ప్రజాశక్తి-మామిడికుదురు : ఇటీవల వరద ప్రభావంతో నష్టపోయిన పంట నష్టాన్ని ఎమ్యునరేషన్ పూర్తి చేసి ఆ జాబితాను సచివాలయంలో బహిరంగ పరచాలని ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర బృందం డిమాండ్ చేసింది. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాల్లో శనివారం ఈ బృందం పర్యటించింది. సిపిఎం రాష్ట్ర నాయకులు ఎం.హరిబాబు, అండ్ర మాల్యాద్రి, దడాల సుబ్బారావు, మర్రాపు సూర్యనారాయణ, జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరావు తదితరులు బృందంలో ఉన్నారు. మామిడికుదురు మండలం అప్పనపల్లిలో రైతులతో మాట్లాడారు. జిల్లాలో 20 వేల ఎకరాల్లో సార్వా పంట, వరి, అరటి, కాయగూరలు, తమలపాకు తదితర పంటలు దెబ్బతిన్నాయని, వరి పంటకు ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. గతేడాది నష్టపరిహారాన్ని నేటికీ చెల్లించలేదని, ఈ ఏడాది దెబ్బతిన్న ఇళ్లకు కూడా నష్టపరిహారం, పక్కా గృహాలు ఇవ్వాలని, వరద బాధితులందరికీ 50 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి.దుర్గాప్రసాద్, పీతల రామచంద్రరావు, తాడి శ్రీరామ్మూర్తి, రాజశేఖర్ ఉన్నారు.










