
దేశంలోని కోట్లాది గ్రామీణ శ్రామికులకు కనీస ఉపాధిని గ్యారంటీ చేసే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి (నరేగా) కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తూట్లు పొడుస్తోంది. అందుకు ఎనిమిదిన్నరేళ్లల్లో ఎన్నెన్నో దృష్టాంతాలు కనిపిస్తాయి. తాజాగా డిసెంబర్ 14న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా వండి వార్చిన గణాంకాలు, చేసిన విశ్లేషణలు ఉపాధి హామీ పట్ల సర్కారు వ్యతిరేకతకు పరాకాష్ట. దేశంలో 'ఉపాధి' పని కావాలనే కార్మిక కుటుంబాల సంఖ్య తగ్గుతోందని పచ్చి అబద్ధాలతో మంత్రి తప్పుదారి పట్టించారు. పనుల కోసం 2020-21లో 8.55 కోట్ల కుటుంబాల నుంచి డిమాండ్ రాగా 2021-22లో 8.05 కోట్ల కుటుంబాలకు డిమాండ్ తగ్గిందని చెప్పుకొచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు 6.24 కోట్ల కుటుంబాల నుంచే పని కావాలని డిమాండ్ వచ్చిందని వల్లెవేశారు. విత్త మంత్రి కావాలనే కరోనా సంవత్సరాన్ని కొలబద్దగా తీసుకున్నారు. వాస్తవానికి కరోనా కంటే ముందు 2018-19లో డిమాండ్ 5.87 కోట్ల కుటుంబాలు. 2019-20లో 6.16 కోట్ల కుటుంబాలు. ఆ డిమాండ్ కంటే ఈ ఏడాది తొమ్మిది మాసాల్లో వచ్చిన డిమాండ్ అధికం. కానీ కరోనా మొదటి దశ సంవత్సరాన్ని చూపించి, అనంతర కాలంలో డిమాండ్ తగ్గిందనడం వాస్తవాలను కప్పెట్టే కుట్ర.
ఉపాధి హామీ నిధులను సకాలంలో విడుదల చేయకుండా మోడీ ప్రభుత్వం రాష్ట్రాలను సాధిస్తోంది. దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలను కేంద్రం చెల్లించాలని పార్లమెంట్‌కు ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలే తెలుపుతున్నాయి. కూలీలకు వేతనాలు రూ.4,700 కోట్లు 18 రాష్ట్రాలకు ఇవ్వాలి. అవకతవకల ఫిర్యాదులతో పశ్చిమబెంగాల్‌కు రూ.2,748 కోట్లు నిలిపేశామని కేంద్రం చెబుతోంది. తక్కిన 17 రాష్ట్రాలు ఏం చేశాయని రూ.రెండు వేల కోట్లు బిగపట్టింది? ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో 4.32 లక్షల జాబ్‌కార్డులున్నాయి. ఆ రాష్ట్రంలో రోజుకూలి రూ.216. కార్మికుల వేతనాలను కేంద్రం రూ.173 కోట్లు బకాయి పెట్టింది. పలు రాష్ట్రాలదీ ఇదే పరిస్థితి. పని చేసిన పక్షం రోజుల్లోపు వేతనాలివ్వాలని చట్టం చెబుతోంది. చట్టాన్ని కేంద్రమే ఉల్లంఘించడమేంటి? ఉపాధి పనుల్లో మెటీరియల్ కాస్ట్ 19 రాష్ట్రాలకు కేంద్రం రూ.5,450 కోట్లు బకాయి పెట్టింది. వాటిలో యానిమేటర్లు, సహాయకులు, పర్యవేక్షకుల వేతనాలు కలిసే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు రూ.700 కోట్లివ్వాలి. ఇంకా పలు రాష్ట్రాలకు అధిక మొత్తంలోనే ఇవ్వాలి. మెటీరియల్ కాస్ట్ చెల్లించకపోతే సరఫరా గొలుసు దెబ్బతింటుంది. మెటీరియల్ సరఫరా చేసే సంస్థలు కొత్త పనులకు సరఫరా చేసేందుకు ఇష్టపడరు. పనులు నిలిచిపోతాయి. కేంద్రం తన వైఫల్యాన్ని చెప్పకుండా పనులకు డిమాండ్ తగ్గిందనడం దుర్మార్గం.
కరోనా లాక్‌డౌన్లతో పట్టణాల్లో ఉపాధి పోయాక 'ఉపాధి హామీ' ప్రాధాన్యత పెరిగింది. వ్యవసాయ సంక్షోభం, భారీ యంత్రాల ప్రవేశంతో వ్యవసాయ కార్మికుల పని దినాలు తగ్గిపోయి 'ఉపాధి హామీ' అవసరం పెరిగింది. మోడీ ప్రభుత్వం భుజానికెత్తుకున్న నయా-ఉదారవాద ఆర్థిక విధానాలతో కార్పొరేట్లు విచ్చలవిడిగా తెరమీదికొచ్చారు. గ్రామాల నుంచి పట్టణాలకు కూలీల వలసలు పెరిగితే ఆ మేరకు డిమాండ్ ఏర్పడి తక్కువ వేతనాలకు కార్మికులను దొరకబుచ్చుకొని శ్రమ దోపిడీ చేయాలన్న ఆరాటంలో ఉన్నారు. కార్పొరేట్ల కోసం పని చేస్తున్న మోడీ ప్రభుత్వం వారి ఆకాంక్షలకు తగ్గట్టు ఒక పథకం ప్రకారం 'ఉపాధి హామీ'ని నిర్వీర్యం చేస్తోంది. పలు శాఖలకు అనుసంధానం, నిధుల విడుదలలో జాప్యం అందుకే. గతేడాది రూ.93 వేల కోట్లుగా ఉన్న బడ్జెట్ ఈ సంవత్సరం రూ.73 వేల కోట్లకు తగ్గిపోయింది. ఏడాదిలో కనీసం వంద రోజుల ఉపాధి కల్పనకు 'నరేగా' చట్టం 2006లో వామపక్షాల ఒత్తిడి మూలంగా యుపిఎ సర్కారు హయాంలో వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఏడాదికి 200 రోజులపాటు ఉపాధిని గ్యారంటీ చేయాలని, రోజు కూలి రూ.600 ఇవ్వాలని, పట్టణ ప్రాంతాలకు విస్తరించాలన్న డిమాండ్ ముందుకొచ్చింది. మోడీ ప్రభుత్వమేమో ఉన్న చట్టానికి ఎసరు పెడుతోంది. శ్రామికులు అప్రమత్తమై కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించి ఉపాధికి గ్యారంటీ సాధించాలి.