Sep 09,2023 06:26

ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన దేశాల కూటమిగా వున్న జీ20 దేశాల సదస్సుకు నేడు, రేపు మన దేశ రాజధాని ఆతిథ్యం ఇవ్వనున్నది. ఇప్పటికే అనేక హంగులతో, భద్రతా చర్యలతో సకల ఏర్పాట్లు చేశారు. మెట్రో రైల్వేస్టేషన్ల వద్ద కఠిన నిబంధనలు, ప్రధాన వేదిక ప్రగతి మైదాన్‌ వద్ద లాక్‌డౌన్‌ను తలపించే ఆంక్షలతో ఢిల్లీ నగరం సిద్ధమైంది. జీ20 దేశాల కూటమికి ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యం వహిస్తున్నారు. ఈ బాధ్యత కాలపరిమితి త్వరలో ముగియనుండడం, విశ్వగురువుగా ప్రచారం చేసుకొని రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న బిజెపి తాపత్రయంతో పాటు మోడీ భజనలో తరిస్తున్న మీడియా కలిసి ఈ సమావేశాలను నభూతో నభవిష్యత్‌ అన్నట్టుగా మార్చేస్తున్నాయి. మోడీజీ కోసం జీ20 దేశాధినేతలు పోటీ పడుతున్నట్లు ప్రచార హోరు సాగుతున్నది. జీ20 ఏమిటి? అది ఎందుకు ఏర్పడింది? దాని లక్ష్యాలు ఏమిటి? ఆచరణ ఏమిటి? అనే విషయాలు మోడీ హోరులో కనిపించనంత దూరం వెళ్లిపోయాయి.

ఎన్నికల ప్రచారం కోసం

ఆర్‌ఎస్‌ఎస్‌ మార్గదర్శకత్వంలో నరేంద్ర మోడీ ఏది చేసినా సంచలనంగా వుండాలని కోరుకుంటారు. ప్రతి సంఘటనను భారీ ఈవెంట్‌గా మార్చి పెద్దఎత్తున ప్రచారం పొందాలని భావిస్తారు. అది నోట్ల రద్దు గాని, లాక్‌డౌన్‌ గాని, విదేశీ పర్యటనలు గాని, జీ20 సమావేశాలు గాని ఏదైనా ప్రచారహోరు సాగాలి, అందులో నుండి బలమైన నాయకుడిగా కీర్తించబడాలి, ఎన్నికల లబ్ధి పొందాలి. ఇది విధానం. అందులో భాగమే జీ20 సమావేశాల నిర్వహణ. ఈ జీ20 కూటమిలో ఐరోపా కూటమిని మినహాయిస్తే 19 దేశాలు వున్నాయి. ఈ దేశాలు వంతులవారీగా సమ్మిట్‌లు జరపాలి. అందుకోసం సభ్యదేశాలు ఐదు గ్రూపులుగా ఏర్పడ్డాయి. 2020 సమ్మిట్‌ మొదటి గ్రూపులోని సౌదీ అరేబియా నిర్వహించింది. రెండో గ్రూపులో మన దేశం వుంది. లెక్కప్రకారం మన దేశంలో ఈ సదస్సు 2021లో జరగాలి. అయితే నాల్గో గ్రూపులో వున్న ఇటలీ కోరిందని, అందుకు మన దేశం అంగీకరించినట్లు చెప్పుకుంది. ఆ తర్వాతి సంవత్సరం ఐదో గ్రూపులో వున్న ఇండోనేషియా జరిపింది. 2024లో దేశంలో జరిగే ఎన్నికల ప్రయోజనాలకు ఈ జీ20 సమావేశాలను ఉపయోగించుకో వాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ 2021, 2022 సంవత్సరాల్లో వచ్చిన అవకాశాలను వదులుకున్నారనే బలమైన విమర్శ వుంది. జీ20 సమావేశాలను 2024లో భారతదేశంలో జరగనున్న ఎన్నికల ప్రచారాంశంగా మార్చిందని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'గార్డియన్‌' విమర్శిం చింది. ఈ సమ్మిట్‌ 'లోగో' బిజెపి ఎన్నికల గుర్తు అయిన కమలం వుండడం, లోగో వెనుక బిజెపి జెండా కాషాయ రంగులో వుండడం ఇందులో భాగమే. జీ20 దేశాల అధినేతలకు భారత రాష్ట్రపతి భోజనానికి ఆహ్వానం పంపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని రాశారు.
ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులకు ప్రాతినిథ్యం వహిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక సహకార వేదిక జీ20. ఈ కూటమిలో మన దేశంతో పాటు అర్జెంటీనా, బ్రెజిల్‌, చైనా, జర్మనీ, ఇండోనేషియా, ఇండియా, జపాన్‌, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్‌, ఇటలీ, మెక్సికో, దక్షిణ కొరియా, రష్యా, టర్కీ, అమెరికా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, బ్రిటన్‌ దేశాలతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ భాగస్వాములు. ఈ కూటమికి శాశ్వత కార్యాలయం ఇప్పటి వరకు ఎక్కడా లేదు. అందువల్ల సారథ్యం వహించిన దేశం ఎజెండా ఖరారు చేయడంతో పాటు, శిఖరాగ్ర సదస్సు, మంత్రిత్వ శాఖలు, అధికారుల సదస్సులు దేశంలోని వివిధ పట్టణాల్లో ఈ సంవత్సర కాలంలో నిర్వహించాలి. అందుకు అవసరమయ్యే ఖర్చులు, రక్షణ చర్యలు ఆ దేశమే భరించాలి. ప్రస్తుతం మన దేశం 32 రంగాల్లో అనేక నగరాలు, పట్టణాల్లో ఇలాంటి సమావేశాలను సుమారు 200 వరకు నిర్వహిస్తుంది. మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఒక సమావేశం జరిగింది. బెంగళూరు సమావేశానికి వచ్చిన విదేశాంగ మంత్రులు, అధికారులు పనిలో పనిగా అనంతపురం లోని లేపాక్షి, సాయిబాబా సమాధి, బళ్ళారి జిల్లా లోని హంపీ క్షేత్రాలను దర్శించారు. ఇప్పుడు దేశాధినేతలతో శిఖరాగ్ర సదుస్సు ఢిల్లీలో జరుగుతుంది. అయితే ఈ సమావేశానికి రష్యా, చైనా దేశధినేతలు హాజరు కావడం లేదు. ఉక్రెయిన్‌ యుద్ధం గురించి ఎజెండాలో చేర్చినందున ఇండోనేషియా బాలిలో జరిగిన సమావే శానికి కూడా రష్యా అధ్యక్షుడు రాలేదు. అదే కారణంతో ఈ సంవత్సరం కూడా ఆయన హాజరు కావడం లేదు. చైనా అధ్యక్షుడు కూడా రాకపోవడంపై అనేక ఊహాగానాలు జరుగుతున్నాయి. మెక్సికో అధ్యక్షుడు రాకపై ఇంకా స్పష్టత లేదు.

జీ20 ఎందుకు ఏర్పడింది?

సోవియట్‌ యూనియన్‌లో సోషలిస్టు ఆర్థిక, రాజకీయ వ్యవస్థ కూలిపోవడంతో పెట్టుబడిదారీ వ్యవస్థకు తిరుగులేదని దాన్ని మరింతగా ముందుకు తీసుకు వెళ్లేందుకుగాను ప్రపంచీకరణ విధానాలను అన్ని దేశాల్లో వేగంగా అమలు చేయాలని ఒకవైపు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, డబ్లుటీవో లాంటి ఆర్థిక సంస్థలు మరోవైపు సామాజ్రవాద దేశాలు వివిధ రూపాల్లో ఒత్తిళ్ళు తెచ్చి అమలు చేయించాయి. ఈ ఆర్థిక విధానాలు సర్వరోగ నివారిణిగా ఆయా దేశాధినేతల చేత, మీడియా చేత ప్రచారం చేయించి ప్రజలను నమ్మించారు. కాని పెట్టుబడిదారీ వ్యవస్థ ఉత్పత్తి విధానంలోని ఉత్పత్తి, పంపిణీ, వినిమయం మధ్య ఏర్పడే అంతర్గత వైరుధ్యాల ఫలితంగా ఆర్థిక అసమానతలు మరింత పెరిగి కొనుగోళ్ళ సంక్షోభం మరింతగా తీవ్రమైంది. 1997-98కు పూర్వం ఆసియా దేశాలను పులులుగా చిత్రికరీంచిన సామ్రాజ్యవాద దేశాలు, ఆ తర్వాత ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణం అయ్యాయి. ఇదే కాలంలోనే ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ జీ20 ఏర్పడింది. ఒక రకంగా ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సమస్యల్లో కూరుకు పోయిన సందర్భంలో జీ20 కూటమి ఏర్పడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల భాగస్వామ్యం అవసరమని గుర్తించి 1999లో ఇప్పుడున్న జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్లు బెర్లిన్‌లో సమావేశం అయ్యారు. 2003 ఆగస్టు 20న జీ20 దేశాల కూటమి స్థాపించ బడింది. 'ద్రవ్య మార్కెట్లు-ప్రపంచ ఆర్థిక వ్యవస్థ' అనే నినాదంతో తొలి జీ20 సదస్సు 2008 నవంబర్‌లో అమెరికా లోని వాషింగ్టన్‌ డి.సి లో జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఒక దేశంలో జరిగే ఈ సమావేశాల్లో సభ్యదేశాలు అంగీకరించే అంశాలపై చివరి రోజు ఉమ్మడిగా ప్రకటన చేస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లో బయటకు కనిపించేది నాయక బృందం... కనిపించనిది ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, డబ్ల్యుటివో, ఐఎల్‌ఓ (అంతర్జాతీయ కార్మిక సంస్థ), ఎడిబి (ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు)ల ప్రతినిధులు. నాయకుల చేత పలికించేది, తెర చాటునుంచి నడిపేది వీరే. 1973లో వచ్చిన చమురు సంక్షోభం నివారణ పేరుతో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, ఇటలీ ఆ తర్వాత కెనడా దేశాలతో ఏర్పడిన జీ7 కూటమి సంక్షోభాలను పరిష్కరించకపోగా వాటిని మరింత తీవ్రం చేసింది. రోగమేదైనా మందు ఒక్కటే అన్నట్లుగా ఆసియా దేశాల్లో వచ్చిన సంక్షోభాలకు జీ20 కూటమి ఏర్పాటు పరిష్కారమని జీ7 దేశాలు సూచించాయి.

పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడడమే జీ20 లక్ష్యం

ప్రపంచ ఆర్థిక స్థిరత్వం- స్థిరమైన వృద్ధిని సాధించడానికి దాని సభ్యదేశాల మధ్య సమన్వయం, నష్టాలను తగ్గించే, భవిష్యత్‌లో ఆర్థిక సంక్షోభాలను నిరోధించే ఆర్థిక నిర్వహణను ప్రోత్సహించడం, కొత్త అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణాన్ని రూపొందించడం లక్ష్యాలుగా జీ20 ఏర్పడింది. గత ఇండోనేషియా సమావేశంలో ఆరోగ్యం, డిజిటల్‌ అక్షరాస్యత, వాతావరణ మార్పు, ఆహార భద్రత, గురించి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే వీటి అమలు ఎంతమేరకు జరిగిందనేది సందేహాస్పదమే. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన సమావేశాలలో ప్రచార పటాటోపం తప్ప ఫలితం శూన్యం గనక. 2021 సదస్సులో వాతావరణ పరిరక్షణ కోసం బొగ్గును విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా చేయరాదని నిర్ణయించారు. అయితే ఆ తార్వతి సంవత్సరాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కోసం బొగ్గు వాడకం మరింతగా పెరిగింది. 'పన్నుల విధాన' ప్రకటన కూడా ఇలాగే నిర్వీర్యం అయ్యింది. వాతావరణ కాలుష్యానికి కారణమైన సామ్రాజ్యవాద దేశాలు వాటిని నివారించడంలో అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి. పెట్టుబడిదారీ దేశాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఆర్థిక అసమానతలను మరింతగా పెంచి అందరికీ విద్య, వైద్యం, నివాసం లాంటి కనీస వసతులను దూరం చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో వుంది. అనేకమంది వేతన జీవులు ఉపాధి కోల్పోతున్నారు. కొత్త ఉద్యోగాలు తగ్గాయి. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడానికి కారణమవుతున్నది. ఉన్న కొద్దిపాటి కొనుగోళ్లను కొల్లగొట్టి లాభపడడానికి జీ7 దేశాల కూటమి అనేక రూపాల్లో ప్రయత్నిస్తుంది. ఈ పోటీ నుండి తమను తాము కాపాడుకోవడానికి అనేక దేశాలు ప్రాంతీయ ఆర్థిక కూటములుగా ఏర్పడుతున్నాయి. వ్యవస్థలో వున్న లోపాలను కూటములతో పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఆర్థిక సంక్షోభాలు మరింతగా తీవ్రమవుతూనే వున్నాయి

మోడీ అభివృద్ధి బూటకపు ప్రచారం

అబద్ధాల మీద నిర్మితమైన బిజెపి అన్ని విషయాల్లో అబద్ధాలను ప్రచారం చేసినట్లుగానే జీ20 దేశాల ముందు కూడా దేశాభివృద్ధి గురించి బూటకపు ప్రచారం చేసుకుంటున్నది. ప్రపంచంలోని అనేక సంస్థలు మన దేశ ఆకలి, దారిద్య్రం, అక్షరాస్యత, అసమానత, అసహనం, మత ఘర్షణల గురించి ఏకరువు పెడుతుంటే...ఢిల్లీ భారీ హోర్డింగుల్లో దేశాభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వం అబద్ధాలను ప్రచారం చేసుకుంటున్నది. జీ20 సదస్సులో పర్యావరణం, ఆర్థిక అసమానతల వంటి ప్రజా సమస్యలను చర్చించాలని కోరేందుకు ఢిల్లీ సూర్జిత్‌ భవన్‌లో సమావేశమైన 'వురు 20' మేధావుల గొంతులను పోలీసుల ద్వారా ఎలా అణచివేశారో చూశాం. మణిపూర్‌లో జరుగుతున్న తీవ్ర హింస నేపథ్యంలో 'వసుధైక కుటుంబం' నినాదంతో ఈ సమావేశాలు జరుగుతుండడం పాలకుల వైరుధ్య విధానాలకు నిదర్శనం. తన నినాదంగా, విధానంగా వున్న 'ఒకే' మాటను ఈ సదస్సుకు కూడా 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు'గా మార్చారు. మాటల గారడీ కొంత కాలం మరిపించగలదేమో కాని, ప్రజల బతుకులను మార్చలేదు. ఎన్నికల కోసం చేసే జిమ్మిక్కులు మరెంతో కాలం సాగవు.

ram

 

 

 

 

వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. రాంభూపాల్‌