Apr 08,2023 11:50

ప్రజాశక్తి-రాంబిల్లి (అనకాపల్లి) : సెజ్‌ లో ఉన్న వసుధ ఫార్మా పరిశ్రమలో నిన్న ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన తిరుమల రాజు వెంకట సుబ్బరాజు కుటుంబానికి కోటి రూపాయల నగదు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.రాము డిమాండ్‌ చేశారు.

ఆర్‌.రాము మాట్లాడుతూ ... పరిశ్రమల్లో నిరంతరం ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలుపోతున్నా పరిశ్రమ యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించడం లేదన్నారు. పరిశ్రమలు, కార్మికుల భద్రతపై తనిఖీలు చేయవలసిన ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారుల హడావుడి తప్ప భద్రత ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిటు నిర్వహించి నివేదికలు బయటపెట్టాలని అన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్‌ చేస్తున్నదన్నారు.