
భారత ప్రధాని మోడీ 2022 డిసెంబరు 1వ తేదీన జి-20 అధ్యక్ష స్థానాన్ని అధిష్టించారు. ఆయన సంవత్సరం పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఇప్పటి వరకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన ఇండోనేషియా నుండి ఆయన ఈ బాధ్యతను స్వీకరించారు. 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్న జి-20 కూటమిలో సంవత్సరానికి ఒక దేశం అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తుంది. సంస్థ నిబంధనల ప్రకారం తమ సమయం వచ్చినపుడు సభ్యులుగా ఉన్న 20 దేశాలలోని ప్రతి దేశమూ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తుంది. అది పెద్ద దేశమైనా, చిన్న దేశమైనా, ఆయా దేశాలలో సమర్ధులైన నాయకులు అధికారంలో ఉన్నారా లేదా అసమర్ధులు అధికారంలో ఉన్నారా అన్నదానితో నిమిత్తం లేకుండా ఆ దేశం సమయం వచ్చినపుడు అధ్యక్ష బాధ్యతలు చేపడుతుంది. ప్రస్తుతం భారతదేశం వంతు వచ్చింది. ఇపుడు భారత ప్రధానిగా మోడీకి బదులు మరెవరున్నా మన దేశం జి-20 కి అధ్యక్షత వహించేది. కాని మోడీ అధికారంలో ఉండటం వలననే భారతదేశానికి జి-20 అధ్యక్ష స్థానం దక్కిందని భక్తశిఖామణులు ప్రచారం చేస్తున్నారు. స్వయంగా మోడీయే అందుకు నాయకత్వం వహించి, ఇదేదో ప్రపంచ అద్భుతమైనట్లు ప్రచారం చేసుకొంటున్నారు. ''ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్'' అన్నది జి-20 ప్రధాన నినాదంగా ఉంటుందని ప్రచారం చేస్తున్నాడు. డిసెంబరు 5వ తేదీన మోడీ ఢిల్లీలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి, జి-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా దేశంలో 200 సభలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వాస్తవంగా ఆ సమావేశమే అనవసరం. కాని ఇదే అంశంపై 200 సభలు జరపటమంటే వాస్తవ సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్ళించటం కోసం జి-20 అధ్యక్ష స్థానాన్ని బిజెపి ఏ విధంగా వినియోగించుకోబోతున్నదో స్పష్టమౌతున్నది.
ప్రజల సమస్యలకు చోటే లేని జి-20
ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్న 20 దేశాలతో 1999లో జి-20 ఏర్పాటైంది. ఆనాడు ఆసియా దేశాలలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, దానిని పరిష్కరించటంలో జి-7 దేశాల అసమర్ధత, సంక్షోభ భారాన్ని భరించటంలో ఇతర దేశాలను కూడా భాగస్వాములను చేయాలనే వ్యూహంలో భాగంగా జి-7ను జి-20గా మార్చారు. ఇందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాలు ఉన్నాయి. ఇ.యు మొత్తం ఒకటిగా 20వ సభ్యునిగా ఉంది. శాశ్వత అతిథిగా స్పెయిన్‌ను ఆహ్వానిస్తున్నారు. 2008లో అమెరికాలో గృహ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి జి-20 అగ్ర నాయకుల సమావేశాలు జరగటం ప్రారంభమైంది. 2022లో ఇండోనేషియా లోని బాలిలో జి-20 దేశాల అగ్రనాయకుల చివరి సమావేశం జరిగింది. ఈ సమావేశాలలో అంతర్జాతీయ ఆర్థిక, ద్రవ్య స్థిరత్వం, ఆయా సభ్యదేశాలకు పరస్పర ప్రయోజనం ఉన్న ఇతర విషయాలను గురించి చర్చలు జరుగుతాయి. దీనికి శాశ్వత స్టాఫ్, ఆఫీసు లేవు. కాబట్టి హెడ్‌క్వార్టర్స్ సభ్యదేశాల మధ్య రొటేట్ అవుతుంది. నిర్ణయాలు ఏకాభిప్రాయంతో జరుగుతాయి. నిర్ణయాలను అమలుచేయటం అనేది ఆయా దేశాల రాజకీయ సంకల్పంపై ఆధారపడి వుంటుంది. అప్పటి పాలకులకు ఆ నిర్ణయాలతో ప్రయోజనం ఉందనుకుంటే అమలుచేస్తారు. లేదంటే పక్కన పెట్టేస్తారు.
జి-20 సభ్యదేశాలలో ప్రపంచ జనాభాలో 60 శాతం ఉన్నారు. 80 శాతం ప్రపంచ జి.డి.పికి, 75 శాతం ఎగుమతులకు ఈ దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మొత్తం సభ్యదేశాలు ఐదు గ్రూపులుగా ఏర్పడతాయి. ప్రతి గ్రూపులోనూ కనీసం నాలుగు దేశాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక గ్రూపు నుండి అధ్యక్షుని ఎన్నుకుంటారు. ఎన్నికైన అధ్యక్షుడు, గత అధ్యక్షుడు, రానున్న సంవత్సరం అధ్యక్ష స్థానం స్వీకరించేవారు, ఈ ముగ్గురూ కలిసి సెక్రటేరియట్‌గా వ్యవహరిస్తారు. 19 సభ్య దేశాలలో 11 దేశాలు ఇప్పటికి అధ్యక్షస్థానం అలంకరించాయి.
2019 ఎన్నికలలో వినియోగించుకోవటానికి మోడీ జి-20 అధ్యక్షస్థానం కోసం 2016 లోనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఫలించి ఉంటే 2018లో భారతదేశం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేది. 2024 ఎన్నికల కోసం ఇపుడు ఉపయోగించుకోవాలనుకుంటున్న అధ్యక్ష స్థానాన్ని ఆనాడు 2019 ఎన్నికలలో వినియోగించుకునే వారు. కాని ఆనాడు అర్జెంటీనా గట్టిగా పోటీ పడటంతో భారతదేశానికి అధ్యక్షస్థానం దక్కలేదు. భారతదేశం ఉన్న గ్రూపులో భారత్‌తో పాటు రష్యా, దక్షిణాఫ్రికా, టర్కీ ఉన్నాయి. టర్కీ, రష్యాలు ఇంతకు ముందే అధ్యక్ష బాధ్యతలు నిర్వహించి ఉన్నాయి. కనుక భారతదేశానికి మార్గం సుగమమైంది. వాస్తవం ఇది కాగా మోడీ చరిష్మాతోనే భారతదేశానికి జి-20 అధ్యక్ష స్థానం వచ్చినట్లు, దేశ ప్రతిష్ట ప్రపంచ స్థాయిలో విస్తరించినట్లు బాకాలూదుతున్నారు. వాస్తవంగా జి-20 విధానాల అమలులో మోడీ ప్రమేయం ఉండదు. అగ్రదేశాలే విధానాలను నిర్ణయిస్తాయి. హిజ్ మాస్టర్స్ వాయిస్ లాగా వాటిని చిలుక పలుకులు పలకటం మినహా ఆయన చేసేదేమీ ఉండదు. సామ్రాజ్యవాదులకు మన దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నవాడు, పారిశ్రామిక, వ్యవసా య, గనులు, వనాలు మొత్తాన్ని కట్టబెడుతున్నవాడు జి-20 ద్వారా ఉద్ధరిస్తానని చెబుతున్నాడు. ఏ విధంగా మోసం చేసినా ప్రజలు నోరు మెదపరనే ధీమాయే ఇందుకు కారణం కదా!
భారత ప్రజలకు ప్రయోజనమేమిటి?
జి-20లో ప్రపంచ దేశాల ఆర్థిక, ద్రవ్య సమస్యలను గురించి చర్చించటమే ప్రధానాంశంగా ఉంటున్నది. ఆ విధానాలకే ఆ సంస్థ పరిమితమైంది. భారతదేశం అధ్యక్ష స్థానంలో ఉన్నా ఆ విధానాలను అమలుచేయమని చెప్పటం మినహా మన దేశానికి, మన ప్రజలకు మేలు చేసే ఒక్క విషయాన్ని కూడా చర్చకు పెట్టి, నిర్ణయాలు చేయటానికి అవకాశం ఉండదు. దేశీయ సమస్యలతో సంబంధమే లేని అంశాలను తీసుకువచ్చి, ప్రజలలో పెద్ద ఎత్తున ప్రచారం చేయటానికి 175 నగరాలలో పైన పేర్కొన్న 200 సభలు జరపటానికి కార్యక్రమం రూపొందించారు. దేశ ప్రజలకు ఏం ప్రయోజనం జరుగుతుందా అని కాకుండా సాధారణంగా మారే జి-20 అధ్యక్ష స్థానాన్ని దేశ ప్రజలను మోసం చేయటానికి ఎంత బాగా వినియోగించుకుంటున్నారో వెల్లడౌతున్నది. మోడీ ఇచ్చిన నినాదాలు ''ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్'' కూడా సంఫ్‌ు పరివార్ కపటత్వానికి తగిన విధంగానే ఉన్నాయి. సామరస్యంతో జీవించే ప్రజల మధ్య కుల, మత విద్వేషాలను పెంచి పోషిస్తూ ఘర్షణలు, హత్యాకాండను ప్రోత్సహిస్తున్న మోడీ ఈ నినాదాలను ఇవ్వటం శాంతి కోరుతున్న వారిని పరిహసిస్తున్నట్లు ఉంది.
భారత్‌కు జి-20 అధ్యక్ష స్థానం రావటం వలన ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ట పెరిగినట్లు ప్రచారం చేస్తున్నారు. దీని వలన వీసమెత్తుకూడా భారత ప్రతిష్ట పెరగదు. కాని మోడీ ప్రధాని అయి, సంఫ్‌ు పరివార్ శక్తులు అధికారం చేజిక్కించుకున్న తరువాత అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట మంటగలుస్తున్నది. దేశంలో మైనారిటీలపై దాడులు, హత్యలు పెరిగాయి. దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయి. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న జె.ఎన్.టి.యు వంటి విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు. జర్నలిస్టులపై హత్యాకాండ, అరెస్టులు కొనసాగిస్తున్నారు. విధానపరంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారు. జమ్మూ-కాశ్మీర్‌కున్న 370, 35ఎ అధికరణాలను రద్దు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం అడుగంటుతున్నదని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచ ఆకలి సూచీ, స్వేచ్ఛ, మహిళల ఉపాధి, నేరాలు, దేశ ప్రజలపై ప్రభుత్వ గూఢచర్యం తదితరాలు అంతర్జాతీయంగా దేశం పరువును బజారుకీడ్చాయి. ఇటువంటి పరిస్థితులలో దేశం అట్టడుగుకు చేరుతున్న అంశాలను గురించి పట్టించుకోకుండా జి-20 అధ్యక్ష బాధ్యతలను గురించి గొప్పగా ప్రచారం చేయటం... ప్రజలపై, ప్రజాస్వామ్యంపై దాడులను మరింత తీవ్రం చేయటానికే.
ఎ. కోటిరెడ్డి