
గొప్ప గొప్ప వారందరూ గొప్ప పుస్తకాలు చదివినవారే...అంటారు. జాన్ రస్కిన్ 'అన్ టు దిస్ లాస్ట్' పుస్తకం గాంధీ, టాల్‌స్టారుల జీవితాన్ని ప్రభావితం చేసింది. ఈ పుస్తకం చదవక ముందు గాంధీ వేరు, చదివిన తర్వాత గాంధీ వేరు. 'ఈ పుస్తకంలోని భావాలు దీపంలా నాలో వెలుగుని ప్రసారం చేశాయి. సర్వోదయాన్ని నాకు బోధించాయి' అని గాంధీ తన ఆత్మకథలో రాసుకున్నారు. ప్లేటో రాసిన 'రిపబ్లిక్', అరిస్టాటిల్ రాసిన 'పాలిటిక్స్', కారల్‌మార్క్స్ 'కాపిటల్' ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గ్రంథాలు. డార్విన్ 'ఆరిజన్ ఆఫ్ స్పీసిస్' ప్రకృతి శాస్త్రంలో, మనిషి ఆలోచనా ధోరణిలో విప్లవం తెచ్చింది. 'వసుచరిత్ర' పుస్తకమంటే తనకు ప్రాణమంటారు కందుకూరి వీరేశలింగం. 'పుస్తకాలు మహా మనుషుల మస్తకాలు' అంటాడు కొడవటిగంటి తన 'చదువు' నవలలో. యువల్ నోవా హరారీ అనే ఇజ్రాయిల్ చరిత్రకారుడు రాసిన ప్రముఖ గ్రంథం 'సెపియన్స్ (మానవులు)'. మానవ జాతుల గురించి వివరించే ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు చదివారు. చదవాల్సిందిగా సూచించారు. మేధావుల ఆలోచనలకు మనకున్న సాక్షి పుస్తకం. మానవ జీవన సాంస్కృతిక పరిణామ క్రమంలో పుస్తకాలు పోషించే పాత్ర అనిర్వచనీయం. 'ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత అదృష్టవంతులు ఎవరైనా వున్నారంటే... పుస్తక పఠనం ద్వారా సంపూర్ణ ఆనందాన్ని పొందినవారే' అంటాడో తెలుగు నవలా రచయిత. పుస్తకం అంటే... కాగితాల దొంతరలు కాదు... మనిషిని మరో లోకంలోకి తీసుకెళ్లే శాటిలైట్. మనిషికి ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్నిచ్చేది... మహనీయుల భావజాలాన్ని, వారి వ్యక్తిత్వాన్ని మన కళ్ల ముందు ఆవిష్కృతం చేసేది పుస్తకమే. సాంకేతికంగా ఎంత అభివృద్ధి జరిగినా, ఎన్నటికీ మారనిది పుస్తకం.
టీవీ సీరియళ్లు, ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మొబైల్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటివి విలువైన సమయాన్ని హరించివేస్తున్నాయి. పుస్తక పఠనానికి దూరం చేస్తున్నాయి. 'ఇమ్ముగ చదువని నోరు.. కుమ్మరి మన్ను తవ్వినట్టి గుంటర సుమతీ' అంటాడు బద్దెన. పుస్తక పఠనం, సమాజ అధ్యయనం.. ఈ రెండింటి మేలుకలయిక వల్ల ఎందరో సామాన్యులు అసామాన్యులుగా చరిత్రకెక్కారు. సాంకేతికత పెరిగిన ఈ కాలంలో కూడా పుస్తకం తన ప్రాధాన్యతను నిలుపుకుంటూనే వుంది. 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో... కానీ, ఓ మంచి పుస్తకం కొనుక్కో' అంటారు కందుకూరి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే... ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు విజయవాడలో పుస్తకాల పండుగ. ఈ పండుగ ఎక్కడ జరిగినా పుస్తక ప్రేమికులకు పసందైన విందే. ఆదియుగమైనా, ఆధునిక యుగమైనా జ్ఞాన సముపార్జనకు పుస్తక పఠనం ముఖ్య సాధనం. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. చాంధస, మూఢ విశ్వాసాల సంకెళ్ల నుంచి విముక్తి కలిగిస్తుంది. పుస్తక పఠనం జ్ఞాపకశక్తిని, పద సంపత్తిని పెంచుతుంది. 'కదిలేది కదిలించేది/ మారేది మార్పించేది/ పాడేది పాడించేది/ మునుముందుకు సాగించేది/ పెనునిద్దర వదిలించేది/ పరిపూర్ణపు బ్రతుకిచ్చేది' పుస్తకమే.
తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించే విద్యకు... ఆన్‌లైన్ విద్య ఎలాగైతే ప్రత్యామ్నాయం కాజాలదో, అలాగే, ఏ సాంకేతికతా పుస్తకానికి ప్రత్యామ్నాయం కాలేదు. పెరిగిన సాంకేతికత వల్ల ఆన్‌లైన్‌లో కొన్ని అరుదైన పుస్తకాలు దొరకొచ్చు. ఇతర దేశాల్లోని సాహిత్యాన్ని అధ్యయనం చేసే అవకాశం వుండొచ్చు. కానీ, అందుబాటులో వున్న పుస్తకాన్ని కొనుక్కుని చదువుకోవడం, భద్రపర్చుకుని తర్వాతి తరానికి అందించడం అనే ప్రవాహానికి మిగతావేవీ ప్రత్యామ్నాయం కాదు. లండన్‌కి చెందిన ఆన్ మోర్గాన్ అనే పాత్రికేయురాలి బుక్‌షెల్ఫ్‌లో సుమారు 20 ఏళ్ల గొప్ప కలెక్షన్ వుంది. అవన్నీ ఇంగ్లీష్, నార్త్ అమెరికన్ పుస్తకాలే. ఇన్నేళ్లలో ఒక్క విదేశీ పుస్తకమైనా చదవలేకపోయానే అనుకుంది. ఐరాస గుర్తింపు పొందిన 193 దేశాలకు చెందిన ఒక్క పుస్తకమైనా చదవాలని, అది కూడా ఒక్క ఏడాదిలోనే చదవాలని సంకల్పించుకుంది. అలాంటి ఒక ఉక్కు సంకల్పం వుండాలి. జీవితాన్ని ఉత్సాహంగా గడపాలంటే... ఇంట్లో పుస్తకాలుండాలి. 'కొన్ని పుస్తకాలు రుచి చూడాలి. కొన్నింటిని మింగేయాలి. మరికొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి' అంటాడు ప్రముఖ రచయిత బేకన్. పుస్తకాలు చదవడం అలవాటుగా మారాలి. ఈ పుస్తక పండుగను సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలకూ అలవాటు చెయ్యాలి. సమాజంలోని అనేక రుగ్మతలకు ఇదే సరైన ఔషధం.