
మనిషికి స్వేచ్ఛ ముఖ్యమా? ప్రాణం ముఖ్యమా?
స్వేచ్ఛ లేకుండా మనిషికి ప్రాణమున్నా ఆ జీవితం ఎంత నరకప్రాయమో అది అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది.
నిజం చెప్పాలంటే పుట్టిన ప్రతి మనిషికి ఈ పుడమిపై జీవించేందుకు అపరిమితమైన స్వేచ్ఛ లభించాలి. కానీ కొందరికి అది లభించదు. నిర్బంధంలో ఉన్నవారికి మాత్రమే స్వేచ్ఛ విలువ తెలుస్తుంది. స్వేచ్ఛ కోసం నేను నా ప్రాణ త్యాగానికైనా వెనుకాడను అంటాడు పాపిలాన్.
చేయని నేరానికి ఎన్నో ఏళ్లుగా పాపిలాన్ జైల్లో మగ్గుతాడు. అపరాధిగా ఒంటరి ఖైదు జీవితాన్ని అనుభవిస్తాడు. యవ్వనం అంతా కరిగిపోతుంది. అయినా ఎన్నోసార్లు నిర్బంధాన్ని తప్పించుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చాలని తపిస్తాడు. కటిక చీకటి గది నుండి ప్రతి క్షణం ఓ చిన్న వెలుగు కిరణం చూడాలని ఆశపడతాడు. పారిపోయిన ప్రతిసారీ మరల మరల పోలీసు అధికారుల చేజిక్కి తిరిగి కారాగారానికే చేరతాడు.మనిషిని మనిషిగా బతకనీయని వ్యవస్థ లేదా ప్రభుత్వం ఏదైనాగాని అది నాగరికమైనది కాదని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తాడు (ఫ్రెంచి భాషలో పాపిలాన్ స్వీయ చరిత్ర ఆధారంగా హెన్రీ చరియర్ రాసిన నవల. ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. సినిమాగా కూడా వచ్చింది.).
రాజ్యము - నేరము చెట్టపట్టాల్ వేసుకుని తిరిగే వేళ ప్రజాస్వామ్య పక్షి రెక్కలు తెగి గిలగిలా కొట్టుకుంటుంది. పౌర హక్కులు గల్లంతు అవుతాయి. సత్యం, స్వేచ్ఛ, శాంతి సమాధులవుతాయి. ఇది చారిత్రక అనుభవం.
ప్రస్తుతం మనం ఇలాంటి ఫాసిస్టు దశకు చేరుకున్నామనేది పలువురి రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. మంత్రులు, శాసనకర్తల్లో అత్యధిక భాగం నేర ప్రపంచంలో ఉంటూ నేరస్తులుగా కేసులు నమోదైన విషయం తెలిసిందే.
2002 గుజరాత్ నరమేధంలో ఇప్పటి ప్రధాని, అప్పటి ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీని బిబిసి డాక్యుమెంటరీ చిత్రం ఇటీవల మరలా ముద్దాయిగా బోనులో నిలబెట్టడం జగద్విదితం.
బిల్కిస్ బానో వంటి బాధితులు, తీస్తా సెతల్వాద్ వంటి పాత్రికేయులు, సంజరు భట్ వంటి అధికారులు సత్యం కోసం జీవితాలను, ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్నారు. మరో పక్క కరడుగట్టిన నేరస్థులు, హంతకులు రాజ్యం అండతో బోర విరుచుని యథేచ్ఛగా తిరుగుతున్నారు. రైతాంగ ఉద్యమంలో రైతులను వాహనాలతో తొక్కించి ప్రాణాలు తీసిన తీరు (లఖింపూర్ ఘటన) యావత్ జాతినే నివ్వెరపరచింది. ఏళ్లు గడుస్తున్నా గౌరీ లంకేష్ హంతకులు ఎవరైందీ బయటపడదు. ఇదంతా నాణేనికి ఒక వైపే.
మరో వైపు...నేరం జరిగినా, జరగకపోయినా, నేరం జరగవచ్చుననే ఉద్దేశ్యంతో ముందుగానే ఆ వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకునే పి.డి. చట్టం (ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్) విచ్చలవిడిగా అమలవుతున్నది. రాజద్రోహం చట్టం మాదిరి ఇది కూడా బ్రిటిష్ వలస పాలనలో నుండే పుట్టుకు వచ్చింది. ఫాసిస్టు ప్రమాదం పడగ విప్పినప్పుడల్లా ఇలాంటి చట్టాలు పౌరుల స్వేచ్ఛ హక్కులను కబళిస్తూ ఉంటాయి. పౌరులందరూ వాక్ సభా స్వాతంత్య్రాలు, అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ, యూనియన్‌లు, సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ, దేశంలో ఎవరైనా ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పరుచుకునే స్వేచ్ఛ కలిగి ఉండటం ఓ ప్రాథమిక హక్కుగా మన భారత రాజ్యాంగం పూచీ పడుతున్నది.
ఒక నాగరిక ప్రపంచ దేశంలో నేరస్థులను చట్టబద్దంగా మాత్రమే శిక్షించాలి. హద్దుల్లేని నిరంకుశాధికారాన్ని చలాయించడానికి పాలకులు సిద్ధమైనప్పుడు పౌరస్వేచ్ఛకు దిక్కేది? అలాంటప్పుడు పి.డి చట్టం ఫాసిస్టు పాలకులకు అద్భుత వరంగా పరిణమిస్తుంది.
దాదాపు 200 ఏళ్ల క్రితం బ్రిటిష్ దొరలు, తమపై ధిక్కారం చూపే ప్రజలను లొంగదీసుకోవాలనే తలంపుతో ఈ దుష్ట చట్టానికి తెరలు తీశారు. ఆ తర్వాత 1930ల్లో దీనిని బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వం మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్షియాలకు ఓ చట్టబద్ద పాలనా చర్యగా విస్తరించింది.
స్వాతంత్య్రోద్యమంలో పెల్లుబికిన భారతీయుల స్వేచ్ఛా స్వాంత్య్ర కాంక్షను ఈ చట్టం ఇనుప బూట్ల కింద నలిపేందుకు సిద్ధమైంది. మరి అలాంటి నల్లచట్టాలు (రాజద్రోహం, పి.డి. చట్టం మొదలైనవి) స్వతంత్ర భారతావనిలో కొనసాగించవలసిన అవసరం ఏముంది? అనే ప్రశ్న ఇప్పటికీ సర్వత్రా వెల్లడవుతున్నది.
ఇలాంటి కరకు చట్టాలు ద్వారానే అనేక రైతాంగ ఉద్యమాలను, కార్మిక-ప్రజా ఉద్యమాలను కర్కశంగా అణచివేసిన విషయం తెలసిందే. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం సాగిన సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటమే ఇందుకు అతి పెద్ద నిదర్శనం.
మరిప్పుడు నల్లధనం విచ్చలవిడిగా పోగేసుకుంటూ, డ్రగ్స్, అక్రమ రవాణా మాఫియా, అత్యాచారం, హత్యల నేరాలతో సమాంతర చీకటి రాజ్యాలను ఏర్పరుచుకుంటున్న గ్యాంగ్‌స్టర్స్ జోలికి మాత్రం ఈ చట్టాలు పోవు. నిరుపయోగంగా, నిస్సారంగా, చేష్టలుడిగి నిర్జీవంగా వేలాడుతుంటాయి. ఇంకా చెప్పాలంటే సలాం కొడుతుంటాయి. అదే సందర్భంలో ప్రజా ఉద్యమ నేతలను, అమాయకపు ప్రజలను నిర్భందించి బలి తీసుకోవడంలో ముందుంటాయి.
పైకి ఎన్ని మాటలైనా తియ్యంగా పలుకవచ్చు. రాజ్యాంగం అన్నా, పౌరహక్కులన్నా గౌరవం లేనివారే ఇలాంటి దుర్మార్గానికి వడిగడతారు. రాజ్యాంగ బద్దంగా పనిచేయడానికి ముందుకు రారు. అప్పుడే ఫాసిస్టు ప్రమాదం పడగవిప్పి బుసకొడుతుంది.
స్వతంత్ర భారతదేశంలో తొలుత ఈ పి.డి.చట్టం అమలులోకి వచ్చినప్పుడు, అంటే 1950లో ఈ చట్టం కింద నిర్బంధించినవారు పదకొండు వేల మంది. 2017 వచ్చేసరికి ఆ సంఖ్య 67 వేల మందికి చేరింది. 2019లో అది ఒక లక్షా ఆరు వేల మందికి ఎగబాకింది. ఇప్పుడు లక్షా పది వేలకు దాటింది.
ఈ పి.డి చట్టం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో రకరకాలుగా రూపాంతరం చెందుతూ అమలవుతూ వస్తున్నది. రాష్ట్ర, జిల్లాస్థాయి అధికార్లు ముందస్తు నిర్బంధ ఆదేశాలను జారీచేయవచ్చు. కనుకనే పాలకులు తమకు ఇష్టమొచ్చిన రీతిలో వీటిని అమలు పరుస్తున్నారు. ఈ పి.డి చట్టాలకు సంబంధించిన సంపూర్ణ వివరాలు తమ వద్ద లేవనే విషయాన్ని ఇటీవల కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది.
ఏ చట్టం కింద ఎంతమంది అరెస్టు అయ్యారని కేంద్రం పార్లమెంటుకు చెప్పకపోవడం దేనికి నిదర్శనం? నిరపరాధులు ఏళ్ల తరబడి జైళ్ళలో మగ్గడం ఏ ప్రజాస్వామ్యానికి సంకేతం?
చిత్రహింసలు పెట్టడం, తప్పుడు సాక్ష్యాలను సృష్టించడానికే పోలీసు వ్యవస్థను దిగజార్చడం మరో దారుణం. దర్యాప్తులు సక్రమంగా చేయక, ఎఫ్‌ఐఆర్‌లు సరైన పద్ధతుల్లో దాఖలు చేయకుండా ఉండే సందర్భాలు అనేకం. అలాంటప్పుడు ఈ పి.డి.యాక్టులు పాలకులకు వరం. నిరపరాధులకు నరకం.
కనుకనే నిరంకుశ పాలకులు ఇలాంటి చట్టాలను తమకు అనుకూలంగా సృష్టించుకుని తమకు తాముగానే వాటిని ఎర్రతివాచీలుగా పరుచుకుంటారని పౌరహక్కుల ఉద్యమం విమర్శిస్తుంది. ఇక్కడ ఎర్రతివాచీ అంటే స్వేచ్ఛను హరించే రక్తపాలనగా కవులు వర్ణించడంలో తప్పేముంది?
వ్యాసకర్త కె. శాంతారావు సెల్:9959745723/