Oct 28,2022 22:49

బెంగళూరు : తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వేగంగా అడుగులేస్తున్నది. ఇందులో భాగంగా గగన్‌యాన్‌ మిషన్‌ను ఇప్పటికే చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కొన్ని టెస్ట్‌ ఫ్లైట్లను ఇస్రో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభించనున్నది. ఈ విషయాన్ని ఇస్రోకు చెందిన హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఆర్‌ ఉమామహేశ్వరన్‌ తెలిపారు. గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా భూమి తక్కువ కక్ష్యలోకి ముగ్గురు వ్యోమగాములతో కూడిన స్పేస్‌ ఫ్లైట్‌ను పంపటానికి ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్నది. దీంతో ఇది భారతీయ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర కానున్నది. వ్యోమగాములను కక్ష్యలోకి తీసుకెళ్లే క్రూ మాడ్యుల్‌ను పరీక్షించటం కోసం చిన్హూక్‌ హెలికాప్టర్‌, సీా17 గ్లోబ్‌మాస్టర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మోహరించటానికి ఇస్రో ప్రయత్నిస్తున్నదని ఉమామహేశ్వరన్‌ చెప్పారు. క్రూ మాడ్యుల్‌ పూర్తయ్యిందనీ, ఫాబ్రికేషన్‌ పని జరుగుతున్నదని ఆయన తెలిపారు. ఆరునెలల్లో క్రూ మాడ్యుల్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ మిషన్‌ కోసం షార్ట్‌లిస్ట్‌ అయిన నలుగురు రష్యాలో వారి శిక్షణ పూర్తి చేసుకున్నారనీ, తదుపరి ట్రైనింగ్‌ కోసం బెంగళూరుకు వెళ్తున్నారని ఆయన తెలిపారు. గగన్‌యాన్‌ మిషన్‌ను తొలుత 2022లో ప్రయోగించాలని భావించినప్పటికీ కరోనావైరస్‌ మహమ్మారి కారణంగా అది వాయిదా పడింది. అయితే, ఇది 2024 చివరలో కానీ, 2025 ప్రారంభంలో కానీ ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.