Oct 29,2023 10:09
  • ఇజ్రాయిల్‌ బాంబు దాడులతో విధ్వంసం
  • ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే
  • గాజాతో స్థంభించిన కమ్యూనికేషన్స్‌
  • సహాయక సంస్థలు, దేశాల ఆందోళన

లండన్‌/గాజా/జెరూసలేం : ఇజ్రాయిల్‌ అటు వైమానిక దాడులు, ఇటు భూతల దాడులను ముమ్మరంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో గాజా స్ట్రిప్‌ మండుతున్న అగ్ని గోళంగా కనిపిస్తోందని, ఎటుచూసినా మంటలు, పొగ కమ్మేశాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. అల్‌ జజీరా తదితర అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం గాజాలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. అక్కడ సేవలందిస్తున్న సహాయక సిబ్బందితో తమకు కమ్యూనికేషన్స్‌ పూర్తిగా నిలిచిపోయాయని బయట నుంచి సహాయ శిబిరాలకు సామగ్రి చేరవేస్తున్న పాలస్తీనా రెడ్‌ క్రెసెంట్‌ సొసైటీ వంటి అంతర్జాతీయ స్వచ్చంద సంస్థలు పేర్కొన్నాయి. ఇంటర్నెట్‌, ఫోన్‌ సర్వీసులు నిలిచిపోయాయి. గాజాలో వైమానిక దాడులను పెంచుతున్నామని ఇజ్రాయిల్‌ సైనిక ప్రతినిధి డేనియల్‌ హగరీ తెలిపారు. అలాగే క్షేత్రస్థాయిలో పదాదీ బలగాలను పెంచి భూతల దాడులను విస్తరింపజేస్తున్నామని వెల్లడించారు. గాజా సిటీలోని ప్రజలు దక్షిణం వైపు వెళ్లాల్సిందిగా హెచ్చరించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఇజ్రాయిల్‌ దాడుల్లో దాదాపు 7500 మంది వరకు చనిపోయారు. వీరిలో 3000 మంది పైగా చిన్నారులే. కాగా ఈ నెల 7 నుంచి ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడుల్లో 110 మంది వైద్యులు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వేలాది మంది పౌరులు, వందలాది మంది వైద్య, ఇతర సహాయక సిబ్బంది గాయపడినట్లు పేర్కొంది.
 

                                                                       లండన్‌లో నిరసనల వెల్లువ

గాజాలో కాల్పుల విరమణకు పిలుపివ్వడానికి బ్రిటన్‌ ప్రభుత్వం తిరస్కరించడంతో నిరసనగా బ్రిటీష్‌ విదేశాంగ కార్యాలయం ఎదురుగా వందలాది మంది ధర్నా చేశారు. కార్యాలయం ప్రవేశమార్గం అంతటా వందలాది బొమ్మలను పెట్టారు. అందులో ఒకో బొమ్మ దాడుల్లో మరణించిన ఒకో పాలస్తీనా చిన్నారిని గుర్తు చేస్తుందని వారు పేర్కొన్నారు. లండన్‌లో ప్రభుత్వ విభాగాల కార్యాలయాల గేట్లకు పిల్లలు టెడ్డీ బొమ్మలను వేలాడదీశారు. ఇజ్రాయిల్‌కు ఆయుధాల అమ్మకాలను ఆపాలని వారు బ్రిటన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లండన్‌లో ఇజ్రాయిల్‌ రాయబారి నివాసం వెలుపల కూడా విడిగా నిరసన ప్రదర్శన జరిగింది. వారం వారం జరుగుతున్న నిరసన కార్యాచరణలో భాగంగా లండన్‌లో ఆదివారం వేలాదిమందితో ప్రదర్శన జరగనుంది.
 

                                                     ఆక్రమణలను ఆపే ఉద్దేశ్యం ఇజ్రాయిల్‌కు లేదు : నవీ పిళ్ళై

అక్రమంగా 56ఏళ్ళుగా కొనసాగుతున్న ఆక్రమణలను కొనసాగించేందుకే గాజాపై ఇజ్రాయిల్‌ పదే పదే దాడులకు దిగుతోందని, ఆ ఆక్రమణను అంతమొందించే ఉద్దేశ్యమేమీ ఇజ్రాయిల్‌కు లేదని ఐక్యరాజ్య సమితి విచారణా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నవీ పిళ్ళై చెప్పారు. పాలస్తీనా ప్రాంత అక్రమ ఆక్రమణపై విచారణా కమిషన్‌ ఇంతకుముందే చర్చించింది. అక్టోబరు 7న దాడులు జరగడానికి ముందుగానే కమిషన్‌ నివేదికను విడుదల చేశారు.
గాజాలో అన్ని రకాల కమ్యూనికేషన్లను ఇజ్రాయిల్‌ నిలిపివేసింది. ఆ తర్వాత పదాతి దళ దాడులను విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఉత్తర గాజాలో దాడులు విస్తరించినట్లు ఇజ్రాయిల్‌ బలగాలు ప్రకటించాయి.
 

                                                                  వేలాదిమంది గాజా వర్కర్ల బంధీ

ఇజ్రాయిల్‌లో పనిచేయడానికి పర్మిట్లు వున్న పాలస్తీనియన్ల పర్మిట్లను రద్దు చేసి వారిని నిర్బంధ శిబిరాల్లో వుంచినట్లు తెలుస్తోందని మానవ హక్కుల గ్రూపులు తెలిపాయి. అయితే వారి విడుదలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడానికి ఇజ్రాయిల్‌ తిరస్కరించింది. యుద్ధం ప్రారంభమవడానికి ముందుగా వేలాదిమంది గాజా వర్కర్లు ఇజ్రాయిల్‌లో పనిచేస్తున్నారు. మూకుమ్మడి అరెస్టులు జరిగాయన్న ప్రచారం నేపథ్యంలో వారందరీ ఆచూకీ గల్లంతైంది.