Mar 15,2023 12:09
  • నాసిక్‌ నుంచి ముంబయికి మార్చ్‌ :
  • నేడు రైతు ప్రతినిధులతో 'మహా' సర్కారు సమావేశం

ముంబయి : మహారాష్ట్రలో రైతులు, గిరిజనులు కదం తొక్కారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉత్తర మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా నుంచి రాష్ట్ర రాజధాని ముంబయి వరకు మార్చ్‌ను ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో వేలాది మంది రైతులు, గిరిజనులు పాల్గొన్నారు. డిమాండ్ల సాధన కోసం నినాదాలు వినిపించారు. ఉల్లి రైతులకు క్వింటాల్‌కు రూ.600 తక్షణ ఆర్థిక సాయం, 12 గంటల నిరంతరాయ విద్యుత్‌ సరఫరా, రైతు రుణ మాఫీ వంటి డిమాండ్లు ఇందులో ఉన్నాయి. పత్తి, సోమాబీన్‌ ధరల పడిపోవడంపై చర్యలు తీసుకోవాలనీ, ఇటీవల అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి. సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. నాసిక్‌ జిల్లాలోని దిండోరి నుంచి ఈ మార్చ్‌ ప్రారంభమైంది. 200 కిలోమీటర్ల దూరాన్ని ఈ ర్యాలీ కవర్‌ చేసి ముంబయికి చేరుకుంటుంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం ఎమ్మెల్యే వినోద్‌ నికోలే రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, నిరసన చేస్తున్న రైతుల తరఫు ప్రతినిధిల మధ్య మంగళవారం జరగాల్సిన సమావేశం రద్దయిందని తెలిపారు. చాలా మంది నిరసనకారులు కాలి నడకన యాత్ర చేస్తున్నారనీ, ఎండాకాలం పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం.. రైతులతో తక్షణమే చర్చలు జరపాలని ప్రతిపక్ష నేత, ఎన్‌సిపి కీలక నాయకుడు అజిత్‌ పవార్‌ రాష్ట్ర అసెంబ్లీలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు ప్రతినిధులతో బుధవారం ప్రభుత్వం సమావేశం జరుపుతుందని ఆ రాష్ట్ర మంత్రి దాదా భూసే చెప్పారు. ఈ చర్చల్లో రైతులు, గిరిజనులు లేవనెత్తిన సమస్యలపై ఏకాభిప్రాయం వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.