలంలో గీత వృత్తి గురించి కాని, వృత్తి సంక్షేమం-సామాజిక భద్రత గురించి కాని ఆలోచించిన పాపాన పోలేదు. నవరత్నాలు, జగనన్న తోడు, వైఎస్‌ఆర్ బీమా లాంటి సంక్షేమ పథకాలలో కూడా గీత కార్మికులకు చోటు ఇవ్వలేదు. ఎంతో ఆశతో ఎదురుచూసిన గీత కార్మికులు నిరాశ, నిస్పృహకు గురయ్యారు. 2020 లాక్‌డౌన్ సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం 40 రోజులపాటు కల్లు గీయనివ్వలేదు. ఎక్సైజు డిపార్టుమెంటు వారు కొన్ని ప్రాంతాల్లో కల్లు గీత కార్మికులను స్టేషన్లకు లాక్కుపోయారు. మరికొన్ని చోట్ల తాటి చెట్లకు ఉన్న కల్లుకుండలను రాళ్ళతో బద్దలు కొట్టారు. తెనాలి ప్రాంతంలో ఇళ్లకు వచ్చి కల్లు తెచ్చుకొనే మోపెడ్లను ఎత్తుకుపోయారు. అక్రమ కేసులు బనాయించి, బైండోవర్ కేసులు పెట్టారు. 40 రోజులు వృత్తి లేక ఉపాధి పోయి ఆపదలో ఉన్న కల్లుగీత కుటుంబాలను ఈ ప్రభుత్వం ఏ విధంగాను ఆదుకోలేదు.
కల్లు గీచే పని పురుషులు చేస్తే అమ్మకంలో మహిళలు ఉంటున్నారు. వీరికి సభ్యత్వం లేనప్పటికి వృత్తిలో భాగస్వాములు అవుతున్నారు. వీరితోపాటు వృత్తి పరికరాలు తయారు చేసే కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చర్మకారులు ఆధారపడి జీవిస్తున్నారు. ఒకప్పుడు వృత్తే ప్రధాన జీవనాధారంగా ఉండేది. ఇప్పుడు మద్యం, శీతల పానీయలు, అక్రమ మద్యం ప్రవేశంతో కల్లుకు డిమాండ్ తగ్గి గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కోల్పోతున్న గీత కార్మిక కుటుంబాలను ఆదుకోవటంలేదు. సంక్షేమ పథకాలు లేవు. ఉపాధి మార్గాలు చూపడంలేదు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పింఛను మాత్రం ఇస్తున్నారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో వృత్తిలో ప్రమాదం జరిగి చనిపోయిన, వికలాంగులైన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కూడా ఇవ్వకుండా గాలికి వదిలేశారు. గీతన్నలకు ఉపాధి కలగాలంటే కల్లు గీత కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి, అవినీతికి తావు లేకుండా పని చేయించాలి. వృత్తికి బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటా యించి ప్రోత్సహించాలి. ప్రభుత్వ స్థలాల్లో హైబ్రిడ్ తాటి, ఈత, ఖర్జూర మొక్కలు వన సంరక్షణ సమితుల ద్వారా పెంచాలి. చెట్లకు రక్షణ కల్పించి, వృత్తిని ఆధునీకరించడం, కల్లుకు మార్కెట్టు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తే గీత కార్మికులు గుండెపై చేయి వేసుకుని నిద్ర పోతారు. ఆ దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని, నూతన పాలసీ ప్రకటించాలి.
- జుత్తిగ నరసింహమూర్తి,
సెల్ : 9490098047