Aug 11,2022 06:10

స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలో గ్రంథాలయాలు అతి తక్కువగా ఉండేవి. అవి సంపన్నులకే ఉపయోగపడేవి. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గ్రంథాలయ ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన అయ్యంకి వెంకట రమణయ్య తర్వాత...ఆ స్థాయిలో కృషి చేసిన వ్యక్తి ఎస్‌.ఆర్‌. రంగనాధన్‌. ఆయన గ్రంథాలయ శాస్త్రానికి ఒక గుర్తింపు, రూపురేఖలు తీసుకొచ్చారు.
ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈ సమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే పౌర గ్రంథాలయాలకు రూపకల్పన చేశారు.
1931వ సంవత్సరంలో రంగనాథన్‌ ప్రవేశ వెట్టిన 1. అధ్యయనం కోసం పుస్తకాలు 2. ప్రతి చదువరికి ఒక పుస్తకం 3. ప్రతి పుస్తకానికి ఒక చదువరి 4. చదువరి సమయం ఆదా చేయడం 5. గ్రంథాలయం నిత్యం అభివృద్ధి చెందుతున్న సజీవ వ్యవస్థ...అనే ఐదు సూత్రాలు గ్రంథాలయ శాస్త్ర రూపురేఖలను మార్చివేశాయి. ఈ నూతన సంస్కరణల వలన భారత దేశ గ్రంథాలయ వ్యవస్థ ప్రపంచ గ్రంథాలయ శాస్త్రంలో నూతన అధ్యయనాన్ని లిఖించింది.
మద్రాసు లైబ్రరీ అసోషియేషన్‌ను 1928లో స్థాపించారాయన. 1929లో మద్రాసు యూనివర్సిటీలో మొట్ట మొదటిసారి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌ను ప్రారంభించిన భారతదేశ ప్రప్రథమ గ్రంథాలయ శాస్త్ర ఉపాధ్యాయులు రంగనాథన్‌. అన్ని రాష్ట్రాలలో గ్రంథాలయ చట్టాల కోసం ప్రణాళికను రూపొందించారు. వారి కృషి ఫలితంగానే చాలా రాష్ట్రాలలో గ్రంథాలయాలు ప్రారంభించబడి గ్రంథాలయ చట్టాలు అమలులోకి వచ్చాయి. గ్రంథాలయ వ్యవస్థకు సంబంధించిన ప్రపంచవ్యాప్త ధోరణులను పరిశీలించి, విశేష అనుభవం గడించి, గ్రంథాలయ కేటలాగుల్ని తయారు చేయడానికి ఒక కొత్త కోడ్‌ను 1933లో రూపొందించారు. కోలన్‌ క్లాసిఫికేషన్‌ అని పిలిచే ఈ వర్గీకరణ సూత్రాన్ని దేశంలోని చాలా గ్రంథాలయాలు అనుసరిస్తున్నాయి.
రంగనాథన్‌ బ్రిటన్‌లో ఉన్నపుడు అక్కడి గ్రంథాలయాల చట్టాలను అధ్యయనం చేసి, గ్రంథాలయాల పని తీరు, లోతుపాతులను తెలుసుకుని...అలాంటి చట్టాలు భారతదేశంలో అత్యవసరమని భావించి, అవిభక్త మద్రాసు రాష్ట్రంలో 1948లో గ్రంథాలయ చట్టం రావడానికి కారకులయ్యారు. దీని ఆధారంగానే 1955లో హైదరాబాద్‌ నగర పౌర గ్రంథాలయ చట్టం, అనంతరం 1960లో ఆంధ్రప్రదేశ్‌ పౌరగ్రంథాలయ చట్టం రూపొందాయి. ఈ కృషి ఫలితంగానే నేడు రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాలు, జిల్లా గ్రంథాలయాలు, శాఖా గ్రంథాలయాలు, మండల స్థాయి గ్రంథాలయాలు ఏర్పడి చక్కగా పనిచేస్తున్నాయి.
రంగనాథన్‌ 1947 నుంచి 1954 వరకూ ఢిల్లీ యూనివర్సిటీ లోని గ్రంథాలయ శాస్త్ర విభాగానికి అధిపతిగా కొనసాగుతూ, 1952లో ఇండియన్‌ నేషనల్‌ సైంటిఫిక్‌ డాక్యుమెంటేషన్‌ కేంద్రాన్ని స్థాపించారు. 1962లో డాక్యుమెంటేషన్‌ రీసెర్చి అండ్‌ ట్రైనింగ్‌ కేంద్రాన్ని బెంగుళూరులో స్థాపించారు. 1953-56, 1959-61 సంవత్సరాలలో వీరు అంతర్జాతీయ డాక్యుమెంటేషన్‌ సంఘానికి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. బ్రిటిష్‌ గ్రంథాలయ సంఘానికి గౌరవ ఉపాధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. వీరి కృషి ఫలితంగానే నేడు స్థానిక సంస్థల నుంచి విశ్వవిద్యాలయాల వరకూ గ్రంథాలయ సమాచార శాస్త్రంలో సర్టిఫికెట్‌, డిప్లొమా, బ్యాచులర్‌, మాస్టర్‌, డిగ్రీలు అందుబాటులోకి వచ్చాయి. వారు చేసిన సేవలు, ఆవిష్కరణలను గుర్తించి భారత ప్రభుత్వం 'భారతదేశ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు'గా ఆయనను గుర్తించింది. ఆగస్టు 12, 1892లో జన్మించిన షియాలి రామామృత రంగనాథన్‌ 1972 సెప్టెంబర్‌ 27న మరణించారు. వారి పుట్టిన రోజునే 'జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం'గా దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. వీరి ఆశయాలను నెరవేర్చడమంటే...మనం గ్రంథాలయోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడమే.


- ఎస్‌.పి. మనోహర్‌ కుమార్‌