Mar 11,2023 06:34

విద్యుత్‌ రంగంలో 1990 దశకంలో ప్రారంభించిన సంస్కరణలు అనేక మార్పులు, చేర్పులకు గురౌతూ వస్తున్నాయి. ఆ సంస్కరణలకు ప్రేరేపించినవారు వాటికి మద్దతు ఇస్తున్నారు. ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారాలు వివిధ రూపాలలో పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వరంగ విద్యుత్‌ సంస్థలు ముఖ్యంగా విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) నష్టాలపాలవుతున్నాయి. విద్యుత్‌ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడిదారులు పెద్దఎత్తున చొరబడటానికి, క్రమేణా విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణకు ఈ విధానాలు దారితీస్తున్నాయి. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ప్రధాన కారణం. ప్రభుత్వరంగ విద్యుత్‌ సంస్థల నిర్వహణలో లోపాలు, లోటుపాట్లు కొంతవరకు కారణమౌతున్నాయి. విద్యుత్‌ రంగ వ్యవహారాలను నియంత్రించేందుకు ఉద్దేశించిన నియంత్రణ కమిషన్లు, ట్రిబ్యునళ్లు వాటికి ఉన్న పరిమితులు, బలహీనతల రీత్యా ప్రభుత్వాల విధానాల పరిధికి లోబడి నియంత్రణ ప్రక్రియను చేపడుతున్న రీత్యా వినియోగదారుల విశాల ప్రయోజనాలను పరిరక్షించటంలో వాటి పాత్ర అతి పరిమితంగా ఉంది. చాలావరకు వాటి పాత్ర ప్రభుత్వాల నిర్ణయాలకనుగుణంగా తీసుకుంటున్న చర్యల క్రమబద్ధీకరణగా మారింది. రాజ్యంలోని అధికార అంగాలన్నీ పాలక వర్గాల ప్రయోజనాల కోసమే పనిచేస్తాయన్న లెనిన్‌ ఉద్ఘాటన లోని అనుభవసారం, వాస్తవికత ప్రతినిత్యం విద్యుత్‌ రంగంతో సహా వివిధ రంగాలలో ప్రస్ఫుటమౌతున్నది. అధికారంలోఉన్న వారికితోడు నయా-ఉదారవాద విధానాలకు, కార్పొరేట్‌ రంగ ప్రయోజనాలకు మద్దతుదార్లుగా వ్యవహరిస్తున్న మేధావులు, నిపుణులు, పాలకవర్గ మీడియా నిజాయితీ లేకుండా విశాల ప్రజాప్రయోజనాన్ని పట్టించుకోకుండా చేస్తున్న ఏకపక్ష ప్రచారం ప్రజలను మభ్యపెట్టడానికి దారితీస్తున్నది. విద్యుత్‌ చార్జీలను పెంచక తప్పదని, సామాన్య ప్రజానీకానికి ఇస్తున్న కొద్దిపాటి సబ్సిడీలను వ్యతిరేకిస్తూ అవే సమస్యలకు కారణమన్న రీతిలో ఊదరగొట్టుడు ప్రచారం చేసేవారు అలాంటి పరిస్థితికి దారితీస్తున్న ప్రభుత్వాల విధానాలను, చట్టాలను, నిర్ణయాలను, ఆచరణను ప్రశ్నించరు. వాటికి ప్రజానుకూల ప్రత్యామ్నాయాలను సూచించే ప్రయత్నం చేయరు.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న, రాష్ట్రాలపై రుద్దుతున్న విధానాల సారాంశం కాకులను కొట్టి గద్దలకు వేయటమే. ప్రజలపై విపరీత భారాలను మోపుతూ, కార్పొరేట్‌ సంస్థల పబ్బం గడపటం తమ పబ్బం గడుపుకోవటం పాలకవర్గ నేతలకు నిత్యకృత్యంగా మారింది. ఫెడరల్‌ వ్యవస్థ స్ఫూర్తిని హరిస్తూ, రాష్ట్రాల హక్కులను, అధికారాలను కబళిస్తూ, మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ విధానాలు, చట్టాలు, ఆదేశాల ప్రకారం ప్రైవేటు విద్యుత్‌ ప్రాజెక్టులకు అనుమతులనిచ్చి, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను (పిపిఎ) చేసుకొంటున్న తీరు, అధిక పెట్టుబడి వ్యయం మోసాలు, లోపభూయిష్ట నిబంధనలు వినియోగదారులపై నివారించదగిన వేల కోట్ల రూపాయల భారాలను దీర్ఘకాలికంగా మోపటానికి దారితీస్తాయి. దేశంలోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఆ తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను ఈ చేదు అనుభవాల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా ఈ నష్టదాయక విధానాలు కొనసాగుతూనే ఉన్నాయి. నియంత్రణ కమిషన్ల రెగ్యులేషన్లు, ఉత్తర్వులు కూడా అనేక సందర్భాలలో అందుకు వీలు కల్పించేవిగా ఉన్నాయి. పార్టీలు వేరైనా, కొనసాగుతున్న ఈ ధోరణి పాలక వర్గాల వర్గస్వభావం కొంత హెచ్చుతగ్గులతో ఒకటేనని నిర్థారిస్తున్నది. ఆ పార్టీలు పరస్పరం తీవ్ర విమర్శలు, నిందారోపణలు చేసుకుంటున్నా, ప్రజానుకూల ప్రత్యామ్నాయాలు సూచించవు.
డిస్కంలు వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు అయ్యే మొత్తం ఖర్చులో దాదాపు 75 నుంచి 80 శాతం వరకు విద్యుత్‌ కొనుగోలు వ్యయమే. ఈ వ్యయం పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రధానంగా కారణమౌతున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగించే ఇంధనాలకయ్యే వ్యయం గణనీయంగా ఉంటుంది. ఈ వ్యయం పెరుగుదలని బట్టి అస్థిర చార్జీలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. బొగ్గు, సహజ వాయువు వంటి ఇంధనాల ధరలను వాటి ఉత్పత్తి వ్యయం, న్యాయమైన లాభం ఆధారంగా నిర్ణయించాలి. కానీ, కేంద్ర నిర్హేతుక విధానాల వల్ల వాటి ధరలు చాలా అధికంగా ఉంటున్నాయి. ఈ ఇంధనాలను ఉత్పత్తి చేసి, విక్రయిస్తున్న సంస్థలకు వస్తున్న అధిక లాభాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్రానికి చెల్లిస్తున్న డివిడెండ్ల భారీ మొత్తాలు దీనిని నిర్థారిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పిన నాలుగు గ్యాస్‌ ఆధారిత ప్రైవేట్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు రిలయన్స్‌ సంస్థ కెజి బేసిన్‌ నుండి సహజ వాయువు సరఫరా నిలిపివేసింది. దీనితో అవి 2013 మార్చి నుంచి మూతబడ్డాయి. విద్యుత్‌ ఉత్పత్తి చేయకపోయినా డిస్కంలు ఈ ప్రాజెక్టులకు స్థిర చార్జీలను చెల్లించాలన్న వివాదాలు అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ చివరకు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులలో ఉభయ తెలుగు రాష్ట్రాల డిస్కంలకు పిపిఎల ప్రకారం వాటాలున్నాయి. రిలయన్స్‌ సంస్థ కేజి బేసిన్‌లో సహజవాయువు ఉత్పత్తిని ప్రారంభించినా, కేంద్రం చేసిన కేటాయింపుల మేరకు ఈ ప్రాజెక్టులకు దానిని సరఫరా చేయాలని రిలయన్స్‌ను ఆదేశించకుండా స్వేచ్ఛా మార్కెట్‌లో వేలం ద్వారా విక్రయించుకునేందుకు మోడీ ప్రభుత్వం రిలయన్స్‌ సంస్థకు వీలు కల్పించింది. అనగా చట్టబద్ధమైన నల్లబజారు వ్యాపారానికి, విపరీత లాభార్జనకు వీలు కల్పించింది. ఆ పద్ధతిలో సహజ వాయువును కొని విద్యుత్‌ ఉత్పత్తి చేస్తే, విద్యుత్‌ కొనుగోలుకు విపరీతమైన ధరలను చెల్లించాల్సి వస్తుంది. జివికె నుంచి ఆంధ్రప్రదేశ్‌ డిస్కంలు కొనుగోలు చేసిన గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ యూనిట్‌ పరిస్థితి కూడా గ్యాస్‌ ధర విపరీతంగా పెరగడంతో ఉత్పత్తి చేయలేక అలాగే ఉంది. కెజి బేసిన్‌లో ప్రభుత్వ రంగ సంస్థ ఒఎన్‌జిసి గ్యాస్‌ ఉత్పత్తి పెంచడానికి కేంద్రం అనుమతించడంలేదు. మరోవైపున ఒఎన్‌జిసి బావుల నుండి రిలయన్స్‌ దాదాపు రూ.30,000 కోట్ల విలువైన గ్యాస్‌ను అక్రమంగా తీసుకున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డిజిహెచ్‌) నిర్థారించింది.
బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్‌ వ్యయం విపరీతంగా పెరగడానికి కేంద్రం విధిస్తున్న రకరకాల పన్నులు మరో కారణం. బొగ్గు మూలధరపై రాయల్టీ 14 శాతం, జిఎస్‌టి 5 శాతం, గ్రీన్‌ ఎనర్జీ సెస్‌ టన్నుకు రూ.400, జాతీయ మైనింగ్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ పన్ను, జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ చార్జి, పర్యావరణ్‌, వికాస్‌ ఉప్‌కార్‌ లెవీ...ఇలా ఎన్నో. డివిడెండ్లు, పన్నులు, సుంకాల రూపంలో కేంద్రం విపరీతంగా ఆదాయం పొందుతున్నా వినియోగదారులకు విద్యుత్‌ చార్జీల భారాలను తగ్గించడానికి ఎటువంటి సబ్సిడీని ఇవ్వటంలేదు.
ఆశ్రిత పెట్టుబడిదారుల, ప్రైవేటు వ్యాపారుల పబ్బం గడిపేందుకు కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, విద్యుత్‌ వినియోగదారులపై అన్యాయంగా విపరీత భారాలను మోపుతున్నాయి. దేశంలో బొగ్గు గనుల సంస్థలకు సమృద్ధిగా నిధులు, యంత్రాలు, కార్మికశక్తి, బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికి, దేశంలో బొగ్గుకు కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారు. దీనితో థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు కేంద్రం చేసిన కేటాయింపుల మేరకు బొగ్గు సరఫరా జరగక విద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయి, విద్యుత్‌ కొరత ఏర్పడుతున్నది. విద్యుత్‌ ఉత్పత్తికి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ప్రైవేటు థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులపై ఒత్తిడి తెస్తూ ఆదేశాలను జారీచేస్తున్నది. ఇక్కడ అదానీ, టాటాల వంటి గుత్తపెట్టుబడిదారీ సంస్థల థర్మల్‌ ప్రాజెక్టులకు ఈ ఆదేశాలను వర్తింపజేయటం లేదు. మోడీ ప్రభుత్వం కోల్‌ ఇండియా లిమిటెడ్‌ ద్వారా ఆస్ట్రేలియాలోని అదానీ బొగ్గు గనుల నుంచి స్వదేశీ బొగ్గు ధరల కన్నా అనేక రెట్లు అధిక ధరలకు దిగుమతి చేయించి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు అంటగట్టింది. దీనితో, విదేశీ బొగ్గుతో ఉత్పత్తి చేస్తే ప్రాజెక్టుల విద్యుత్‌ వ్యయం విపరీతంగా పెరిగింది. మరోపక్క, విద్యుత్‌ కొరతతో డిస్కంలు డిమాండ్‌ తీర్చేందుకు విద్యుత్‌ ఎక్స్చేంజ్‌ల ద్వారా చాలా అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. ఆ విధంగా ఒకపక్క ఆశ్రిత పెట్టుబడిదారుల, ప్రైవేట్‌ విద్యుత్‌ వ్యాపారుల పబ్బం గడుపుతూ, మరోపక్క వినియోగదారులపై విపరీత భారాలు మోపడానికి మోడీ ప్రభుత్వ విధానాలు దారితీస్తున్నాయి. ఉదాహరణకు 2021-22లో బొగ్గు కొరత వల్ల, ఆంధ్రప్రదేశ్‌ డిస్కంలకు విద్యుత్‌ సరఫరా చేసే ఎపిజెన్‌కో, కేంద్ర, ఎపిపిడిసిఎల్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌ల ఉత్పత్తి 10142.60 మిలియన్‌ యూనిట్ల మేరకు తగ్గిపోయింది. ఈ కారణాల వల్ల ఎపిఈఆర్‌సి అనుమతించిన 1316.80 ఎంయులకు మించి, డిస్కంలు 11773 ఎంయులను విద్యుత్‌ ఎక్స్చేంజ్‌ల ద్వారా అదనపు కొనుగోలు చేసి డిమాండ్‌ తీర్చాయి. ఇందుకు యూనిట్‌కు రూ.3.21 నుంచి రూ.9.42 వరకు డిస్కంలు చెల్లించాయి. మొత్తం రూ.6255.97 కోట్లు చెల్లించాయి. దీనివల్ల ఎపిఈఆర్‌సి అనుమతించిన దానికన్నా, 2021-22లో విద్యుత్‌ కొనుగోలు వ్యయం రూ. 3083 కోట్ల మేరకు పెరిగింది. 2021-22 సంవత్సరానికి ఇంధన విద్యుత్‌ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పిపిసిఎ) కింద మూడు డిస్కంల వినియోగదారుల నుంచి అదనంగా రూ.3082.99 కోట్ల మేరకు వసూలు చేసుకునేందుకు అనుమతిస్తూ ఎపిఈఆర్‌సి ఈ నెల మొదటి తేదీన ఉత్తర్వు ఇచ్చింది.
పొటీ ఉంటుందని, విద్యుత్‌ చార్జీలు తగ్గుతాయని సంస్కరణల మద్దతుదారులు చేసిన వాదనలు డొల్ల అని కూడా రుజువయ్యింది. విద్యుత్‌ ఎక్స్చేంజ్‌ల ద్వారా వివిధ విద్యుత్‌ వ్యాపారులు పోటీపడి తక్కువ ధరకు విద్యుత్‌ను విక్రయించే పరిస్థితి లేకుండా పోయింది. విద్యుత్‌ వ్యాపారులంతా రింగ్‌గా ఏర్పడి కొనుగోలు దారులైన డిస్కంలు ఎంత ఎక్కువ రేటు ఇవ్వడానికి అంగీకరిస్తే వాటికి విద్యుత్‌ సరాఫరా చేసే విధానం అమలు జరుగుతున్నది. ఆ విధంగా విద్యుత్‌ ఎక్స్చేంజ్‌లు చట్టబద్ధ నల్లబజారు వ్యాపారానికి అడ్డాలుగా మారడానికి, కొరత పరిస్థితుల సాకుతో ధరలను విపరీతంగా పెంచడానికి మోడీ ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. మార్కెట్లో ఆ విధంగా యూనిట్‌ విద్యుత్‌ ధర రూ.20కి మించి పెరిగాక, కేంద్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (సిఇఆర్‌సి) యూనిట్‌కు రూ.12కు మించరాదన్న పరిమితి విధిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. భారీగా ఎక్స్చేంజ్‌ల ద్వారా అధిక ధరలకు విద్యుత్‌ విక్రయాలు దీర్ఘకాలం పాటు జరిగాక జారీ చేసిన ఈ పరిమితి కూడా చాలా అధికమైనదే.
ఆరు శాతం వరకు విదేశీ బొగ్గును స్వదేశీ బొగ్గుతో కలిపి విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ గత జనవరిలో విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దీనికితోడు, వాటి అవసరాలలో 10 నుంచి 15 శాతం వరకు స్వదేశీ బొగ్గును రైలు-రోడ్డు-రైలు పద్ధతిలో రవాణా చేసుకోవాలని కూడా గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాలను, ఎన్‌టిపిసిని ఆదేశించింది. దీనివల్ల బొగ్గు రవాణా ఖర్చులు, రైల్వే యార్డులు, షిప్‌యార్డులలో బొగ్గును దించటం, మళ్లీ ఎక్కించటం, తదితర అనవసర ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయి. థర్మల్‌ విద్యుత్‌ చార్జీలు పెరుగుతాయి. ఆయా విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు వాటి ప్రాజెక్టులకు కేటాయించబడిన బొగ్గును సాధ్యమైన మేరకు త్వరితంగా, తక్కువ ఖర్చుతో రవాణా చేసుకునే మార్గాలను ఎంచుకోకుండా మోడీ ప్రభుత్వం ఈ తుగ్లక్‌ మార్గాన్ని ఎందుకు నిర్దేశించినట్లు? అదానీ హస్తగతమైన ఓడరేవులకు వ్యాపారం కోసం మోడీ ప్రభుత్వం ఈ తుగ్లక్‌ నిర్ణయం తీసుకుంది. తమ ఆదేశాన్ని పట్టించుకోకపోతే అవసరమైన రేల్వే వ్యాగన్లను బొగ్గు రవాణాకు కేటాయించబోమని కూడా కేంద్రం బెదిరించింది.
డిస్కంలు వినియోగదారులకు సరఫరా చేసే విద్యుత్‌లో కనీసం ఎంతశాతం మేరకు పునరుత్పత్తి అయ్యే విద్యుత్‌ను (సౌర, పవన ఇతర సంప్రదాయేతర విద్యుత్‌) కొనుగోలు చేసితీరాలో కేంద్రం నిర్దేశిస్తున్నది. విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌లు ఇందుకు రెన్యువబుల్‌ పవర్‌ పర్చేజ్‌ ఆబ్లిగేషన్‌ (ఆర్‌పిపిఒ) ఉత్తర్వులను జారీ చేస్తున్నాయి. అధికంగా ఉన్న ఆ కనీస శాతానికి మించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్‌ఇ కొనుగోలుకు డిస్కంలతో దీర్థకాలిక పిపిఎలు చేయిస్తున్నాయి. వీటికి కమిషన్లు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. ఎన్‌టిపిసికి చెందిన వ్యాపార విభాగం ఎన్‌వివిఎల్‌, సెకీ వంటి సంస్థల ద్వారా ఆశ్రిత పెట్టుబడిదారుల సౌరవిద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయించి రాష్ట్రాల డిస్కంలకు కేంద్రం అమ్మిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వార్థ ప్రయోజనాలకు ఆ విద్యుత్‌ కొనుగోలుకు దీర్థకాలిక పిపిఎలు చేయించి, కమిషన్ల ఆమోదం పొందుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుమ్మక్కుతో ఇలా అవసరానికి మించి విచక్షణారహితంగా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేయిస్తున్నందున వినియోగదారులపై భారాలు పడుతున్నాయి. ఆర్‌ఇని తప్పని సరిగా కొనుగోలు చేసితీరాలన్న నిబంధన వల్ల, అది అవసరం లేకపోయినా కొనితీరేందుకు థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి తగ్గించాలని ఆదేశించి ఆ ప్రాజెక్టులకు ఆ మేరకు స్థిర చార్జీలను డిస్కంలు చెల్లించాల్సి వస్తుంది. ఆ విధంగా అవసరంలేని ఆర్‌ఇ కొనుగోలుకు అధిక చార్జీలు చెల్లిస్తూ, మరోపక్క థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు ఉత్పత్తి తగ్గించినందుకు స్థిర చార్జీల చెల్లింపు రూపంలో వినియోగదారులపై రెండు విధాలుగా భారాలు మోపుతున్నాయి. ఆర్‌ఇ పీక్‌ డిమాండ్‌ను తీర్చలేదు గనుక, ఒక పక్క భారీగా మిగులు విద్యుత్‌ ఉన్నా డిస్కంలు ఎక్స్చేంజ్‌ల ద్వారా అధిక ధరలకు అదనంగా విద్యుత్‌ కొనుగోలు చేయాల్సి వస్తున్నది. ఆర్‌ఇ కొనుగోలువల్ల తమకు ఏడాదికి రూ.5000 కోట్లకుపైగా నష్టం వాటిల్లుతున్నదని ఆర్‌ఇ కొనుగోలు కోసమే తగ్గిస్తున్న ఉత్పత్తిలో 90 నుంచి 95 శాతం మేరకు థర్మల్‌ విద్యుత్‌ ఉంటున్నదని ఎ.పి డిస్కంలు పలుమార్లు ఎపిఇఆర్‌సికి నివేదించాయి. 2023-24 సంవత్సరానికి డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్‌ అవసరంలో ఆర్‌ఇ లభ్యత 15349.94 ఎంయు 19 శాతం అవుతుంది. అదే సంవత్సరానికి 12,469 ఎంయు మిగులు విద్యుత్‌ లభ్యతను చూపుతూ ఇంత ఆర్‌ఇని అనవసరంగా కొనటం వల్ల వినియోగదారులపై నివారించదగిన భారాలు పైన వివరించిన విధంగా పడుతూనే ఉంటాయి. ఇలాంటి భారాలన్నీ విద్యుత్‌ చార్జీల పెంపు, ఎఫ్‌పిపిసిఎ చార్జీల రూపంలో పడుతున్నాయి. వచ్చే మూడేళ్లలో ప్రతి ఏటా సెప్టెంబరు మాసం నుంచి మొత్తం 17,00 ఎంయు సౌరవిద్యుత్తును రాజస్థాన్‌ లోని అదానీ ప్రాజెక్టుల నుంచి సెకీ ద్వారా కొనుగోలు చేసే ఒప్పందాలు అమలులోకి వస్తే ఆర్‌ఇ లభ్యత అవసరానికి మించి విపరీతంగా పెరిగి వినియోగదారులపై ఇంకా భారాలు పెరుగుతాయి.

venu

 

 

 

 

 

 

వ్యాసకర్త  ఎం. వేణుగోపాలరావు విద్యుత్‌ రంగ నిపుణులు