Jun 25,2023 15:55

ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్‌ : కర్నూలు జిల్లాను ఎడారిగా మార్చకండి అని సిపిఎం రాష్ట్ర సభ్యురాలు పి.నిర్మల అన్నారు. ఆదివారం కార్మిక కర్షక భవన్‌లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పి.నిర్మల మాట్లాడుతూ.. గతంలో కరువులో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉండేదని కానీ జగన్‌ ప్రభుత్వ నిర్వాకం వల్ల కర్నూలు జిల్లా పరిశ్రమలు ప్రాజెక్టులు ఇతర మౌలిక రంగాలు అన్నింటిలో బాగా వెనకబడి వలసల జిల్లాగా ఖ్యాతి గడించిందని విమర్శించారు. ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి గాని ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్‌ సభ్యులు గాని, ఎమ్మెల్యేలకు గాని చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జిల్లాలో ఒక్క పరిశ్రమ కూడా నూతనంగా స్థాపించినందున చదువుకున్న నిరుద్యోగులు అందరూ హైదరాబాద్‌, బెంగళూరు ఇతర రాష్ట్రాలకు వలసలు పోయి బ్రతుకుతున్నారని ఆవేదన తెలియజేశారు. జిల్లాలో గుండ్రేవుల, వేదవతి, నగర డోన రిజర్వాయర్‌ లాంటి ప్రాముఖ్యమైన ప్రాజెక్టులు నిర్మిస్తే జిల్లా సాగునీటి తాగునీటి రంగాలలో సస్యశ్యామలం అవుతుందని ఆమె తెలియజేశారు. సిపిఎం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రాజెక్టు ఇంజనీర్లతో చర్చించి సమగ్రమైన ప్రణాళిక తయారుచేసి గతంలో ఉన్న ప్రభుత్వాలకు ప్రస్తుతం ఉన్న జగన్‌ ప్రభుత్వానికి పరిశ్రమలు ప్రాజెక్టుల స్థాపన గురించి వాటికి అనువైన వనరుల గురించి సమగ్ర నివేదిక సమర్పించిందని తెలిపారు. కానీ ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం జిల్లాకు పట్టిన గ్రహణమని ఆమె తెలిపారు. జగన్‌ ప్రభుత్వం ప్రజలకు బటన్‌ నొక్కి తాయలాలు ఇవ్వడం మాత్రమే చేస్తున్నదన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిధులు వెచ్చించడంలో మాత్రం ఏ మాత్రం కృషి లేదని విమర్శించారు. కర్నూలు జిల్లాలో పరిశ్రమలు నిర్మించకుండా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా జిల్లా అభివృద్ధిలో ఎలాంటి సమగ్ర మార్పులు తీసుకురాలేరని ఆమె ప్రభుత్వానికి తెలియజేశారు. కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదికి ఆవల అప్పర్‌ భద్ర ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రభుత్వం చలనం లేకుండా వ్యవహరిస్తున్నదని అప్పర్‌ భద్ర పూర్తి అయితే మన జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల కు కూడా నీరుఅందక ఎడారులుగా మారుతాయి అని ఆమె తెలిపారు. నేటి ప్రభుత్వం ప్రజలకు తాయిలాలు ఇచ్చి ప్రజలను చాలా ఆదు కుంటున్నానని భ్రమలలో ఉందని తెలిపారు. తాయిలాలు ఇస్తున్న ప్రభుత్వం మరో చేతితో ఇంటి పన్నులు, విద్యుత్‌ చార్జీలు, ట్రూ అప్‌ చార్జీలు, రవాణాచార్జీల భారంతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ఘాటుగా విమర్శించారు. సిపిఎం మరోసారి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్యం, మెరుగైన సౌకర్యాల కల్పన కోసం, ప్రజలపై పెరుగుతున్న భారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకు రూపకల్పన చేస్తుందని తెలిపారు. సమావేశానికి సిపిఎం నాయకులు నరసింహులు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ పెట్టుబడి వాటి వల్ల ప్రజలపై పడుతున్న భారాలు సమాజంలో ఏర్పడుతున్న తీవ్ర అసమానతల గురించి ప్రజాశక్తి మేనేజర్‌ గార్లపెంట నరసింహులు దేశంలో పెట్టుబడిదారుల ఆర్థిక కేంద్రీకరణ ప్రైవేటీకరణ దుష్ఫలితాలపై సిపిఎం కార్యకర్తలకు వివరించారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి టి. రాముడు సి హెచ్‌ .సాయి బాబా కార్యకర్తలు పాల్గొన్నారు.