
వినాశకర సంస్కరణలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం సాగింది, కొనసాగుతుంది. విద్యుత్ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఇప్పటికే దేశ వ్యాపితంగా విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు ఉద్యమిస్తున్నారు. విద్యుత్ వినియోగదార్లుగా అనేక ప్రాంతాల్లో ప్రజలూ ఉద్యమిస్తున్నారు. విద్యుత్ రంగ సంస్కరణలు రాష్ట్రాల హక్కులను హరించివేస్తున్నందున కేరళ, తెలంగాణ, తమిళనాడు వంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలూ ప్రతిఘటిస్తున్నాయి. సంస్కరణల్ని తిప్పికొట్టడానికి ఇవన్నీ ఏకోన్ముఖంగా సాగాలి.
దేశంలో నయా ఉదారవాద ఆర్థిక విధానాలను అమలు చేయడంలో విద్యుత్ రంగ సంస్కరణలపైనే పాలకుల ప్రధాన దృష్టి ఉంటూ వస్తోంది. ఒకప్పటి ఎన్‌రాన్ ఒప్పందం మొదలు ఇటీవలి 'ఉజ్వల భారత్-ఉజ్వల భవిష్య' వరకూ అన్ని సందర్భాల్లోనూ ఆ ప్రాధాన్యత ద్యోతకమవుతుంది. విద్యుత్ రంగంలో సంస్కరణల వేగం పెంచడానికి మోడీ ప్రభుత్వం ఏక కాలంలో పలు యత్నాలు చేస్తోంది. తెలంగాణ, కేరళ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అదనపు రుణాలకు అనుమతి సంపాదించడానికి దాదాపు అన్ని షరతులకూ తలొగ్గడం దారుణం. విద్యుత్ సంస్కరణలను ప్రతిఘటించడంలో తెలుగు ప్రజలకు ఘనమైన చరిత్ర వుంది. ముఖ్యంగా 2000 సంవత్సరంలో సాగిన మహోద్యమం, బషీర్‌బాగ్ కాల్పుల్లో ముగ్గురు యువ కిశోరాల ప్రాణత్యాగం అజరామరం. ఆ మహత్తర త్యాగాలను స్మరించుకొని నేటి పరిస్థితిని అవలోకించి కర్తవ్యాలను నిర్దేశించుకుందాం.
విద్యుత్ చట్ట సవరణ బిల్లు
ఇప్పుడు అమలులో వున్న విద్యుత్ చట్టం (2003)ను సవరించాలని యుపిఎ-2 హయాంలో 2013 లోనే ప్రయత్నం మొదలైంది. కాని అది నెరవేరలేదు. మోడీ గద్దెనెక్కాక 2018లో ఆ తరువాత 2019 ఎన్నికలకు ముందుగా సవరణలను ప్రతిపాదించినా అవి ఆచరణకు రాలేదు. దాంతో చట్టానికి కాకుండా రూల్స్‌కు సవరణలు తేవడానికి కొన్ని పాలనా పరమైన ఉత్తర్వులిచ్చింది. ఏడాదిపాటు సాగిన చారిత్రాత్మక రైతు ఉద్యమ డిమాండ్లలో మూడు నల్ల వ్యవసాయ చట్టాల రద్దుతోపాటు విద్యుత్ చట్ట సవరణలను ఉపసంహరణ కూడా ప్రధానమైనది. అయినా మోడీ సర్కారు విద్యుత్ చట్ట సవరణకు దొడ్డిదారిన యత్నిస్తూ రూల్స్ పేరిట కొన్ని ప్రతిపాదనలు చేసింది. అందుకోసం గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రాల విద్యుత్ శాఖ కార్యదర్శులతో కేంద్ర మంత్రి ఆర్‌కె సింగ్ కొన్ని అంశాలు ప్రతిపాదించగా అనేక రాష్ట్రాలు వ్యతిరేకించాయి. తాము చెప్పిన సంస్కరణల్ని అమలు చేసిన డిస్కాములకు అదనంగా నిధులు, రుణాలు కేటాయిస్తామని 'రీ వ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్'ను ముందుకు తెచ్చింది. అయినా ఆగకుండా విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టింది. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల ప్రతిఘటన, దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ఇంజనీర్ల ఆందోళనలతో కొద్దిగా వెనక్కు తగ్గి బిల్లును స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేశారు.
ఆర్‌డిఎస్‌ఎస్ పేరిట ఒత్తిళ్లు
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కామ్‌లను ఆదుకునే పేరుతో రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్.డి.ఎస్.ఎస్)ను కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణల అమలుకు రూ.3,03,758 కోట్లను రాష్ట్రాలకు రుణంగా మంజూరు చేస్తానంది. అన్ని షరతులు సకాలంలో అమలు చేస్తే కొన్ని రాయితీలు, గ్రాంట్లు ఉంటాయని ఊరించింది. వినియోగదార్లందరికీ స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లను 2023 డిసెంబర్ నాటికి బిగించాలని ఒత్తిడి చేస్తోంది. ఆర్.డి.ఎస్.ఎస్ పథకంలో ఆటోమేటిక్ సబ్‌స్టేషన్ల (ఎస్.ఎ.ఎస్) ప్రతిపాదన కూడా ఉంది. ఎస్.ఎ.ఎస్ అమలు చేస్తే సబ్‌స్టేషన్లలో పని చేసే సిబ్బంది భారీగా తగ్గుతారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో విద్యుత్ ఉద్యోగులపై పనిభారం అధికంగా ఉంది. ఈ సంస్కరణల వల్ల తమపై మరింత భారం పడుతుందని విద్యుత్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగ దారులకు సేవలందించడం లోనూ ఇబ్బందులు తలెత్తవచ్చు. ప్రజల నెత్తిన భారాలు మోపాలని కేంద్ర ప్రభుత్వం విధించిన షరతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుచ తప్పక అమలు చేస్తోంది. ఇప్పటికే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చిన ప్రభుత్వం ఇప్పుడు అన్ని కేటగిరీల విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లను అమర్చడానికి అంగీకారం తెలిపింది. వాటి కొనుగోలుకు టెండర్లు కూడా ఖరారయ్యాయి. వివిధ తరగతుల వినియోగదార్లకిస్తున్న క్రాస్ సబ్సిడీలకు క్రమంగా మంగళం పాడుతోంది.
ఉజ్వల భారత్-ఉజ్వల భవిష్య
స్వాతంత్య్రం సాధించుకున్న 75 ఏళ్ల ఉత్సవాలను పురస్కరించుకొని ఈ జులై 2 నుండి 30 వరకు కేంద్ర ప్రభుత్వం 'ఉజ్వల భారత్- ఉజ్వల భవిష్య- పవర్ ఏ 2047' పేరిట హడావుడి చేసింది. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా వర్చువల్ మీట్‌లో పాల్గొని సాధారణ వినియోగదార్లతో ముచ్చటించారు. విద్యుత్ రంగంలో 'సాధించిన' గొప్పతనమంటూ 175 గిగా వాట్ల సంప్రదాయేతర ఇంధన (ఎన్‌సిఇ) విద్యుదుత్పత్తి సామర్ధ్యానికి చేరువయ్యామని చెప్పారు. ప్రపంచంలో ఎన్‌సిఇ అత్యధిక ఉత్పత్తి చేసే నాలుగైదు దేశాల సరసన చేరామన్నారు. అయితే, వీటిలో అత్యధిక భాగం దేశ విదేశీ కార్పొరేట్ సంస్థలవేనన్న విషయం మరుగున పర్చారు. మరోవైపున శిలాజ ఇంధనాల వినియోగం తగ్గుదల గురించి వివరించి, 2047 నాటికి మహా లక్ష్యాలను సాధిస్తామని చెప్పుకొచ్చారు.
పవర్ రేటింగ్ మాయాజాలం
దేశంలోని డిస్కాముల పనితీరును అంచనా వేసి రేటింగ్ ఇచ్చే విధానం 2012 నుండి అమలులో వుంది. దేశంలోని 52 డిస్కాములు,11 విద్యుత్ శాఖలు, 8 యుటిలిటీలకు మొత్తం 71 సంస్థలకు ఆగస్టు 8న కేంద్రప్రభుత్వ విద్యుత్‌శాఖ ఈ ఏడాది రేటింగ్ ప్రకటించింది. తొలి నాళ్లలో ఆంధ్రప్రదేశ్ డిస్కాములు అగ్ర స్థానాల్లో వుండేవి. ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా గల ఇపిడిసిఎల్ తొలి ఐదు స్థానాల్లో ఎప్పుడూ ఉండేది. కాని గత మూడేళ్లుగా ప్రాతిపదికలను మార్చేస్తుండడంతో ర్యాంకు దిగజారుతోంది. ఈ ఏడాది రేటింగ్ మహేంద్రజాలంలో ప్రైవేటు డిస్కాములు, గుజరాత్‌కు చెందిన ప్రభుత్వ సంస్థలే అగ్ర స్థానంలో నిలిచాయి. మొత్తం 52 డిస్కాముల రేటింగ్‌లో ఎ.పి డిస్కాములు 50వ, 51వ స్థానానికి నెట్టివేయబడ్డాయి. ఇంతకన్నా మోసం మరొకటి ఉండబోదు.
ఈ ఏడాది చేపట్టిన ఇంటిగ్రేటివ్ పవర్ రేటింగ్ విధానంలో ప్రైవేటు డిస్కాములకే పెద్ద పీట వేశారు. ఆ సంస్థల్ని ఎలా పై స్థానాల్లో నిలపాలా అన్నదే రేటింగ్ వ్యవస్థ పరమావధిలా వ్యవహరించారు. ఇటువంటి మాయాజాలం వల్ల బాగా పని చేస్తున్న ప్రభుత్వరంగ డిస్కాముల్లోని ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికుల నైతిక స్థైర్యం దెబ్బ తింటుంది. మరోవైపున ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు కంటే ప్రైవేటువే బాగున్నాయన్న ప్రచారాన్ని మోడీ సర్కారు, కార్పొరేట్ మీడియా చేస్తాయి. ఆ విధంగా ప్రైవేటుకు సానుకూలత, ప్రభుత్వ రంగాన్ని దెబ్బ తీయడం అనే రెండు పనులు చేస్తోంది. ఇటువంటి కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండం అవసరం.
ట్రూ అప్ చార్జీల ప్రతిపాదన
గడచిన రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదార్లకు విద్యుత్ చార్జీలు పెంచింది. రూ. 1,400 కోట్లు అదనపు భారం అని చెప్పినా ఇంధన చార్జీ పెంపు, శ్లాబుల మార్పు మూలంగా ఆచరణలో అది రూ.2,000 కోట్లకు చేరుతుంది. ఇది కాక ఇప్పటికే ట్రు అప్ చార్జీల పేరుతో డిస్కాములు రూ. 2,910 కోట్లు భారం వేశాయి. తాజాగా 2021-22 చివరి త్రైమాసికం ట్రూ అప్ అంటూ మరో రూ.1,048 కోట్ల భారం వేయడానికి ఎపిఆర్‌సికి ప్రతిపాదించింది. సెప్టెంబర్ 7న దానిపై పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తామని ఎపిఇఆర్‌సి ప్రకటించింది. అంత కాకపోయినా ఎంతో కొంత ఈ 'సర్దుపోటు' భారం వినియోగదార్లకు తప్పదు. ప్రతి ఏటా ప్రకటించే టారిఫ్ ఆర్డర్ ద్వారా పడే భారాలకన్నా ట్రూ అప్ పేరిట ప్రభుత్వం అధిక భారాలు మోపుతోంది. ఈ ఏడాది లెక్కనే తీసుకుంటే టారిఫ్ ఆర్డర్ రూ. 1400 కోట్లు అదనపు భారం కాగా ట్రూ అప్ రూ. 3950 కోట్లు పడింది. ఇలా ఉంది ట్రూ అప్ మాయ! కనుక ట్రూ అప్ పేరిట వేస్తున్న అదనపు భారాలను తిరస్కరించాలి.
సంఘటిత ప్రతిఘటనే మార్గం
దేశ విదేశీ కార్పొరేట్లకు మేలు చేకూర్చడానికి మోడీ సర్కారు విద్యుత్ సంస్కరణల్ని వేగవంతం చేస్తోంది. జనరేషన్ రంగంలో ప్రైవేటువారి ఆధిక్యత నెలకొన్నా పంపిణీ రంగంలో ప్రభుత్వరంగ డిస్కాములే ప్రధానంగా ఉన్నాయి. వాటిని దెబ్బ తీయడానికి, సమాంతరంగా ప్రైవేటు డిస్కాములు తేవడానికి కేంద్రం శత విధాలా కుట్రలు చేస్తోంది. మరోవైపున ట్రాన్స్‌మిషన్ రంగంగంలో గ్రిడ్‌పై కేంద్రం పెత్తనం పెరిగిపోయింది. వినాశకర సంస్కరణలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం సాగింది, కొనసాగుతుంది. విద్యుత్ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఇప్పటికే దేశ వ్యాపితంగా విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు ఉద్యమిస్తున్నారు. విద్యుత్ వినియోగదార్లుగా అనేక ప్రాంతాల్లో ప్రజలూ ఉద్యమిస్తున్నారు. విద్యుత్ రంగ సంస్కరణలు రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నందున కేరళ, తెలంగాణ, తమిళనాడు వంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలూ ప్రతిఘటిస్తున్నాయి.
సంస్కరణల్ని తిప్పికొట్టడానికి ఇవన్నీ ఏకోన్ముఖంగా సాగాలి. పరస్పర సమన్వయం కూడా అవసరం. ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న భారాలను వ్యతిరేకిస్తూనే...దేశ వ్యాప్తంగా ఆ దిశగా సాగే ఆందోళనలు, పోరాటాల్లో పాల్గొనడమే రామకృష్ణ, బాలాస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిలకు ఇచ్చే నిజమైన నివాళి!

బి. తులసీదాస్