
- డబ్ల్యుహెచ్‌ఒ సిఫార్సులకు మించిన మోతాదులో వినియోగం
న్యూఢిల్లీ : భారత ప్రజానీకం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) సిఫార్సు చేసినదాని కన్నా ఎక్కువ మోతాదులో ఉప్పును తింటున్నారని ఒక నివేదికలో వెల్లడైంది. రోజుకు 5 గ్రాముల వరకు మాత్రమే ఉప్పు తీసుకోవాలని డబ్ల్యుహెచ్‌ఓ సిఫార్సు చేస్తోంది. కానీ మన దేశంలో మాత్రం సగటున 8 గ్రాములు (పురుషులు రోజుకు 8.9 గ్రాములు కాగా మహిళలు 7.1 గ్రాములు) తీసుకుంటున్నారని వెల్లడైంది. అదనంగా ఉప్పు తీసుకోవడమనేది పురుషుల్లో అధికంగా వుంటుంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో వున్నవారు, అలాగే అధిక బరువు వున్నవారు, ఊబకాయంతో బాధపడుతున్నవారు ఎక్కువ తీసుకుంటారని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) ఇటీవల తన సర్వేలో పేర్కొంది. నేచర్ జర్నల్‌లో ఈ సర్వే వివరాలను ప్రచురించారు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలని, అలాగే బయట వండిన ఆహారాన్ని కూడా తినడం మానివేయాలని ఈ అధ్యయనం నివేదిక రూపకర్త, ఐసిఎంఆర్ డైరెక్టర్ ప్రశాంత్ మాథుర్ పేర్కొన్నారు.
18-69 సంవత్సరాల మధ్య వయస్సు గల 10,659 మందిపై సర్వే నిర్వహించారు. ఉద్యోగం చేసేవారిలో ఉప్పు తీసుకోవడం అధికం (8.6 గ్రాములు)గా వుందని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే పొగ తాగేవారిలో, హై బిపి వున్న వారిలో కూడా ఇది ఎక్కువగానే వుందన్నారు. ఉప్పు తక్కువ తీసుకుంటే 25 శాతం వరకు బిపి తగ్గడానికి అవకాశం వుంటుంది. 2025 కల్లా సగటు జనాభాలో ఉప్పు తీసుకునేవారి సంఖ్య 30 శాతం తగ్గేలా చూడాల్సి వుందని అధ్యయనం పేర్కొంది. భారత్‌లో సంభవించే మరణాల్లో కార్డియోవాస్క్యులార్ వ్యాధుల వల్ల చోటు చేసుకునే మరణాలు 28.1 శాతంగా వున్నాయి. 1990లో ఈ వ్యాధులతో 7.8 లక్షల మంది మరణించగా, 2016లో ఈ సంఖ్య 10.63 లక్షలకు పెరిగింది. హై బిపి ఇందుకు ప్రధాన కారణంగా వుంది.