May 07,2023 10:22
  •  ఎల్‌జి పాలిమర్స్‌ బాధితుల గోడు వినేదెవరు ?
  •  చెల్లాచెదురైన 350 మంది కాంట్రాక్టు కార్మికులు
  •  14 మంది మృతులకుగాను రూ.కోటి చొప్పున 12 మందికే అందజేత
  •  రూ.10 వేలు పరిహారం అందని బాధితులు 150 మంది

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : 2020 మే 7... విశాఖ నగరంలోని వెంకటాపురం ప్రజలకు ఓ కాళరాత్రి. ఎల్‌జి పాలిమర్స్‌ యాజమాన్యం నిర్లక్ష్యం ఫలితంగా కంపెనీ నుంచి వెలువడ్డ స్టెరీన్‌ విషవాయువు పీల్చి అదే రోజు 12 మంది మృత్యువాత పడ్డారు. వారం తిరక్క ముందే మరో ఇద్దరు మృతి చెందారు. వందలాది మంది ఆస్పత్రి పాలయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వేలాది మంది ఇళ్లు విడిచి వెళ్లిపోయారు. సుమారు పది వేల మందిపై ఈ ఘటన ప్రభావం పడింది. దేశంలోనే సంచలమైంది. ఈ విషాద ఘటనకు నేటితో మూడేళ్లు పూర్తైంది. ఎల్‌జి పాలిమర్స్‌ ప్రమాదంపై స్పందించిన ప్రభుత్వం.. బాధితులకు అండగా ఉంటామని తెలిపింది. భారీ నష్టపరిహారం ప్రకటించింది. కానీ ఘటన జరిగి ఆదివారంతో మూడేళ్లయినా పరిహారం మాత్రం పూర్తి స్థాయిలో అందలేదు. ప్రమాదం కారణంగా సర్వం కోల్పోయిన తమను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ జిల్లా గోపాలపట్నం, ఆర్‌.వెంకటాపురం గ్రామ ప్రజల జీవనం నేటికీ వేదనాభరితంగానే కొనసాగుతోంది. దగ్గు, ఒంటిపై దద్దుర్లు, కళ్లల్లో మంటలు, శ్వాసలో ఇబ్బందులు, కిడ్నీ సమస్యలు, తలనొప్పి, జ్వరాలతో నిత్యం ఇక్కడ జనం అల్లాడుతూనే ఉన్నారు. వైసిపి ప్రభుత్వం ఈ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున 12 మందికి అందజేసింది. ఘటన జరిగిన రోజు మృతి చెందిన వారికే ఈ డబ్బులు అందాయి. వారం రోజుల వ్యవధిలో మృత్యువాత పడ్డ మరో ఇద్దరికి మాత్రం నేటికీ పరిహారం అందలేదు. ఎల్‌జి పాలిమర్స్‌లో సంవత్సరాల తరబడి పనిచేసిన 350 మంది కాంట్రాక్టు కార్మికులు నాటి నుంచీ చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెల్లాచెదురైపోయారు.
వీరికి ఎలాంటి పరిహారమూ యాజమాన్యం తరపున అందలేదు. పర్మినెంట్‌ కార్మికుల్లోని కొద్దిమందికి మాత్రమే ఎల్‌జి పాలిమర్స్‌ యాజమాన్యం బెనిఫిట్స్‌ ఇచ్చి కాంట్రాక్టు కార్మికులను గాలికొదిలేసింది.

1
  • కమిటీల నివేదికలు పట్టని వైనం

మనుషులతో సహా మూగజీవాలు, పక్షులు పెద్ద సంఖ్యలో మృతి చెందిన ఈ దుర్ఘటన అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. వేలాది మంది అస్వస్థతకు గురికాగా, వందల సంఖ్యలో బాధితులు నేటికీ ఉన్నారు. ప్రభుత్వం తరపున మూడు కమిటీలు, ఒక హైపవర్‌ కమిటీ, నిపుణుల కమిటీ, రాష్ట్ర స్థాయిలో మరో కమిటీ కూడా ఇక్కడి పరిస్థితులపై నివేదికలు అందజేశాయి. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాన్ని గుర్తించాక కూడా గ్రామస్తులను అప్రమత్తం చేయలేదని తేలింది. మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్‌ఎఫ్‌) ఈ చర్యను తీవ్రంగా తప్పుపట్టింది. ప్రమాదానికి కారణమైన 11 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వం పరిశ్రమను సీజ్‌ చేసింది. బాధితులను మాత్రం పట్టించుకోలేదు.

  • హామీలు మరచిన ప్రభుత్వం

వెంకటాపురంలో ఇప్పటికీ స్టెరీన్‌ వాసన వదిలిపోవడం లేదని గ్రామానికి చెందిన అప్పారావు, నవీన్‌ 'ప్రజాశక్తి'కి తెలిపారు. గ్రామంలో చెట్లు, గోడలు, ఇళ్లలోపల కూడా ఆనాటి దుర్ఘటన రోజు వచ్చిన స్టెరీన్‌ వాసన అప్పుడప్పుడూ వస్తోందని చెప్పారు. పదేళ్లకుపైగానే వెంకటాపురం వాసులను అనారోగ్య సమస్యలు, ఇతరత్రా వ్యాధులు వెంటాడే అవకాశం ఉన్నందున సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేసి ప్రభుత్వం తరపున ఉచిత వైద్యం అందించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి 2020లో హామీ ఇచ్చారు. మంత్రులూ, ఎమ్మెల్యేలు, వైసిపి నేతలూ ఇదే చెబుతూ వచ్చారు. ఆచరణలో పునాదిరాయి కూడా పడలేదు. స్టెరీన్‌ గ్యాస్‌ను పీల్చి ఆస్పత్రిపాలైన వారిలో ఇంకా 150 మందికి రూ.10 వేల పరిహారం అందనే లేదు.