మూతపడుతున్న ఆస్పత్రులు, సేవల కేంద్రాలు
గాజా, జెరూసలేం : ఎంతగానో అవసరమైన ఇంధన నిల్వలు తరిగిపోతుండడంతో యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలోని ఆరోగ్యం, పారిశుధ్యం, నీరు, ఆహార సర్వీసులు దాదాపు 'బ్రేకింగ్ పాయింట్' కు చేరుకుంటున్నాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఇప్పటివరకు గాజా స్ట్రిప్‌కు 569 ట్రక్కుల సాయం వచ్చింది కానీ వాటిల్లో ఏ ఒక్క దాంట్లోనూ ఇంధనం లేదని ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయ ప్రతినిధి (ఒసిహెచ్‌ఎ) జేన్స్ లారెకె వ్యాఖ్యానించారు. ''మరిన్ని కార్యాలయాలు, సేవల కేంద్రాలు మూతపడుతున్నాయి. ప్రాణాలను కాపాడే మార్గాలు కూడా మూసుకుపోతున్నాయి.'' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి క్రిస్టినా లిండ్‌మేరర్ వ్యాఖ్యానించారు. గాజాలోకి ఇంధనాన్ని అనుమతించే విషయమై జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి వుందంటూ గత వారం ఐక్యరాజ్య సమితి ఎయిడ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ పేర్కొన్నారు. కానీ ఆ చర్చలు విఫలమైనట్లు కనిపిస్తోంది. గాజాను పూర్తిగా దిగ్బంధించాలన్న వ్యూహంలో భాగంగా ఇజ్రాయిల్ ఆ ప్రాంతంలోకి విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ఇంధనాన్ని ప్రవేశించకుండా దిగ్బంధించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా గాజాపై ఇజ్రాయిల్ భూ, వైమానిక, సముద్ర ఆంక్షలను అమలు చేస్తోంది.
దాడులతో బందీలను విడుదల చేయలేకపోతున్నాం
గాజాలో బందీలుగా వున్న 12మందిని విడుదల చేయడానికి తాము సిద్ధంగా వున్నప్పటికీ ఇజ్రాయిల్ వైమానిక, పదాతి దాడుల కారణంగా విడుదల చేయలేకపోతున్నామంటూ హమస్ సాయుధ విభాగం ఖ్వాసమ్ బ్రిగేడ్స్ తెలిపింది. ఈ మేరకు టెలిగ్రామ్ చానెల్‌లో పోస్టు పెట్టింది. 241మందిని బందీలుగా చేపట్టారని ఇజ్రాయిల్ పేర్కొంటోంది.
వారిలో ఇప్పటివరకు నలుగురిని విడుదల చేవారు. వారిలో ఇద్దరు ఇజ్రాయిలీలు కాగా మరో ఇద్దరు అమెరికన్లు.
బలయ్యేది పిల్లలే !
ప్రతి రోజూ గాజాలో సగటున 134మంది పిల్లలు యుద్ధానికి బలవుతున్నారు. ఇప్పటివరకు నెల రోజుల్లో 4,237మంది చిన్నారులు మృతి చెందారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల రోజుల్లో గాజాలో 10,328మంది పాలస్తీనియన్లు మరణించగా, ఇజ్రాయిల్‌లో 1400మందికి పైగా చనిపోయారు.
ఇజ్రాయిల్‌కు ఆయుధాలు తెస్తున్న నౌక దిగ్బంధం
ఆయుధాలు, ఇతర మిలటరీ పరికరాలను తీసుకుని ఇజ్రాయిల్‌కు వెళ్ళడానికి వాషింగ్టన్‌లోని ఒక ఓడరేవులో సిద్ధంగా వున్న నౌకను వందలాదిమంది అమెరికన్ ఆందోళనకారులు అడ్డగించారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని వారు డిమాండ్ చేశారు.