Feb 23,2023 09:13
  • ర్యాండమ్‌ తనిఖీల్లో భారీగా లోపాలు గుర్తింపు
  •  సరి చేయకపోతే రైతులకు నష్టం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఇ-క్రాప్‌ నమోదులు తప్పుల తడకలుగా తయారవుతున్నాయి. రైతులకు అందించే అన్ని పథకాలు, సహాయాలు, చివరికి పంటల అమ్మకానికి సైతం ప్రభుత్వం ఇ-క్రాప్‌ను తప్పనిసరి చేయగా సాగుల నమోదులో తప్పులు దొర్లడం వలన రైతులు అవస్థలపాలవుతున్నారు. ఇ-క్రాప్‌ నమోదుల్లో లోపాల కారణంగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన చెందుతుండగా, పక్కాగా నమోదులు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కాగా వివిధ స్థాయిల్లోని పర్యవేక్షణాధికారులు ర్యాండమ్‌గా (మచ్చుకు/లాటరీ) తమకు నిర్దేశించిన పరిమాణంలో చేసిన తనిఖీల్లో పెద్ద ఎత్తున లోపాలు చోటు చేసుకున్నాయి. నిర్దేశిత స్వల్ప నిష్పత్తిలో అధికారులు చేసిన తనిఖీల్లో అన్నేసి తప్పులు కనిపిస్తుంటే, మొత్తం సాగు నమోదులను తనిఖీ చేస్తే ఇంకెన్ని తప్పులు బయట పడతాయోనన్న ఆందోళన నెలకొంది. లోపాలపై రైతుల ఆక్రందన నిజమేనని సూపర్‌వైజరీ అధికారుల ర్యాండమ్‌ చెక్‌ రిపోర్ట్‌ తేటతెల్లం చేసింది. సదరు నివేదికపై బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన వ్యవసాయ కమిషనర్‌ అధికారులపై సీరియస్‌ అయ్యారు. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకొని రిపోర్టు పంపాలని ఆదేశించారు.

  • బాధ్యులెవరు?

రైతులు వారి పొలాల్లో ఏ పంట వేశారో ఆన్‌లైన్‌లో రైతుల సమక్షంలో రికార్డు చేసే ప్రక్రియ ఇ-క్రాప్‌. రెవెన్యూ, వ్యవసాయ, హార్టికల్చర్‌, సెరికల్చర్‌ డిపార్టుమెంట్లు ప్రతి ఏటా ఖరీఫ్‌, రబీలో ఇ-క్రాప్‌ నమోదు చేస్తున్నాయి. రెవెన్యూ సిబ్బంది సహకారంతో గ్రామాల్లో రైతు భరోసా కేంద్రం (ఆర్‌బికె) సిబ్బంది చేలు తిరిగి సాగులు నమోదు చేయాలి. ఈ ప్రక్రియలో లోపాలు జరక్కుండా, పారదర్శకంగా ఉండేందుకు ఆర్‌బికెలలో జాబితాలు ప్రదర్శించాలి. గ్రామసభలు నిర్వహించి అభ్యంతరాలను సేకరించాలి. దాంతోపాటు ఆర్‌బికె సిబ్బంది చేసే నమోదులను రెవెన్యూ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, సెరికల్చర్‌ డిపార్టుమెంట్‌లకు చెందిన వివిధ స్థాయి అధికారులు సూపర్‌వైజరీ చెకింగ్‌ చేయాలి. ఆయా శాఖల మండల, డివిజన్‌, జిల్లా అధికారులతో పాటు జాయింట్‌ కలెక్టర్‌, కలెక్టర్‌ సైతం తనిఖీలు చేయాలి. కమిషనర్లు సైతం తనిఖీ చేయాలి.

  • అన్నేసి లోపాలు

ప్రస్తుతం రబీ పంటల ఇ-క్రాప్‌ జరుగుతోంది. ఈ నెలాఖరుతో ముగించనున్నారు. సూపర్‌వైజరీ అధికారుల ర్యాండమ్‌ తనిఖీల్లో ఎంతగా తప్పులు కనుగొంటున్నారో తాజా నివేదిక తెలుపుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ తప్పులు గుర్తించారు. మొత్తం 4,213 తప్పులు కనుగొన్నారు. డిఎఒ స్థాయిలో 3 శాతం సాగులను తనిఖీ చేయాలని నిర్దేశించగా ఆ స్వల్ప పరిమాణంలో 80 తప్పులు దొర్లాయి. జెసి 2 శాతం తనిఖీ చేయాల్సి ఉండగా 23 లోపాలు గుర్తించారు. కలెక్టర్‌ 1 శాతం తనిఖీ చేయాల్సి ఉండగా వాటిలోనే 39 తప్పులు, కమిషనర్‌ చేసిన తనిఖీలో 39 తప్పులు దొరికాయి. మొత్తంగా రాష్ట్రంలో 16,136 తప్పులు గుర్తించారు. డిఎఒల తనిఖీల్లో 398, జెసిల చెకింగ్‌లో 287, కలెక్టర్ల తనిఖీలో 172, హెచ్‌ఒడి తనిఖీలో 177 తప్పులు గుర్తించారు. క్షేత్ర స్థాయి అధికారులైన ఎంఎఒ, ఆర్‌ఐ, తహశీల్దార్‌, ఎ.డి, ఆర్‌డిఒల తనిఖీల్లో వందలు, వేల తప్పులు దొర్లాయి. ఇ-క్రాప్‌ బుకింగ్‌ లోపభూయిష్టంగా ఉందనడానికి ఈ తప్పులే ఉదాహరణ. అందుకే రైతులు పంటల బీమా, పావలావడ్డీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ కోల్పోతున్నారు. చివరికి తాము పండించిన పంటలను సైతం అమ్ముకోలేకపోతున్నారు.