ఇజ్రాయిల్ భూతల దాడులు ఉధృతం
మద్దతుగా అమెరికా యుద్ధ నౌకలు
కాల్పుల విరమణకు ఐరాసలో తీర్మానం
అడ్డుకున్న అమెరికా, బ్రిటన్
జెరూసలెం : అమెరికా, ఇతర పశ్చిమ దేశాల అండ చూసుకుని యూదు దురహంకార ఇజ్రాయిల్ పేట్రేగిపోతోంది. అటు వైమానిక దాడులు, ఇటు భూ తల దాడులతో గాజాలో పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్నది. కాల్పుల విరమణ ప్రకటించాలని రష్యా, చైనా, అరబ్ దేశాలు, ఐక్యరాజ్య సమితి పదే పదే చేసిన విజ్ఞప్తులను బేఖాతరుల చేస్తూ ఇజ్రాయిల్ తన యుద్ధ ట్యాంకులను ఉత్తర గాజాపైకి పంపింది. ఇజ్రాయిల్‌కు మద్దతుగా అమెరికా తన భారీ యుద్ధ విమాన వాహక నౌకలను మధ్య ధరాసముద్ర తీరంలో మోహరించింది.హమాస్‌కు మద్దతుగా ఇరాన్, సిరియా జోక్యం చేసుకుంటాయన్న నెపంతో పశ్చిమ దేశాలు తమ సైనిక పటాలాలను, యుద్ధ సామగ్రిని ఇజ్రాయిల్‌కు దన్నుగా నిలబెడుతున్నాయి. గురువారం తెల్లవారుజామున గాజాపై ఇజ్రాయిల్ సైన్యం భూతల దాడులు పెద్దయెత్తున ప్రారంభించింది. గాజా శివారులోని షిజయాపై ఇజ్రాయిల్ విమానాలు, శతఘ్నులు జరిపిన బాంబు దాడుల్లో పెద్దయెత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గత మూడు వారాలుగా గాజాలో కొనసాగుతున్న విధ్వంసకాండ, బాంబు దాడులతో జరుగుతున్న వినాశనం ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోంది. పలు ప్రాంతాలకు సంబంధించి యుద్దానికి ముందు, ఇటీవలి రోజుల్లో తీసిన ఫోటోలు చూస్తుంటే విధ్వంసం చాలా పెద్దయెత్తున ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇళ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు, ప్రార్థనా స్థలాలు అన్న విచక్షణ లేకుండా ఇజ్రాయిల్ యధేచ్ఛగా దాడులు చేస్తోంది. చివరికి ఐక్యరాజ్యసమితి, రెడ్ క్రాస్ సహాయక శిబిరాలను కూడా అవి విడిచిపెట్టడం లేదు. మరో వైపు మరోవైమరమమమమమ అమెరికా యుద్ధ విమానాలు తూర్పు సిరియాలోని లక్ష్యాలపై దాడులు చేశాయని పెంటగాన్ ప్రకటించింది. సిరియా, ఇరాన్‌లపై యుద్ధానికి అమెరికా సన్నాహాల్లో భాగమే ఈ దాడి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పశ్చిమాసియాలో ఇరాన్, సిరియాలపై యుద్ధానికి దిగడం ద్వారా రష్యా ,చైనాలకు హెచ్చరిక పంపాలన్నది అమెరికా పన్నాగం.
ఇజ్రాయిల్ విచక్షణారహితంగా సాగిస్తున్న దాడుల్లో ఇప్పటికే 7వేల మందికి పైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. గురువారం మరణించిన వారి పేర్లు, ఐడి నెంబర్లతో ఒక జాబితాను పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మృతి చెందిన వారిలో 2,900మంది మైనర్లు కాగా, 1500మందికి పైగా మహిళలు వున్నారు. గతంలో ఇజ్రాయిల్, హమాస్ మధ్య సాగిన ఘర్షణలు, యుద్ధాల్లో మరణించిన వారి కన్నా ఈసారి ఎక్కువమంది మరణించారు. ఇప్పటికే 10లక్షల మందికి పైగా తమ ఇళ్లను వీడి వెళ్లిపోయారు. వీరిలో కొంత మంది ఐరాస సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
భద్రతామండలిలో ప్రతిష్టంభన
ఇజ్రాయిల్, హమాస్ కాల్పుల విరమణ పాటించాలని బుధవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తెచ్చిన తీర్మానానికి అనుకూలంగా రష్యా, చైనా,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గాబన్ దేశాలు ఓటు వేశాయి. అమెరికా, బ్రిటన్ వ్యతిరేకించాయి. మండలిలోని మరో తొమ్మిది దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఇంధనం, ఆహారం, మందుల కొరతతో మానవతా సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన గాజాకు పౌర సరఫరాలు అందేలా చూసేందుకు కాల్పుల విరమణ పాటించాలని రష్యా, చైనా ఆ తీర్మానంలో నొక్కి చెప్పాయి. కాల్పుల విరమణకు బదులు దాడికి దాడికి మధ్య కొద్ది సేపు విరామం (పాజ్) ఇవ్వాలని అమెరికా, దాని మిత్ర దేశాలు అభిప్రాయపడ్డాయి. అవి దీనికి అనుగుణంగా ఒక తీర్మానాన్ని తెచ్చాయి. . అయితే ఆ తీర్మానంలో కాల్పుల విరమణ గురించి కానీ, ఇజ్రాయిల్ భూ ఆక్రమణ గురించి కానీ ఆ తీర్మానంలో ఎక్కడా ఒక్క ముక్క కూడా లేదు. ఇది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యా, చైనా దానిని వీటో చేశాయి. శాశ్వత కాల్పుల విరమణ తప్ప మరేదీ తమకు ఆమోదయోగ్యం కాదని అవి తేల్చి చెప్పాయి. ఈ రెండు తీర్మానాలు భద్రతామండలిలో తిరస్కరణకు గురవడంతో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు మండలికి ఎన్నికైన పది సభ్య దేశాలు కొత్త ఫార్ములాను రూపొందించే పనిలో ఉన్నాయి.