Nov 15,2023 09:25

-విజయవాడకు చేరుకున్న సీతారాం ఏచూరి
-భారీగా తరలుతున్న ప్రజానీకం
-10 గంటలకు ఫుడ్‌ జంక్షన్‌ నుండి మహాప్రదర్శన
-అగ్రభాగాన రెడ్‌ డ్రస్‌ వాలంటీర్ల కవాతు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రత్యామ్నాయ ప్రజా ప్రణాళికను వివరించేందుకు సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి బహిరంగసభకు సర్వం సిద్ధమైంది. విజయవాడ నగరంలో ఎక్కడ చూసిన ఎర్రజెండాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున తరలివస్తున్న ప్రజానీకానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో పార్టీ శ్రేణులు నిమగ్నమైనాయి. బహిరంగ సభా ప్రాంగణమైన సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభలో పాల్గనే వారికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా, ఎండ పడకుండా ఉండేందుకు వీలుగా టెంట్లు ఏర్పాటు చేశారు. వేలమంది కూర్చున్నా అందిరకి కనపడే విధంగా డయాస్‌ను రూపొందించారు.బుధవారం ఉదయం ఉదయం పది గంటలకు బిఆర్‌టిఎస్‌ రోడ్డులోని ఫుడ్‌ జంక్షన్‌ నుండి మహాప్రదర్శన ప్రారంభం కానుంది. అక్కడ నుండి భగత్‌సింగ్‌రోడ్డు మీదుగా సత్యనారాయణపురం, ముత్యాలంపాడు, సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ మీదుగా డాబాకొట్ల సెంటర్‌ నుండి స్టేడియానికి ప్రదర్శన చేరుకుంటుంది. అనంతరం బహిరంగ సభ ప్రారంభమవుతుంది. బహిరంగ సభలో పాల్గనడానికి సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి మంగళవారం సాయంత్రమే విజయవాడకు చేరుకున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో ఏచూరితో పాటు పొలిట్‌బ్యూరో సభ్యులు పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ.గఫూర్‌, ఎస్‌.పుణ్యవతి, సీనియర్‌ నాయకులు పి.మధుతోపాటు రాష్ట్ర కార్యదర్శివర్గంలో వివిధ రంగాల బాధ్యతలు చూస్తున్న నాయకులూ ప్రసంగించనున్నారు.

  • ప్రత్యేక ఆకర్షణ కానున్న కవాతు

మహా ప్రదర్శనలో రెడ్‌ డ్రస్‌ వాలంటీర్ల కవాతు ప్రత్యేక ఆకర్షణ కానుంది. వేలాది మంది రెడ్‌ డ్రస్‌ వాలంటీర్లు ప్రదర్శన ముందుభాగాన కదం తొక్కనున్నారు. వీరిలో కూడా ముందుభాగాన వందలాది మంది మహిళా రెడ్‌ డ్రస్‌ వాలంటీర్లు ఉంటారు. బహిరంగ సభా వేదిక వరకు వీరి కవాతు సాగుతుంది. రెడ్‌ డ్రస్‌ వాలంటీర్ల తరువాత ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో కళాకారులు ప్రదర్శనలో పాల్గంటారు. నృత్యాలు, కోలాటాలు, విచిత్రవేషాలు, తప్పెటగుళ్లు, కీలుగుర్రాళ్లతో కళాకారులు కదం తొక్కనునున్నారు. వారితరువాత ప్రజానీకం ప్రదర్శనలో పాల్గననుంది. ఈ ప్రదర్శన, బహిరంగసభల్లో భాగస్వామ్యం కావడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ప్రజానీకం రాక ప్రారంభమైంది. మంగళవారం సాయంత్రానికే పెద్దసంఖ్యలో ప్రజలు ఎర్రజెండాలు చేతపట్టి విజయవాడకు చేరుకున్నారు. వివిధ జిల్లాలకు చెందిన రెడ్‌డ్రస్‌ వాలంటీర్లు విజయవాడకు రావడంతో పాటు, రిహార్సిల్స్‌ కూడా నిర్వహించారు.