
- మత ఘర్షణలతో విషం చిమ్ముతున్న కేంద్రం
- విభజన హామీలు, పోలవరానికి ఏం చేశారో చెప్పండి?
- సిపిఎం అఖిల భారత నాయకులు విజూ కృష్ణన్
- మందసలో ప్రజా రక్షణభేరి యాత్ర ప్రారంభం
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి:రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపి విష సర్పంతో స్నేహం కోసం పాకులాడుతున్నాయని సిపిఎం అఖిల భారత నాయకులు విజూ కృష్ణన్ అన్నారు. బిజెపితో దోస్తీ ప్రమాదకరమని హెచ్చరించారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ అంటూ మత ఘర్షణలతో ప్రజల్లో విషం చిమ్ముతుందని తెలిపారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి... ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా మందసలో సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను గురువారం ఆయన ప్రారంభించారు. అలాగే అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ యాత్రలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కుర్చీల కోట్లాట తప్ప.. ప్రజాసమస్యలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు పట్టడం లేదని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ విమర్శించారు. అభివృద్ధి పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల కళ్లలో దుమ్ము కొడుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.
మందస, శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన బహిరంగ సభల్లో విజూ కృష్ణన్ ప్రసంగించారు. ఎం.ఎస్ స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం, అధికారంలోకొచ్చాక సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిందని చెప్పారు. బిజెపి పదేళ్ల కాలంలో రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయన్నారు. విభజన హామీలు అమలు చేయకుండా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ చెంబుడు మట్టి, నీళ్లు ఇచ్చి వెళ్లారన్నారు. పోలవరం నిర్వాసితులకు బిజెపి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేస్తున్నా వైసిపి, టిడిపి, జనసేన ఆ పార్టీనే కావాలనుకుంటున్నాయని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ మాట్లాడుతూ.. మందస ప్రాంతంలో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నెల్లూరు, కడప, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తులు తప్పుడు పత్రాలతో వందలాది ఎకరాల భూములను ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. మంత్రులు అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు గిరిజనులకు రక్షణ కల్పిస్తారా?, ఆక్రమణదారులకు కొమ్ము కాస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపితో అంటకాగే విషయంలో టిడిపి వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వల్లే ధరలు పెరుగుతున్నాయన్నారు. తమ హయాంలోనే అభివృద్ధి చేశామని వైసిపి, టిడిపి గొప్పలు చెప్పుకుంటున్నాయని, జిల్లా నుంచి మాత్రం గుజరాత్, ముంబై ప్రాంతాలకు ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారని ఇదేనా చేసిన అభివృద్ధి అని ప్రశ్నించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ.. అంబానీ, అదానీల ప్రయోజనాల కోసం తప్ప పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం లేదని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బిజెపి చెప్తోందని, తమకు మాత్రం రైతులు, కార్మికులు, కష్టజీవులే ట్రిపుల్ ఇంజిన్లు అని అన్నారు.
మా సమస్యలు పరిష్కారమయ్యేలా చూడరూ...
తమ సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలంటూ బస్సు యాత్ర బృందానికి రైతులు, గిరిజనులు, వ్యాపారులు, ఉపాధ్యాయులు, స్కీమ్‌వర్కర్లు వినతిపత్రాలు అందించారు. జీడి పిక్కలకు గిట్టుబాటు ధర దక్కలేదంటూ రైతులు అందించిన వినతిపత్రంపై విజూ కృష్ణన్ స్పందిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రి, వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని భరోసానిచ్చారు. తమ భూములు ఆక్రమణకు గురవుతున్నాయంటూ పలువురు గిరిజనులు అందించిన విన్నపంపై స్పందిస్తూ గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చే అంశానికి తమ వంతు మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రపతి, గిరిజనశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీనిచ్చారు. సిపిఎస్ రద్దు, పాఠశాలల విలీనం సమస్యలపై యుటిఎఫ్ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు, తమకు ఉద్యోగ భద్రత, పలుసమస్యలపై అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్యర్యాన అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు వినతిపత్రం అందించారు. సమస్యల పరిష్కారం కోసం తమవంతు కృషి చేస్తామని నాయకులు హామీనిచ్చారు.
అడుగడుగునా ఘన స్వాగతం
యాత్ర బృందానికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. తొలుత మందస ప్రాంతానికి చేరుకున్న బృందం వీరగున్నమ్మ స్థూపానికి నివాళులర్పించింది. మందస హైస్కూల్ నుంచి భారీ ప్రదర్శన చేపట్టారు. డప్పు కళాకారులు వాయిద్యాలతో స్వాగతం పలికారు. తప్పెట్లగుళ్లు ప్రదర్శించారు. శ్రీకాకుళం మండలం పెద్దపాడు సమీపంలోని జాతీయ రహదారి నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.వి నాగేశ్వరరావు, కె.ధనలక్ష్మి, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.