ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం శ్రేణులు కదం తొక్కారు. ఆదోని పట్టణంలోని పాత బస్టాండ్ మైదానంలో బహిరంగ సభ అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. అనంతరం పాదయాత్రను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్, ఆర్‌సిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ రోడ్డులో వందలాదిమంది ఎరుపు సైనికులు కదం తొక్కడంతో ఆ ప్రాంతమంతా ఎరుపుమయమైంది. పాదయాత్రలో పాల్గొన్న సిపిఎం శ్రేణులు ఎర్ర టీ షర్టు ధరించి క్రమశిక్షణ పద్ధతిలో నిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఎర్రజెండా చేత భూని నినాదాలతో విధులన్నీ హౌరెత్తించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వైజిఆర్ సర్కిల్, తిక్క స్వామి దర్గా ఆర్ట్స్ కాలేజ్ మీదుగా ముందుకు సాగింది. ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్‌ఎఫ్‌ఐ టీం సభ్యులు పాదయాత్రలో పాల్గొన్న శ్రేణులకు స్వాగతం పలికారు.

- ఆకట్టుకున్న నత్యాలు
ఎర్రజెండా చేత పూని దండు కదులుతున్న పాదయాత్ర బందానికి ముందు ప్రజానాట్యమండలి సభ్యులు డప్పు వాయిస్తూ కేరింతలు వేస్తూ ముందుకు సాగారు. ఈ నేపథ్యంలోనే మహిళ కళాకారులు నత్యం చేసిన దశ్యాలు ఆకట్టుకున్నాయి. పాదయాత్ర బందానికి ముందు మహిళలు ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతుండడంతో స్థానికులు ఆసక్తిగా చూశారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం సిపిఎం నాయకులు చేపట్టిన పాదయాత్ర పట్ల సర్వత్ర చర్చ మొదలైంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, యువత ఉపాధి కోసం పరిశ్రమలు నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ ఈనెల ఏడో తేదీ వరకు విరామం లేకుండా పాదయాత్ర నిర్వహించి సమస్యలను కలెక్టర్ కు విన్నవిస్తామని సిపిఎం ఆదోని పట్టణ మండల కార్యదర్శులు లక్ష్మణ్, లింగన్న తెలిపారు.













