Feb 28,2023 21:26

వాషింగ్టన్‌ : ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ అగ్రస్థానంలోకి వచ్చారు. సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి మస్క్‌ ఆస్తుల విలువ 187.1 బిలియన్‌ డాలర్లకు చేరడంతో తొలి స్థానంలో నిలిచారని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఫ్రాన్స్‌కు చెందిన ఎల్‌విఎంహెచ్‌ ఛైర్మన్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ వెనక్కి నెట్టబడ్డారు. ప్రస్తుత ఆర్నాల్డ్‌ ఆస్తుల విలువ 185.3 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 2021లో నవంబర్‌లో 340 బిలియన్‌ డాలర్లుగా ఉన్న మస్క్‌ ఆస్తులు గతేడాది చివర్లో దాదాపు 137 బిలియన్‌ డాలర్లకు పడిపోవడంతో అప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ఆయన తర్వాత రెండో స్థానానికి పడిపోయారు. 2023లో ఇప్పటి వరకు ఆయన సంపద 36 శాతం పెరగడంతో తిరిగి తొలి స్థానంలోకి వచ్చారు. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ దెబ్బతో భారత కుబేరుడు గౌతం అదాని 37.7 బిలియన్‌ డాలర్లతో 32వ స్థానానికి పతనమయ్యారు. ముకేష్‌ అంబాని 81.1 బిలియన్‌ డాలర్లతో టాప్‌ 10 స్థానంలో నిలిచారు.