Jun 04,2023 06:29

రోడ్డు, రైలు, ఆకాశ మార్గం...ఈ మూడింటిలో ఏది సురక్షితమైన ప్రయాణం అంటే? అందరూ రైలు ప్రయాణమే సురక్షితమని చెబుతారు. బొగ్గుతో నడిచే స్థాయి నుంచి బుల్లెట్‌ వేగంతో దూసుకుపోయే వేగంతో మన దేశ రైల్వే రంగం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంది. టెక్నాలజీలో ఇతర దేశాలతో పాటు సమానంగా ఎదిగాం-అని ఏలికలు గొప్పలు చెప్పుకుంటూ వుంటారు. అయితే ప్రయాణీకుల భద్రత ప్రాధాన్యతపై ఇప్పుడు సర్వత్రా సందేహాలు, ఆందోళనలు మొదలవుతున్నాయి. ఎందుకంటే జూన్‌ 2 శుక్రవారం సాయంత్రం ఒడిశాలో (బాలాసోర్‌) జరిగిన రైలు ప్రమాదం మన దేశ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైనదని, విషాద సంఘటనని తెలుస్తోంది. ఒడిశా రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్య 300కు సమీపంలో వుండడం కలవరపాటుకు గురిచేస్తోంది. సంఘటనపై రైల్వేశాఖ సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలు తప్పక అందజేస్తుంది. కానీ ఎవరూ తీర్చలేని, పూడ్చలేని భారీ ప్రమాదమనే చెప్పాలి. ఒక చిన్న తప్పిదం వల్లే భారీ ప్రమాదం జరిగిందని చెప్పాలి. టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన తరుణంలో ఇటువంటి భారీ నష్టం సంభవించడం ఎవరికీ మింగుడు పడ్డం లేదు. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మెయిన్‌ లైన్లో సిగల్‌ వుండగా, లూప్‌లైన్‌ లోకి దూసుకుపోయి, ఆగివున్న గూడ్స్‌ రైలును ఢకొీట్టింది. ఆ సమయంలో గూడ్స్‌ రైలు అక్కడ ఎందుకు వుంది? గతంలో రైల్వేశాఖ చేసిన ప్రకటనకు ఈ ప్రమాదానికి పొంతన లేదనే చెప్పాలి. ఎందుకంటే ఒకే లైన్లో కొంత పరిధిలో పొరపాటున రెండు రైళ్లు వస్తే వాటికవే ఆగిపోతాయని గతంలో రైల్వేశాఖా మంత్రి కూడా ప్రకటించారు. కానీ గూడ్స్‌ రైలు ఆగివున్న లూప్‌ లైన్లోకి అతివేగంగా వెళ్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎందుకు వెళ్లింది? ఈ ప్రమాదంలో పక్క ట్రాక్‌పై కోరమండల్‌ రైలు బోగీలు పడినప్పుడు, ఆ ట్రాక్‌పై వస్తున్న బెంగుళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురికావడం వల్ల మరింత నష్టం చేకూరింది. హౌరా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ రాకుండా నిరోధించడంలో కూడా వ్యవస్థ విఫలమైందా? అనే సందేహాలు వినబడుతున్నాయి. వందల కోట్ల రూపాయల వ్యయంతో టెక్నాలజీని అభివృద్ధి చేస్తే... ఈ ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి సంఖ్య వందల్లో వుండడమేమిటి? రైలు ప్రయాణీకుల్లో మరింత ఆత్మస్థైర్యం పెరిగేలా, భవిష్యత్తులో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా టెక్నాలజీని వినియోగించుకోవాలని విజ్ఞులు సూచిస్తున్నారు. ఒడిశా ప్రమాదం మానవ తప్పిదమా? కాదా? అనేది విచారణలో తేలుతుంది. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలకు ప్రభుత్వాలు ఎంత పరిహారం ఇచ్చినప్పటికీ పోయిన ప్రాణాలకు వెలకట్టలేం. కాకపోతే రైలు ప్రయాణం సురక్షితం అనే నమ్మకాన్ని తిరిగి తీసుకువచ్చేలా రైల్వే నిర్వహణ వుండాలన్నది ప్రతి ఒక్క ప్రయాణీకుడి అభిప్రాయం.

- దవరసింగి రాంబాబు