May 03,2023 10:06
  • ప్రాథమిక అంచనాలకు స్వస్తి
  • లబ్ధిదారులు ఖరారయ్యాకే వెల్లడి
  • పంట నష్టాలపై సర్కారు తీరు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : విపత్తులొచ్చిన సందర్భాల్లో పంట నష్టాలను ప్రభుత్వం అంచనా వేయడం తెలిసిందే. పక్కాగా నష్టాల సమాచారం సేకరించాక నిబంధనలననుసరించి రైతులకు పరిహారం చెల్లిస్తారు. ప్రస్తుతం ఈ ప్రక్రియలో పారదర్శకత లోపిస్తోంది. అంతా గుంభనంగా సాగుతోంది. ప్రభుత్వం 'ఏ సీజన్‌లో నష్టాలకు ఆ సీజన్‌లోనే పరిహారం' అన్నాక అంచనాల్లో రహస్యం రాజ్యమేలుతోంది. పరిహారం అందుకొనే వరకు లబ్ధిదారుల జాబితాల్లో తమ పేరుందో లేదో రైతుకు తెలీనంత సీక్రెసీ అమలవుతోంది. పరిహారం కోసం ప్రభుత్వం వెచ్చించే నిధుల ఆదా కోసమే గూఢచారి సినిమాల్లో మాదిరి మిస్టరీ కొనసాగుతోందని ఆరోపణలొస్తున్నాయి. సాధ్యమైన మేరకు ఎన్యూమరేషన్‌ స్థాయిలోనే లబ్ధిదారుల ఏరివేతలు, కోతలు జరుగు తున్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మేలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నష్టం అంచనాలపై వ్యవసాయ, ఉద్యానవన, తదితర శాఖల సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి తయారు చేసే ఎస్టిమేషన్స్‌ నర మానవుడికి తెలియనీయల్లేదు. లబ్ధిదారుల ఎంపిక ఖరార య్యాకే సమాచారం బయట పెట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలున్నాయి.
 

                                                                       సుమారు లెక్కల్లేవు

తుపాన్లు, భారీ వర్షాలు, వరదలు, వడగండ్ల వానలు కురిసిన వెంటనే ఊళ్లలో అధికార యంత్రాంగం చూపుతో ప్రాథమిక అంచనాలు వేసి జిల్లా, రాష్ట్ర స్థాయికి పంపడం ఆనవాయితీ. తర్వాత నిదానంగా ఎన్యుమరేషన్‌ చేపడతారు. ప్రాథమిక స్థాయి అంచనాలలలో ప్రభుత్వానికి నష్టం తీవ్రత తెలిసొస్తుంది. ప్రాధమిక సమాచారంతోనే కేంద్రానికి అత్యవసర సహాయం అర్ధిస్తూ విజ్ఞాపనలు పంపుతారు. ప్రభుత్వం ఆ ఆనవాయితీకి స్వస్తి పలికింది. ఎన్ని రోజులైనా సరే, అంచనాల్లో స్పష్టత వచ్చాకనే, నష్టం సమాచారం బయట పెట్టాలన్నది సర్కారు హుకుం. దాంతో తుది లెక్కలు వచ్చే వరకు నష్టం తీవ్రత బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు ఎప్పుడు చేసేదీ, అందుబాటులో నిధుల లభ్యత, అందుకు తగ్గట్టు లబ్ధిదారులు.. ఇవన్నీ బేరీజు వేసుకున్నాకనే లబ్ధిదారుల జాబితాలు రెడీ అవుతున్నాయి. ఇ-క్రాప్‌ నిబంధన వలన ప్రాధమిక అంచనాలు వేయట్లేద ని సమాచారం. ఇ-క్రాప్‌లో ఎక్కితేనే పరిహారం ఇస్తున్నందు న, ముందస్తు అంచనాలు ప్రకటించాక, తుది లెక్కల్లో ఇ-క్రాప్‌ చేయని పొలాలను పరిహారం నుంచి తొలగిస్తే విస్తీర్ణంలో ఇబ్బందులొస్తాయని చెబుతున్నారు.
 

                                                                            అపార నష్టం

మార్చిలో కురిసిన వర్షాలపై ఇప్పటికీ నష్టం అంచనాలు తేల్లేదు. ఏప్రిల్‌ 23 నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో రెండు మూడు రోజులు కోస్తా, రాయలసీమలో వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెలలో తుపాన్‌ ఉంటుందంటున్నారు. కాగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు, ఈదురుగాలులకు వరి, మొక్కజొన్న, మిరప. పసుపు, అరటి, మామిడికి నష్టం జరిగింది. ధాన్యం, మొక్కజొన్న అయితే కోశాక తడిచి మొలకలొస్తున్నాయి. కోసి ఆరబెట్టిన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదని ఎన్యుమరేషన్‌లో నమోదు చేయట్లేదు. మామిడి కాయలు నేల రాలినా పరిహారం రాదంటున్నారు. ఎక్కడైనా చెట్లు పూర్తిగా పడిపోతే అరాకొర సాయం ఇస్తామంటున్నారు.