Aug 08,2023 15:44
  • వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్‌

ప్రజాశక్తి - మైలవరం(ఎన్‌టిఆర్‌ జిల్లా) : మన భూములను కాపాడుకునేందుకు పోరాటాలు చేయవలసిన అవసరం ఉందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్‌ అన్నారు. దళితులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, భూ సమస్యల సాధనకు సంయుక్త కార్యాచరణ రూపొందించేందుకు భూ పోరాట నాయకులు సందిపాము పౌలు అధ్యక్షతన మంగళవారం స్థానిక గాంధీ గ్రంథాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి లేని పేదలందరికీ మిగులు భూములు పంచాలని పేదల దగ్గర ఉన్న భూములను కాజేసీ జీవోలను తెస్తున్నారన్నారు . దళితులు భూముల కోల్పోతే ప్రభుత్వమే తిరిగి ఆ భూమిని వాస్తవ లబ్ధిదారునికి, వారి వారసులకు అందజేయాలన్నారు. అసైన్డ్‌ చట్టం దళితుల భూములకు కవచ కుండలం లాంటిది దన్నారు. ఇలాంటి చట్టాన్ని మరింత బలోపేతం చేసి అమలు చేయాల్సింది పోయి భూస్వాముల ఒత్తిడికి తలొగ్గి చట్టం మార్చటం దళితులకు ద్రోహం చేయడమేనన్నారు. గ్రామ సచివాలయంలో ప్రభుత్వం అసైన్డ్‌ భూముల వివరాలు ప్రకటించాలని, ఎవరైనా పేదలు అనివార్య పరిస్థితిలో భూమిని అమ్మకం పెడితే ప్రభుత్వమే ఆ భూమిని కొనుగోలు చేసి భూమిలేని దళితులకు, పేదలకు ఇవ్వాలన్నారు. దౌర్జన్యంగా, అక్రమంగా అనుభవిస్తున్న వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అసైన్డ్మేంట్‌ చట్ట సవరణ అమలులోకి వస్తే రాష్ట్రంలో ఒక దళితుడి చేతిలో సారడు భూమి కూడా మిగలదని, కోనేరు రంగారావు కమిటీ ఇచ్చిన నివేదికను బయట పెట్టాలన్నారు. అనంతరం చట్ట సవరణ వ్యతిరేకిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్‌ 9 ప్రతులను తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్‌ సుధాకర్‌, రైతు సంఘం మండల కార్యదర్శి వజ్రాల వెంకటరెడ్డి , కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దూరు రవికిరణ్‌, భూ పోరాట నాయకులు యేసు, అబ్రహం, లాజరు, యోహాను, గురజాల రామారావు, ముత్తయ్య, కోట సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.