Dec 20,2022 06:49

ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి సచివాలయ సందర్శన సందర్భాన తమది 'ఎంప్లాయి ఫ్రెండ్లీ' ప్రభుత్వమని ప్రకటించారు. పోను పోను ఉద్యోగుల ఎడల సర్కారు ధోరణి 'స్నేహ పూర్వకం' నుంచి దూరం జరిగిందనడానికి మూడున్నరేళ్లలో ఎన్నో ఉదంతాలు కనిపిస్తాయి. ఒకటవ తారీఖున జీతం పొందడాన్ని కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు మర్చిపోయారు. ఐదవ తేదీ లోపు జీతాలు పడితే చాలనుకుంటున్నారు. నెలలో మూడవ వారానికి కూడా అందరికీ జీతాలు, పింఛన్లు పడే పరిస్థితి లేదు. కాంట్రాక్టు, ఔట్‌సోర్స్‌ సిబ్బందికి చాలా విభాగాల్లో నెలల తరబడి వేతనాలు పెండింగ్‌ ఉంటున్నాయి. స్థానిక సంస్థలైన పంచాయితీలు, పట్టణాలు, కార్పొరేషన్లలో పారిశుధ్య కార్మికులకు సైతం అంతే. పలు స్కీం వర్కర్లదీ అదే తీరు. కాంట్రాక్టు, ఔట్‌సోర్స్‌ సిబ్బందికి క్రమబద్ధంగా జీతాలిచ్చేందుకు 'ఆప్కాస్‌'ను నెలకొల్పినా పరిస్థితిలో పెద్దగా తేడా ఏమీ లేదు. ఉద్యోగ అభద్రత రాజ్యమేలుతోంది. ఉద్యోగులు దాచుకున్న డబ్బు, ఇతర బకాయిలు చెల్లింపులూ పెండింగే. డిఎలు, ఇతర భత్యాల గురించి చెప్పనలవి కాదు. తమ సమస్యలపై గొంతెత్తే వారిపై ఎసిబి, విజిలెన్స్‌ కేసులతో ప్రభుత్వం భయపెడుతోంది. మాకు మేనిఫెస్టో అనేది భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌, మాట తప్పం మడమ తిప్పం అని చెప్పగా, ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సిపిఎస్‌) రద్దు హామీ విషయంలో మాట తప్పింది వైసిపి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్‌ రద్దు చేస్తామనగా, అవగాహన లేక వాగ్దానం చేశామని నాలుక మడతపెట్టడం ఘోరం. రాజస్థాన్‌, ఛతీస్‌గఢ్‌, పంజాబ్‌, తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌ సిపిఎస్‌ను రద్దు చేయగా ఇక్కడ మాత్రం ససేమిరా కుదరదంటోంది. జిపిఎస్‌ అని విన్యాసాలు లంకించుకుంది. ఉద్యోగులతో చర్చలకూ సిద్ధపడట్లేదు.
ఎంతకూ వేతన సవరణపై ప్రభుత్వం తేల్చకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు 'చలో అమరావతి' పిలుపునివ్వగా ఆ రోజు ప్రభుత్వం ప్రయోగించిన పోలీస్‌ నిర్బంధం అంతా ఇంతా కాదు. కేసులు, అరెస్టులు, హౌస్‌ అరెస్టులు, బారికేడ్లు, ముళ్లకంచెలతో తన ఉద్యోగులపై తానే యుద్ధం ప్రకటించింది. చివరికి అసంబద్ధ, రివర్స్‌ పిఆర్‌సి ఇచ్చింది. నాడు పిఆర్‌సి ఉద్యమంపై ప్రయోగించిన కర్కశం అనంతరం సిపిఎస్‌ రద్దు ఉద్యమకారులపైనా, తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు నిర్వహించే ఆందోళనలపైనా నిత్యకృత్యమైపోయింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్స్‌ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించేది లేదని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ నుంచి ప్రభుత్వం వైదొలిగింది. పదేళ్ల లోపు సర్వీసు కలిగిన ఔట్‌సోర్స్‌ సిబ్బంది లెక్కలు తీయాలని ఆదేశాలిచ్చింది డైరెక్టరేట్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ విభాగం. సిబ్బందిలో కలకలం లేవగా 'కర్ర విరగకూడదు పాము చావకూడదు' అన్న చందాన ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. తొలగింపు కత్తి ఔట్‌సోర్స్‌ ఉద్యోగుల మెడపై వేలాడదీసే ఉంచింది. విఆర్‌ఒలు, విలేజి సర్వేయర్ల హాజరుపై చర్యలు చేపట్టాలని స్వయంగా సిఎం కార్యాలయం ఆదేశాలిచ్చింది. ఉపాధ్యాయుల ఫేషియల్‌ అటెండెన్స్‌ నిబంధన ఉండనే ఉంది. ఇటువంటి ఆంక్షలు ఉద్యోగులపై మానసికంగా ఒత్తిడి పెంచుతాయి. ఇప్పటికే శాశ్వత నియామకాల్లేక అదనపు పని భారం మోస్తున్న సిబ్బందికి అదనపు డ్యూటీలు, ఫేషియల్‌ హాజరీల వంటివి పాలనకు కంటకంగా తయారవుతాయి.
కేవలం ఆర్థిక ఇబ్బందుల కారణంతోనే ఉద్యోగుల పట్ల ప్రభుత్వ ప్రవర్తన ఈ విధంగా ఉందనుకోలేం. నయా-ఉదార విధానాలు, కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లు రాష్ట్ర ప్రభుత్వంపై పని చేస్తున్నాయి. వాటి నుంచి ప్రభుత్వం విడగొట్టుకోవాలి. పథకాలను, పాలనను ప్రజల చెంతకు చేర్చేందుకు వారధిలా పని చేసే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం బాధ్యతాయుత, జవాబుదారీ, పారదర్శక, స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడమే మార్గం.