Sep 13,2023 14:23

ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపలేకపోయింది
ప్రపంచనేతగా చెప్పుకునేందుకు మోడీ తాపత్రయం
సమస్యల పరిష్కారానికి నిర్ధిష్ట కార్యాచరణ కరువు
భారత్‌ ద్వారా వర్థమాన దేశాల కట్టడికి అమెరికా కుట్ర
ఎస్‌వికె వెబినార్‌లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌ అరుణ్‌కుమార్‌
ప్రజాశక్తిా హైదరాబాద్‌ బ్యూరో : 
 దేశ రాజధాని ఢిల్లీలో రూ.4,100 కోట్లు ఖర్చు చేసి అట్టహాసంగా నిర్వహించిన జి-20 సదస్సు ప్రచారార్భాటం తప్ప ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపలేకపోయిందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌.అరుణ్‌కుమార్‌ అన్నారు. ప్రపంచ స్థాయి నాయకుడిగా ప్రధాని మోడీ తనకు తానుగా చెప్పుకునేలా ఈ సదస్సు ఏర్పాట్లు, నిర్వహణ ఉందని పేర్కొన్నారు. సదస్సుకు ఆతిధ్యం ఇచ్చిన ఢిల్లీలో అడుగడుగునా మోడీ కనిపిస్తున్నారని, కానీ వాస్తవ పరిస్థితులను కనపడకుండా చేశారని విదేశీ మీడియాలో కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. 'జి-20 సమావేశం సాధించిందేమిటి?' అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో అరుణ్‌కుమార్‌ మాట్లాడారు. జి-20 సదస్సు ఉమ్మడి ప్రకటనపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సందర్భంలో ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన భారత ప్రధాని మోడీ తొలిరోజే దీన్ని ప్రకటించి సమావేశాన్ని నీరుగార్చారన్నారు. గతేడాది ఇండోనేషియాలో జరిగిన జి-20 సదస్సు డిక్లరేషన్‌కు భిన్నంగా ఈసారి ప్రకటన రావడం వెనక అమెరికా ఒత్తిడి ఉందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై తీసుకున్న వైఖరిని సౌదీ అరేబియా, కెనడా, నెదర్లాండ్‌, జపాన్‌, అనేక దేశాలు తప్పుబట్టాయని గుర్తు చేశారు. ఉక్రెయిన్‌ బలహీనపడుతోందని తెలిసి ఆ దేశానికి సహాయం చేస్తున్న దేశాల ప్రజల్లో కూడా అసహనం పెరుగుతోందని, అందుకనే ఆయా దేశాల్లో పద్ద ఎత్తున ప్రదర్శనలు జరుగుతున్నాయని వివరించారు. ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌ ఓటమిని అంగీకరిస్తే అమెరికా సామ్రాజ్యవాదానికి ముప్పు వాటిల్లుతుందని, అందులో నుంచి క్రమంగా బైటపడేందుకు ఆ దేశం అన్వేషిస్తోందని తెలిపారు. ఉక్రెయిన్‌ విషయంలో పశ్చిమ దేశాల వైఖరిలో కూడా మార్పు వస్తోందన్నారు.

రష్యా, చైనా దేశాల మిత్రత్వం బలంగా మారడంతోపాటు ఈ రెండు దేశాలకూ ప్రపంచ దేశాలు మద్దతుగా నిలబడడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోందని తెలిపారు. రష్యా యుద్ధం సాకుగా చూపి ఇతర దేశాలను తమవైపు తిప్పుకోవాలనుకున్న అమెరికా పన్నాగం పారలేదన్నారు. అమెరికాకు మద్దతిచ్చే దేశాల సంఖ్య తగ్గుతోందని తెలిపారు. చైనాను కట్టడి చేసేందుకు తీసుకున్న విధానాల పట్ల అమెరికాపై వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతోందని వివరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు అమెరికా నుంచి వేరుపడి రష్యా, చైనా వైపు వెళితే సామ్రాజ్యవాదానికి పెనుముప్పు వాటిల్లుతుందని భావించి... భారత్‌ను ముందుపెట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలను తమ ఆధీనంలో ఉంచుకోవాలని అమెరికా కుట్ర చేస్తోందని విమర్శించారు. అందుకే ఉక్రెయిన్‌ విషయంలో అమెరికా కాస్త వెనక్కి తగ్గిందన్నారు. రష్యా, చైనా దేశాలు ప్రధాన భాగస్వామిగా ఏర్పడిన బ్రిక్స్‌... ప్రధాన వాణిజ్య కూటమిగా అవతరించడం అమెరికాకు మింగుడుపడటం లేదని తెలిపారు. దీన్ని కట్టడి చేసేలా ఢిల్లీ డిక్లరేషన్‌లో కొన్ని మార్పులు చేశారన్నారు. జి-20 సదస్సు నిర్ణయాల అమలుకు ప్రత్యేక యంత్రాగం లేదని, కానీ, బ్రిక్స్‌ నిర్ణయాల అమలుకు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేశారని తెలిపారు. లైంగిక అసమానతలు తగ్గించాలి, అవినీతిని అరికట్టాలి, ప్రజారోగ్యం, మత విశ్వాసాలను కాపాడతాం, పర్యావరణ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలపై డిక్లరేషన్‌ చేశారు కానీ... వాటి అమలుకు ఫోరం లేకపోవడం ప్రధాన అవరోధంగా మారిందన్నారు.

జి-20 సదస్సులో పౌరసమాజాన్ని భాగస్వామ్యం చేసే సంప్రదాయాన్ని ఈసారి పాటించలేదని, కేవలం ప్రభుత్వాల మధ్య మాత్రమే చర్చలు జరిగాయని తెలిపారు. గతంలో నిర్దేశించిన మిలినియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌ సాధించలేదు కాబట్టి, దానిపేరు మార్చి సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌గా ఈసారి అజెండా రూపొందించారని వివరించారు. ప్రపంచంలో జరిగే వాణిజ్యంలో 75 శాతం వ్యాపారం జి-20 దేశాల్లో జరుగుతున్నందున ఈ సదస్సుకు ప్రాధాన్యత ఉందని తెలిపారు. వెబినార్‌ను ఎస్‌వికె మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినరుకుమార్‌ సమన్వయం చేశారు.